ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, February 21, 2015

నేటి భారతం.



నేను ఒక అరగంట క్రితం ఇంటికి వచ్చే సరికి ఈటీవి 2 లో వక్తలు మాట్లాడుతున్నారు. జపాన్‌లో అలా ఉంటారు, ఇలా ఉంటారు అని. బాగానే ఉంది. దానిని ఎవరూ కాదనరు. అక్కడ వర్క్ కల్చర్ కూడా వేరేగా ఉంటుంది అనేది, గొడ్లు కాసుకునే వాడికి కూడా తెలుసు. జపాన్ అయినా, సింగపూర్ అయినా అలా ఉండడానికి కారణం రాజకీయ అవినీతిని అక్కడ ఉపేక్షించకపోవడం.


దానిని ప్రక్కన పెట్టినా, ఇప్పుడు మన రాష్టంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో ఎన్ని చదువును చెప్పేవి ఉన్నాయి? ఆ కాలేజీలకు ఎవరు అనుమతిచ్చారు? అటువంటి కాలేజీల నుండి వచ్చినవారి దగ్గర నుండి నువ్వు ఏమి పొందగలవు? ఏదో ఎంసెట్‌లో సీట్ వచ్చిన వాడే మేధావి అని అనుకోవడం పొరపాటు. లక్ష ర్యాంక్ వచ్చిన వాడు కూడా మంచి ఉపాధ్యాయులు ఉంటే, ఒక మంచి ఇంజనీర్ కాగలడు. కానీ జరుగుతున్నది ఏమిటి? వీళ్ళు జపాన్‌లు, సింగపూర్‌లు వెళ్ళక్కరలేదు. మన దగ్గర ఉన్న పారిశ్రామిక వేత్తలను అడిగినా చెపుతారు, వచ్చేదంతా స్క్రాప్ అని. దానికి కారణం ఈ నాయకులు కాదా? అలాగే పరిశ్రమ అధిపతులు కూడా ఓహో జపాన్ అంటున్నారు. నిజమే ఓహో జపానే. కానీ అక్కడ పరిశ్రమల అధిపతులు వీళ్ళల్లాగా కాపీ కొట్టరు, రీసెర్చ్ మీద ఖర్చుపెడతారు. శ్రామికుడి శ్రమ శక్తిని దోచుకోరు.



పైగా వాళ్ళు మాటల్లో మనలో ప్రతీ దానినీ వ్యతిరేకించే భావన పోవాలని సుద్దులు కూడా చెప్పారు. అంటే వాళ్ళు ఎటువంటి విత్తనాలు వేసినా మనం మాట్లాడకూడదన్నమాట. చెప్పేవాడికి వినే వాడు లోకువ అని ఊరికే అనలేదు. ముందు విద్యా వ్యవస్థని ప్రక్షాళన కావించాలి. ఆ ధైర్యం మన ప్రభుత్వాలకు ఉందా? ఎవడన్నా, పక్కోడిని చూసి అలా ఎదగడానికి చూస్తాడు కానీ, పక్కోడు గొప్ప, మనం ఉట్టి సోంబేరిలం అని అనడు. అధికారం ఉంది కదా, అలా ఎదగడానికి ప్రణాళికలు తయారుచెయ్యండి, ఇక్కడ తెలివితేటలకు లోటు లేదు, దరిద్రం అంతా, మీ ధనాపేక్ష ఒక్కటే

నేటి భారతీయుడు



నా తరం వాళ్ళు, నా ముందటి వాళ్ళు గారడీ వాళ్ళను చూసే ఉంటారు (నేను వినడమే తప్ప చూడలేదు). ఆ గారడీ చేసే వ్యక్తి ప్రక్కన అతని కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు డప్పులు కొడుతూ అతనిని ఉత్సాహపరుస్తుంటారు. ఉన్నట్టుండి తేళ్ళు, పాములు వచ్చేస్తాయంట. అలాగే డబ్బులు వచ్చెసేవంట. దానినే కనికట్టు విద్య అంటారు, వాళ్ళను మోళీగాళ్ళంటారనుకుంటా.


అలాగే ప్రపంచ మెజీషియన్స్‌కి ఇప్పటికీ తెలియని, అర్థం కాని విద్య "ఇండీయన్ రోప్ ట్రిక్". మెజీషియన్ ఒక త్రాడుని ఆకాశంలోకి విసిరి, దానిని పట్టుకొని పైకెక్కి, కనిపించకుండా పోయేవాడంట. అందరూ అలా చూస్తుండగానే, వాళ్ళ మధ్యలో నుండి ఆ పైకి వెళ్ళిన వచ్చి పలకరించేవాడంట.


