ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Sunday, April 27, 2014



జనాభాపరంగా ఎక్కువ ఉన్నామ్ము కాబట్టి, మనది పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతోంది కానీ, అందరూ అంటునట్టు గొప్ప ప్రజాస్వామ్య దేశం కాదు. ఎప్పటికీ కాదు కూడా. ఇది నేను నిరాశావాదంతో చెపుతున్న మాట కాదు, వాస్తవ పరిస్థితిని "నిజాయితీగా" గమనించండి, మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది.

కాంగ్రెస్‌ని ఇంతకాలం గమనించాము, మధ్యలో కొద్దికాలం బిజెపిని చూసాము. కాంగ్రెస్‌తో పోల్చి చూసినప్పుడు బిజెపి పాలన బాగుంది అని అనిపించి ఉండవచ్చు. కానీ అప్పుడు కూడా అభివృద్ధిలో అవినీతి జరిగింది. కాదని ఎవరన్నా అనుకుంటే, వాళ్ళు పిచ్చోళ్ళన్నా అయ్యి ఉండవచ్చు, లేదూ ఎంతో కొంత జరిగిందిలే, ఇంతకు మించి ఎవరు మాత్రం ఏమి చెయ్యగలరు అని ఆనందపడే అల్ప సంతోషి అన్నా అయ్యుంటాడు. నేను అల్ప సంతోషిని కాదు, పిచ్చి వాడిని అంతకంటే కాదు.

ఈ దేశంలో అవినీతి చెయ్యకుండా, ఏ మనిషీ ఆనందంగా బ్రతకలేడు. దానికి కారణం మన ప్రభుత్వ విధానాలు. కనీస అవసరం అయిన, మంచి నీరు కూడా రెండు రూపాయలకే ఇస్తాము అని గొప్పగా చెప్పుకోవలసిన స్థితికి మన నాయకులు వచ్చేసారు. ప్రపంచంలో ఎక్కడైనా కరువు వచ్చినప్పుడు మాత్రమే రైతు నష్టపోతాడు. మన దేశ రైతు దౌర్భాగ్యం ఏమిటంటే, ఎప్పుడూ నష్టపోతూనే ఉంటాడు.

జైలులో ఉండి, బెయిల్ మీద బయటకు వచ్చి, ఎన్నికలలో నిలబడిన వ్యక్తికి ప్రభుత్వం రక్షణ కల్పించే దుస్థితి మన దేశంలోనే ఉందేమో. అది నేనే చేసాను, ఇదీ నేనే చేసాను అని చెప్పుకునే వ్యక్తి మధ్యపాన నిషేధాన్ని అమలు పరచలేనని నిషేధాన్ని ఎత్తివేసి, ప్రజల ప్రాణాల మీద వచ్చే పన్నులతో పరిపాలన చేసాడు. ఆరోగ్యశ్రీ పేరుతో ప్రజల సొమ్ముని కార్పొరేట్ హాస్పిటల్స్‌ వాళ్ళకు కట్టబెట్టి, ప్రభుత్వ వైద్యశాలలను పడుకోబెట్టిన వ్యక్తి ఈ దేశంలో మాత్రమే దేవుడిగా పిలువబడతాడేమో. సంస్క్రృతీ పరిరక్షకులం అని చెప్పుకునే పార్టీ వాళ్ళు, పరిపాలనలో ఉండగా మాత్రం గోహత్యను నిషేధించలేకపోయారు.

ప్రతీ పార్టీ కూడా పారిశ్రామిక వేత్తల చేతుల్లో ఉన్న ఈ దేశంలో సామాన్యుడి కోసం పరిపాలన చేసేవాడిని మనం చూడగలము అని అనుకుంటే, అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు.

ప్రతీ ఐదువేల సంవత్సరాలకొకసారి భూమి మీద యుద్ధం వలనో, ఉత్పాతాల వల్లనో జనాభా ముప్పాతిక భాగం నశించిపోతుందనేది నిజమైతే, అది జరిగే దాకా మనం ఏదైనా ఆశించడం అనవసరం. మహా భారత యుద్ధం జరిగి ఇప్పటికి ఐదువేల సంవత్సరాలు అయ్యింది అని లెక్కలు చెపుతున్నారు కాబట్టి మనం ఆ క్షణాల గురించి ఎదురుచూడడమే.