ఇప్పుడు మన దగ్గర ఆ మోళీ గాళ్ళు మన రాజకీయ నాయకులు. అప్పుడు ప్రక్కన డప్పు కొట్టే వాళ్ళు (అప్పుడంటే ఒక చిన్న సమూహానే మాయలో పడేసేవారు) ఇప్పుడు టీవీలలో మేధావులుగా, టాక్ షోలలో కనిపిస్తున్నారు. వీళ్ళందరూ చాలా చదువుకున్న వాళ్ళు. వాళ్ళకు వాళ్ళ పార్టీలు, నాయకులు ఏది చెపితే అదే వాస్తవం అనిపిస్తుంది (?). వాళ్ళ నాయకుడు తీసుకున్న ఏ నిర్ణయానైనా, టీవీలలో అందంగా ఎకానమీని ఉటంకిస్తూ ప్రజలను కనికట్టుతో కట్టేస్తారు. మన కళ్ళ ముందు సింగపూర్ సిటీలను సృష్టిస్తారు. అది నిజమని అనుకొని, మనం ఇప్పుడు కావలసిన గంజిని మరచిపోతాము.


ఒకరి మీద ఒకరిని రెచ్చగొడతారు. అడవులు నరికి పరిశ్రమలు స్థాపించాలి అంటారు. పారిశ్రామికవేత్తలకు తప్ప, రైతుకు తన పొలం మీద తనుకు హక్కు లేకుండా చేస్తారు. ఒక ప్రక్క గంగ ప్రక్షాళన అంటారు, ఇంకో ప్రక్క కొన్ని పరిశ్రమలకు పర్యావరణ అనుమతులు అక్కరలేదు అంటారు. విజనరీని అంటారు, మనకు విజన్ లేకుండా చేస్తారు. చాయ్ వాలాను అంటారు, మనకు చాయ్ లేకుండా చేస్తారు. దాహం అంటే హిమాలయాలలో పుట్టిన గంగ నీళ్ళు అమ్ముతున్నాం అంటారు. వైజ్ఞానికంగా ఎదగాలి అంటారు, విజ్ఞానాన్ని మాత్రం విదేశాల నుండీ కొంటాం అంటారు. సరస్వతి పుట్టిన దేశం అంటారు, సరస్వతిని అంగడి సరుకుని చేస్తారు. ఉద్యోగులకు లొంగుతారు, రైతులను అమ్ముతారు.


అమ్మా, నాన్నలకు దణ్ణం పెట్టని వాళ్ళు వీళ్ళ కాళ్ళకు మొక్కుతారు. అమ్మా, నాన్నల ఫొటోలు కనపడవు కానీ, నాయకుల ఫొటోలు గుండెల మీద వ్రేలాడుతుంటాయి.. వీళ్ళ బానిసత్వాన్ని మనకు అలవాటు చేసేస్తారు. మనం లొంగకపోతే పిచ్చి కుక్కల్లా అరుస్తారు.



ఇది నేటి భారతం.

Saturday, January 3, 2015


ఇది నేను ఎవరినీ తప్పు పడుతూ రాస్తున్నది కాదు, కాని అంటరానితనం అనేది దేవుడు సృష్టిస్తే వచ్చిందో, లేక మనువు రాస్తే వచ్చిందే కాదు అని అనిపిస్తోంది. ముఖ్యంగా సామాన్యుడికి పరిపాలనా పరంగా జరుగుతున్న అన్యాయాలు గమనిస్తుంటే ఇప్పుడు పరిపాలన చేస్తున్న రాజకీయపార్టీలు, దాని అభిమానులూ కొన్ని దశాభ్దాలో, శతాభ్దాలో గడిచేసరికి అంటరాని కులంగా మారిపోతారు అనిపిస్తోంది. అనిపించడం ఏమిటీ, నేను రాజకీయకులాన్ని ఎప్పటినుండో అంటరాని వాళ్ళుగానే చూస్తున్నాను.

సామాన్యుడి భూమిని, అతని అంగీకారం లేకుండానే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అనే ఈ ఆర్డినెన్స్ ఒక్కటి చాలు, సామాన్యుడి శవాల గుట్టలు పేరుకుపోవడానికి. ఎప్పుడో హిందువులను ఊచకోతకు గుర్తుగా దేశ సరిహద్దుల్లో ఏర్పడిన హిందూ కుష్ పర్వతాలలాంటివే, ఇప్పుడు ప్రతీ జిల్లాలోనూ రైతు కుష్ పర్వతాలు ఏర్పడతయేమో.