Monday, March 17, 2014

ఇప్పుడు సోషన్ నెట్ వర్క్స్‌ని ప్రతీ పార్టీ వాడుకుంటోంది. మనం పెట్టే కొన్ని పొస్టులు, రాసే కొన్ని కామెంటులు  కొంత మంది రాజకీయ నాయకులైనా అప్పుడప్పుడు చూసే అవకాశం ఉంది. కాబట్టి మనం అభిమానించే  పార్టీ / నాయకుడిలో మనకు తప్పు కనిపించినప్పుడు దానిని ఫేస్‌బుక్ / ట్విట్టర్‌ల ద్వారా చెపితే సరిదిద్దుకోవడానికి (సరిదిద్దుకోరు  అనేది అందరికీ తెలుసు, కానీ ఎక్కడైనా కొద్దిగా పలచటి చర్మం ఉన్నవాడు ఉంటే వాడికోసం) అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం. అంతే కానీ నా పార్టీ గంగలాంటిది, నా నాయకుడు అపర భగీరధుడు అని చెప్పడం వలన ఉపయోగం కంటే అపకారమే ఎక్కువ జరుగుతుంది. మన దేశంలో అన్ని  వ్యవస్థలను మన రాజకీయనాయకులు నిర్వీర్యం చేసేసారు. కాబట్టి వాళ్ళను అదుపు చెయ్యగలిగేది మనమే. 

నా అంచనా ప్రకారం 

 అతి తొందరలో మన దేశంలో అంతర్యుద్ధాలు మొదలవుతాయి. అవి మొదలు కాకుండా ఉండాలంటే మనమే మేలుకోవాలి. మన దేశంలో ఏ వ్యవస్థా ఆఖరికి న్యాయ వ్యవస్థ కూడా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడలేదు.ఇప్పుడు, నిరక్ష్యరాశ్యులయిన రాజకీయనాయకుల కంటే విద్యావేత్తలయిన రాజకీయనాయకులే ఎక్కువగా మన దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఈ విషయంలో విద్య అపాత్ర దానం కాకూడదు అని మనువు చెప్పిన వాస్తవాన్ని అందరం ఒప్పుకోవలసిందే.

Wednesday, January 15, 2014

చాలా కాలం అయ్యింది బ్లాగ్ వ్రాసి, ఎందుకనో ఈ రోజు మళ్ళీ రాయాలనిపించింది. ఏమి వ్రాయాలి? మనసు చాలా భారంగా ఉంది. ఏదో కాలక్షేపానికి అని ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసాను. కానీ చివరికి అది నాకు సమయం చాలకుండా చేసింది. కాలక్షేపం అనుకున్నది కాస్తా వ్యసనమయ్యి కూర్చుంది. ఒక విధంగా మంచే జరిగింది అనిపిస్తోంది.  

గతం గతః




మన జాతి ఇలా ఎందుకుందో తెలుసుకోవలసిన అవసరం, మనకు మునుపు కంటే ఇప్పుడే ఎక్కువ కనిపిస్తోంది. "గతం గతః" అనే భావనను, మన పెద్దలు మన మంచి కోరి వ్యాప్తి చేసారు. అది వ్యక్తిగతంగా అనవసర శతృభావనలు ఉండకూడదు, జరిగిన చెడుని మరచిపోయి, తిరిగి మామూలు జీవితం గడపాలి అనే సదుద్ధేశ్యంతో మనకు ఎప్పుడూ చెపుతుంటారు. కానీ అలా అనుకోవడం జాతికి కూడా అన్వయించేసుకుంటున్నాము మనము. చరిత్రని మరచిన ఏ జాతీ ప్రపంచాన్ని ఏలలేదు, చరిత్ర నుండి ప్రేరణ పొందాలి, జరిగిన అవమానాలు గుర్తుచేసుకోవాలి, పైకి ఎదగాలి. అది మన జాతిలో ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మన జాతి ప్రపంచాన్ని ఏలుతుంది. 

నేను, నాథూరాం గాడ్సే మరణ వాంగ్మూలం పుస్తకం తెప్పించమని ఒక ఆర్.ఎస్.ఎస్ ముఖ్యుడిని అడిగాను. దానికి ఆయన ఇప్పుడు, గాంధీ లేడు. గాడ్సే లేడు, అవి చదివి మనం తెలుసుకోవడం వలన ఏమన్నా ఉపయోగం ఉందా అని అన్నారు. ఈ భావన పోవాలి. చరిత్ర నిజాయితీగా తెలుసుకోవాలి, తప్పొప్పులు చూసుకోవాలి.

కనీసం మన పాఠ్య పుస్తకాలలో నిజాన్ని చెప్పాలి, బాబ్రీ మసీదు, కాశీ విశ్వేశ్వరాలయం, తేజో మహల్, కుతుబ్ మీనార్ల గురించిన నిజాలు పిల్లలకు చెప్పాలి. రాజమండ్రి లాంటి ప్రాంతాలలో కూడా దేవాలయాలు కూలగొట్టిన విషయాలను తెలియచెయ్యాలి. పనికిరాని సీరియల్స్ ప్రచురించే వార్తా పత్రికలు, చరిత్రను రచయితలతో వ్రాయించి, అవి సీరియల్స్‌గా ప్రచురించాలి.


ముదిగొండ శివప్రసాద్, శ్రీ ప్రసాద్ గార్ల వారసులను వెతకాలి. కొద్దిగా నాయకీయత జోడించాలి తప్పదు, మన దౌర్భాగ్యం కొద్దీ పిల్లలకు చరిత్ర అంటే అంత ఇష్టం కలగడం లేదు.

 పిల్లలను చిన్నతనం నుండే, భారతీయులం మనం ప్రపంచానికే మార్గదర్శ్డకులం అనే గర్వాన్ని పెంచాలి, ఇంగిలిపీసులో చెప్పాలంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ పెంచాలి, మళ్ళీ తిరిగి మనం "ప్రపంచానికి మార్గ దర్శకులం కావాలి" అనే పట్టుదల పెంచాలి. 

ఇవన్నీ జరిగిన రోజు మాత్రమే ఈ జాతి పతాకం ప్రపంచ వీధుల్లో ఎగురుతుంది.

జై భరతమాత.

Sunday, April 7, 2013

మా సింగరేణి


ఈ రోజు మా అక్క హైదరాబాద్ వచ్చింది. మాటల్లో ఒరేయ్, డంపర్స్ తిరగబడి ఈ మధ్యన ఇద్దరు ఆపరేటర్స్ చనిపోయారురా, అయినా నాకు తెలియక అడుగుతాను, డంపర్స్‌లో హెల్పర్స్ ఉండరా అని అడిగింది. నిజమే, మా సింగరేణీలో డంపర్స్‌లో హెల్పర్స్ ఉండరు. పై మట్టి తీసి, దానిని చుట్టూ కొండలా వేస్తారు. ఎత్తు పెరిగేకొద్దీ, దాని మీదకు దారులు చేసి, అక్కడ  మట్టిని పోస్తారు. అవి వంద అడుగుల ఎత్తువరకూ ఉంటాయి. రివర్స్ గేర్‌లో వచ్చి, ఆ ఎత్తులో మట్టిని అన్‌లోడ్ చేస్తారు. ఒక్కోసారి, ఏదో పరధ్యానంలో ఉండో, లేక మితిమీరిన ఆత్మ విశ్వాసంతోనో మా వాళ్ళు చివరదాకా వచ్చేస్తారు. అది లూజ్ మట్టి అవడం వలన, మట్టి జారి దానితోపాటూ, డంపర్ కూడ క్రిందకు పడిపోతుంది. సహజంగా అలాంటి చోట ట్రాక్టర్ వాడు కూడా  మనిషిని పెట్టుకుంటాడు, కానీ మా యాజమాన్యం మాత్రం అలా వదిలేస్తుంది. అడగవలసిన యూనియన్ నాయకులు అడగరు. పూర్వం సింగరేణిలో ఎలక్షన్స్ ఉండేవు కావు, కాబట్టి పేరు కోసమో, డబ్బు కోసమో, అన్ని యూనియన్స్ అంతో ఇంతో కార్మికుల గురించి ఆలోచించేవి (అది కూడా బేరం కుదిరేదాకానే), ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నయి. ఇప్పుడు మేనేజ్‌మెంట్ పని చాలా సులువు అయ్యిపోయింది, ఇదివరకు అయితే ఐదారు యూనియన్స్‌ని మేనేజ్ చెయ్యవలసి వచ్చేది. ఇప్పుడు, ఒక్కడిని మేనేజ్ చేస్తే చాలు, పని అయ్యిపోతుంది.  ఎవడెలా పోతే మాకేమిటి, మా బ్యాంక్ బ్యాలన్స్ పెరిగిందా లేదా అనేదే చూస్తున్నారు, ఈ నాయకులు. తరువాత ఎలాగూ, ఎంఎల్‌సి సీటులు ఉన్నాయి, కాబట్టి వాళ్ళకు మేనేజ్‌మెంట్ ముఖ్యం కానీ, కార్మికులు కాదు.