అభివృద్ధి అంటే అందరూ బాగుండడం, కొందరే బాగుపడడం కాదు. ఒకప్పుడు నేను దేవుడు పాదయాత్రలో చూసింది పంటపొలాలు కానీ, సామాన్యుల వెతలు కాదు అని ఉక్రోసంతో అరిచాను. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. అక్కడ మోడీ అయినా, ఇక్కడ బాబు అయినా దానికి అభిమానులం మనం వత్తాసు పలకడం ద్వారా చేస్తున్నది అదే.

హత్యలు చేసేవాడికీ, మానభంగాలు చేసేవాడికి వాడి రీజనింగ్ వాడికి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెపుతున్న రీజన్స్ కూడా అవే. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యావరణ అనుమతులు ఆలస్యం అవుతున్నాయి, రక రకాల అడ్డంకులు సృష్టిస్తున్నారు అని వాపోయేవాడు. ఇప్పుడు ప్రధాని అవ్వగానే తన కోరిక తీర్చుకుంటున్నాడు. అదే ప్రకృతిలో కొద్దికాలం సన్యాసాశ్రమం స్వీకరించి గడిపిన అనుభవం ఉండీ, ఈ రోజు అదే ప్రకృతిని నాశనం చెయ్యాలని అనుకోవడం, చాయ్ అమ్ముకునేవాడిని, నేను పెద్ద పెద్ద పనులు చెయ్యను, సామాన్యుడికి కావలసిన చిన్న చిన్న పనులే చేస్తాను అని అంతర్జాతీయ వేదికల మీదా తన వాగ్ధాటిని ప్రదర్శించి, ఇప్పుడు ఆ చిన్న చిన్న పనులే చేసి సామాన్యుడి ఉసురు తీస్తున్నాడు.

ఇక ఈ దేశ అదృష్టం బాగుండి, బాబు ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు కాబట్టి సరిపోయింది కానీ, అదే ప్రధాని అయ్యుంటే, కొత్త రాజధాని అని చెప్పి, మన ఉమ్మడి రాష్ట్ర విస్తీర్ణం అంత భూమిని లాక్కునేవాడేమో.

కలియుగం అంటే ఇదే. ఇపుడు ఉసురు తగలడాలు, నాశనం అవ్వడాలు ఉండవు అనుకుందామంటే, కొన్ని చూసాము కాబట్టి, ఉంటాయి అని కొద్దిగా నమ్మకం కలుగుతోంది. అవి చూసాకా కూడా వీళ్ళకు బుద్ధి రావడం లేదంటే, వీళ్ళ వంశ నాశనాలు వీరే కొని తెచ్చుకుంటున్నట్టుంది.

Sunday, July 6, 2014

పూర్వం ఎన్నికలప్పుడు, ఆ తరువాతా రాజకీయాల పేరుతోనూ, సినిమా అభిమానం పేరుతోనూ జనాలు కొట్టుకుంటుంటే, ఆశ్చర్యం వేసేది. వాళ్ళందరూ చదువు లేనోళ్ళనుకునేవాడిని. కానీ ఈ మధ్యన ఫేస్‌బుక్ లాంటి వాటిలో చూసుంటే మనలో కులభిమానాలు, ప్రాంతీయవాదాలు, బానిస మనస్థత్వాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. ఏ నాయకుడినయినా ఏదన్నా అంటే మీద పడిపోతున్నారు. ప్రతీ మనిషిలోనూ మంచీ, చెడూ రెండూ ఉంటాయి. మనకు నచ్చిన నాయకుడిలో అంతా మంచే అనుకునే స్థితిలో మనం ఉండి, అతనిని ఇంకెవరూ ఏమీ అనకూడదు, అంటే బూతులు తిడతాం అంటే సమాధానం ఏమీ ఉండదు. మన దగ్గర ఓటు హక్కు ఉన్నవాళ్ళే యాభై శాతం మంది ఉంటారు, అందులో ఓటు వేసేవాళ్ళు అరవై శాతం లోపు. ఆ అరవై శాతం మంది మూడు పార్టీలకు వేస్తారు. అంటే ఇరవై ఒక్క శాతం ఓట్లు వచ్చిన వాడు నాయకుడు. వాడిని ఎన్నుకున్నది మొత్తంగా చూస్తే పది శాతం మందే. అలాంటి వాడి గురించి మనం మన సంస్కారాన్ని వదిలెయ్యక్కరలేదు అనుకుంటాను. ఇక్కడ ఓడిపోయిన పార్టీలో కొంత మంది అభ్యర్ధులను మనలాంటి ప్రజలే ఎన్నుకున్నది. అలా అని ఓడిన పార్టీ వాడు నెగ్గిన పార్టీ నాయకుడిని ప్రశ్నించకూడదంటే, మనం ప్రజాస్వామ్యం వదిలేసి ఆటవిక పాలనలోకి మళ్ళడం మంచిదేమో. ఇష్టం ఉన్నా, లేకపోయినా నెగ్గిన వాడు అందరినీ పరిపాలించవలసిందే. నాకు ఇష్టం లేని వాడు నన్ను పరిపాలించకూడదు అని అనడం ఎంత తప్పో, ఓటు వెయ్యనివాడు నన్ను ప్రశ్నించకూడదు అని అనడం కూడా అంతే తప్పు.