నేను అక్కడ ఉద్యోగం చేస్తున్న సమయంలో 1992లో అనుకుంటాను, మా ప్రమోషన్ గురించి  అడగడానికి, .మా డైరెక్ట్టర్ పా దగ్గరకు వెళ్ళాము. ఆయన ఐఏఎస్ ఆఫీసర్. లోపలకు కబురు పంపాకా, ఆయన యూనియన్ ద్వారా వచ్చారా, డైరక్టుగా వచ్చారా అని అడిగాడంట. క్లర్క్ వచ్చి మమ్మల్ని అదే అడిగాడు. మేము డైరక్టుగా వచ్చాముఉ, అని చెప్పాము.  సరే లోపలకు రమ్మను అని చెప్పాకా, వెళ్ళాము. ఆయనకు మా విషయం చెప్పి, 1988లో జె.ఇ. ప్రమోషన్ ఇవ్వాలి, ఇప్పటిదాకా ఇవ్వలేదు అని చెప్పాము. ఆయన మేము కేడర్ స్కీం తీసేసాము కదా అని అన్నాడు. ఎప్పుడు సార్ అని నేను అడిగాను. అంటే ఆయన 1989లో అన్నాడు. అదేమిటి సార్, మాది 1988 డ్యూ కదా, మాకు ఇచ్చాకా కదా, మీరు కాన్సిల్ చెయ్యవలసింది,  పైగా నేను చేరినప్పుడు, క్యాడర్ స్కీం ఉందనే, నేను గవర్నమెంట్ సర్వీస్ వదిలేసి ఇక్కడ చేరాను. నేను చేరినప్పుడు ఏ ఏ బెనిఫిట్స్ ఉన్నాయో, అవి నేను రిటైర్ అయ్యేదాకా ఉండాలి కదా అని అడిగాను. ఆయన సరే చూస్తాను, వెళ్ళండి అన్నాడు.

 ఆ తరువాత మా వాళ్ళు యూనియన్‌వాళ్ళను కలుద్దాము అంటే, నాకు ఇష్టం లేకపోయినా, ఇప్పుడు ఎంఎల్‌సి గా ఉన్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాము. అతనిని మా ప్రమోషన్స్ గురించి అడిగితే, మీరు ఎప్పుడూ కలవలేదు కదా అన్నాడు. నేను, ఎందుకు కలవాలి అని అడిగాను. వాడు నన్ను ఎగా,దిగా చూసాడు. మేమెందుకు నిన్ను కలవాలి, నువ్వు యూనియన్ లీడర్‌వి, మేనేజ్‌మెంట్ అన్ని పాలసీలు సరిగ్గా అమలుపరుస్తోందో, లేదో చూడవలసిన భాధ్యత నీమీద లేదా అని అడిగాను. సరే, మా ప్రమోషన్స్ రాలేదు అనుకోండి అది వేరే విషయం. మా యూనియన్ నాయకులు ఎలా ఉంటారో చెప్పడానికి మాత్రమే నేను ఈ విషయం ప్రస్థావించవలసి వచ్చింది.