Saturday, May 31, 2014

ఏదయినా పని మొదలుపెట్టక ముందు ఆలోచించాలి కానీ, మొదలుపెట్టాకా ఇక దాని గురించి ఆలోచించకూడదు.ఇది నరేంద్ర మోడీ నమ్ముతాడో లేదో నాకు తెలియదు కానీ, ఆర్టికల్ 370 నుంచి మొదలయిన రచ్చ, ఇప్పుడు విద్యా వ్యవస్థకు, యూనిఫాం సివిల్ కోడ్ మీదకు మళ్ళింది. ఇంకా ఇటువంటివి ఏమయినా ఉన్నాయేమో చూసి అవి కూడా ఆయనకు చెప్పి వాటి మీదకు కూడా దృష్టి పెట్టేటట్టు చెయ్యవలసిన అవసరం మనకు ఉంది. అలాగే సేవ పేరుతో జరిగే మతమార్పిడులు, సెక్యులరిజం పేరుతో ఉగ్రవాదులను వెనకేసుకొస్తున్న వారి సంగతి అన్నీ ఒకే సారి మొదలుపెట్టేయాలి. ఎక్కడా ఖాళీ అనేది ఇవ్వకూడదు. వేడిలో వేడి అన్నీ ఒకేసారి జరిగిపోవాలి. గొడవలు కూడా ఒకేసారి జరిగి అదుపు చెయ్యబడాలి. అంతే కానీ రోజుకొకటి చొప్పున మొదలుపెట్టి ఈ దేశం ఉన్నంత కాలం వాటిని అలా పొడిగించుకుంటూ వెళ్ళడం వలన ఏ పనీ సరిగ్గా కాదు. అనవసర మొహమాటాలు అనవసరం.


       ఆయనన్నట్టు ఆయన చేసేది మంచి పనే కదా (కనీసం నాలాంటి ఊరోళ్ళ దృష్టిలో)

Saturday, May 24, 2014

మొన్న రాత్రి CNN-IBN లో అనుకుంటా, కర్ణాటకు చెందిన జ్ఞానపీఠ్ (?) అవార్డు గ్రహీత, మోడీ ప్రధాని అయితే దేశం విడిచి వెళ్ళిపోతానన్న అనంతమూర్తి, మన దేశంలో స్త్రీలల్లో స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేటట్టు నటించిన ఇద్దరు స్త్రీ మూర్తులలో ఒకరు, తను మైనారిటీ కాబట్టి తనకు ఎవరూ ఇల్లు అమ్మడం లేదు (తనకు తక్కువ డబ్బు ఇస్తే తను చేస్తుందో లేదో నాకు తెలియదు) అని వాపోయిన షబానా అజ్మీల మాటలు విన్నాకా నాకు అనిపించింది ఏమిటంటే, ఈ దేశంలో మైనారిటీలు అంటే ముస్లింలు, క్రిస్టియన్స్ మాత్రమే అని, వాళ్ళను చంపితే మాత్రమే వీళ్ళ హృదయాలు ద్రవించి నీరై పోతాయని, అదే మైనారిటీలుగా ఉన్న సిక్కులను, జైనులను కానీ, కాశ్మీరులో హిందువులను కానీ చంపితే వీళ్ళకు ఏమీ అనిపించదని.

అదే 1984లో డిల్లీలో మూడు వేల మంది సిక్కులను చంపేసినా, చంపిన వాళ్ళు కాంగ్రెస్ హిందువులు కాబట్టి వీళ్ళకు ఆ మారణకాండ కనిపించలేదని, హిందువులు అయినా, ఇక వేరే మతస్థులు ఎవరైనా కాంగ్రెస్, కమ్యూనిస్టుల వాళ్ళు అయ్యి మైనారిటీలను చంపినా అది తప్పు కాదని వీళ్ళు చెపుతున్నారు. అంతే కాదు, మన జ్ఞాన్ అనంతమూర్తి గారయితే ఇంకొక అడుగు ముందుకు వేసి, ఆ ఘోరాన్ని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాను, నేను ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాను అని కూడా చెప్పాడు. ఇంతకీ అదే మాట అనుకుంటున్నారు, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదట, మోడీ గురించి ఆయన అన్నమాటట. పైగా అప్పుడు ఆయన ఆ వేదనలో ఉండి దేశం విడిచివెళ్ళిపోతానని అన్నడట కానీ, ఆయనకు ఆ ఉద్దేశ్యం లేదట. మనమే ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నామంట.

మరి అంత జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానపీఠం మీద కూర్చున్నవాడు నోరు జారితే, మరుసటి రోజైనా నేను ఏదో వేదనలో ఉండి అన్నాను కానీ, నా మాతృభూమిని వదిలి నేను ఎందుకు వెళతాను అని సరి చేసుకోవాలి కదా. అలా చెయ్యకపోవడం ఆయన తప్పు కాదంట, మనం వెళ్ళిపొమ్మనడం మన తప్పంట. మనమేమీ ఊరికే వెళ్ళిపొమ్మనలేదు కదా, ఆయన జ్ఞానపీఠం మీద ఉన్నాడు కాబట్టి, కొద్దిగా అన్నా జ్ఞానాన్ని చూపిస్తాడని ఆయన మాట ఆయనకు గుర్తు చేసాము. దానికి మనల్ని తప్పు పడితే ఎలా? నాకు ఏమిటో అంతా అయోమయంగా ఉంది. మనం ఏమన్నా తప్పు మాట్లాడామా?

Wednesday, May 14, 2014

నేను సివిల్ డిప్లొమా పూర్తి చేసింది 1981 లో అయినా, మా నాన్నగారు సివిల్ ఇంజనీరింగులో లెక్చరరే కాకుండా చార్టర్డ్ ఇంజనీరు కూడా కావడం వలన 1978 నుండీ నా ఫీల్డుతో నాకు పరిచయం ఉంది. ఆ అనుభవంతో చెపుతున్నాను.
మా ఫీల్డు ఎన్‌డియే, తెలుగుదేశం హయాం నుండి సర్వనాశనం అయ్యిపోయింది. అప్పటి దాకా ఒక పనిని పది మంది కాంట్రాక్టర్స్‌కు పది బాగాలు చేసి ఇచ్చేవారు. ఎవరికి వారు పదిహేనో, ఇరవయ్యో శాతం లాభం వేసుకొని పని చేసేవారు. కానీ వీళ్ళ పాలన వచ్చాకా వేల కోట్ల విలువ చేసే పనిని కూడా ఒకే కాంట్రాక్టర్‌కు ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ చివరకు వచ్చే సరికి ఆ పని ఏ ఐదో కాంట్రాక్టరో సబ్‌కు తీసుకొని చేస్తున్నాడు. దాని ప్రకారం లెక్క వేస్తే, కనీసం మూడో వాడు సబ్ చేసినా పని విలువ నలబై ఐదు నుండి అరవై శాతం అంచనా పెరగడమో, లేదూ అంటే అంత శాతం నాణ్యత తగ్గడమో జరుగుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న IVRCL, NCC, RAMKY, MADHUCON లాంటివి అప్పుడు పురుడుపోసుకున్నవే. వీళ్ళు కూడా వర్క్‌ని సబ్‌ కాంట్రాక్ట్‌కే ఇస్తున్నారు, అలా మూడు నాలుగు చేతులు మారుతోంది. ఈ వ్యవస్థ నశించాలి, పని తక్కువ ఖర్చుతో నాణ్యతతో పూర్తవ్వాలంటే, పూర్వంలా చిన్న కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. బిజెపి వాళ్ళ మొదటి మానిఫెస్టోలో ఉప్పు తయారుచెయ్యడానికి మల్టీ నేషనల్ కంపెనీలకు పర్మిషన్ ఇవ్వము అని చెప్పుకున్నారు. ఆ తరువాత జరిగింది మనం చూసిందే. ఇప్పుడు దేశంలో ఉన్న కన్‌స్ట్రక్షన్ పనులన్నీ కూడా పాతిక, ముపై కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. ఆ వట వృక్షాల ముందు చిన్న కంపెనీలు బ్రతకలేకపోతున్నాయి. ఇలా ప్రతీ వ్యవస్థ కూడా పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఆఖరుకు రక్షణ వ్యవస్థ కూడా. దీనిని మోడీ ఏమన్నా మారుస్తాడేమో చూడాలి.