Sunday, March 10, 2013

నన్ను మనిషిగా ఉంచుతున్నది



ఈ రోజు మా నాన్నగారి పుట్టినరోజు. సహజంగా కొడుకుని చూసి ఎవరైనా గర్వపడతారు, కానీ నేను మాత్రం మా నాన్నగారిని చూసి గర్వపడతాను. ఈ సృష్టిలో  కన్నతండ్రిని ప్రేమించని వాళ్ళు ఉండరు. (ఎక్కడో నాలాంటి దరిద్రులను తప్ప). కానీ ఇక్కడ నేను నా తండ్రిని, నా తండ్రిగా కంటే కూడా ఒక మనిషిగా ఎక్కువగా ఇష్టపడతాను. చాలా మంది కొడుకులలాగే నేను కూడా, ఆయనతో గొడవపడిన సందర్భాలు ఉన్నాయి, మాట్లాడడం మానివేసిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్ని ఎలా ఉన్నా ఆయనలో ఉన్న మనిషిని నేను ఎక్కువ గౌరవిస్తాను. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్టు పుట్టుకతో ప్రతీవాడూ శూద్రుడే, ఆ తరువాత మనం పాటించే ఖర్మలను బట్టి మన వర్ణం ఆధారపడి ఉంటుందనేది నేను మా నాన్న గారిని చూసి తెలుసుకున్నాను. ఆయన క్షత్రియ కుటుంబంలో జన్మించినా, ఒక్క వైశ్య లక్షణాలు తప్ప మిగిలిన లక్షణాలు అన్నీ నేను ఆయనలో చూసాను. ఒక గురువుకు ఉండవలసిన లక్షణాలు నేను ఆయనలో చూసాను. విద్యనేర్పే గురువు విధ్యార్థుల భాధ్యత ఎలా తీసుకోవాలో ఆయన అలా తీసుకునేవారు. ఒక గురువుగా ఎంతమందికి ఆయన సాయం చేసారో నాకు వేరే వాళ్ళు చెప్పినప్పుడు తెలిసింది. సహజంగా నా స్నేహితులు నాతో మా ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్పవచ్చు, కానీ నేను ఎవరినో తెలియకుండా మా నాన్నగారి గురించి కొంతమంది నాకు చెపుతున్నప్పుడు, నాకు నా మీదే అసహ్యం వేసేది. (ఎందుకనో తెలియదు కానీ, నేనెప్పుడూ మా నాన్నగారి గురించి ఎవరికీ చెప్పేను). ఆ తరువాత వాళ్ళకు నేనెవరో తెలిసినప్పుడు వాళ్ళు నాకు దణ్ణం పెట్టేవారు, మీ నాన్నగారి దయవలన నేను ఇంతవాడిని అయ్యాను అని. విద్య చెప్పినప్పుడు ఆయనలో నేను బ్రాహ్మణ లక్షణాలను చూసాను, అలాగే దానం చేసినప్పుడు ఆయనలో క్షత్రియ లక్షణాలను చూసాను, తను చేస్తున్న ఉద్యోగంలో ఆయన పడే కష్టం చూసినప్పుడు నాకు ఆయనలో ఒక శూద్రుడిని చూసాను. నా ఈ 50 సంవత్సరాల జీవితంలో నేను ఆయనలో ఎక్కడా వైశ్య లక్షణాలు చూడలేదు. ఆయనలో ఎక్కడా వ్యాపారం మీద మక్కువ నేను గమనించలేదు. ఆయన ఎన్నో ఫాక్టరీలకు చార్టర్డ్ ఇంజనీర్, కానీ ఆయన ఎన్నడూ దానిని వ్యాపారంగా చెయ్యలేదు. అలా చేసి ఉంటే ఈ రోజు నాకు కోట్లు ఇచ్చివుండేవారేమో, దానిని నేను ఆనందంగా ఖర్చుపెట్టుకుంటూ తిరిగేవాడినేమో, కానీ ఇంత గర్వంగా ఈయన మా నాన్నగారు చెప్పుకొనేవాడిని కాదు. నేను అప్పులపాలయినప్పుడు, ఆయన ఆస్తి మొత్తం అమ్మివేసి అప్పులు తీర్చివేసారు. అందులో మా అమ్మకు, అక్కలకు ఇవ్వవలసినది ప్రక్కన పెట్టి, ఆయనది మొత్తం అమ్మివేసి, నన్ను మళ్ళీ ఉద్యోగం చేసుకొని బ్రతకమని సలహా ఇచ్చారు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆయనది కాని ఆస్తి మీద ఆయన హక్కుని తీసుకోలేదు. నేను అందరినీ కోల్పోయి, ఏ ఉద్యోగమూ చెయ్యకుండా పిచ్చిలో పడి, ఖాళీగా తిరుగుతున్నప్పుడు, నాలుగు సంవత్సరాల పాటు నెలకు పాతికవేలు చొప్పున పంపిచారు తప్పితే ఎప్పుడూ నన్ను తిట్టలేదు. ఈ రోజు దాకా నువ్వు నీ జీవితం చూసుకో అని చెప్పలేదు, తప్పు చేసావు కాబట్టి వేచి ఉండు అన్నారు తప్పితే, ఎప్పుడూ నాకు వేరే జీవితం గురించి సలహా ఇవ్వలేదు. నాలుగు నెలల క్రితం నాకు నడుం నొప్పి మళ్ళీ వస్తోంది అని చెప్పినప్పుడు, కొత్త కారు కొనుక్కో డబ్బులు పంపిస్తాను అని రోజూ తిట్టేవారు, ఒద్దని నేను సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటానని చెప్పినప్పుడు రెండు లక్షలు పంపించారు. ఇప్పటికీ మా అమ్మ రోజూ ఫోన్ చేసి సెకండ్ హ్యాండ్ కారు వద్దు, అమ్మేయి, భాజీ పంపిస్తారు, కొత్తది కొనుక్కో అని తిడుతోంది. వాళ్ళకు నామీద ఉన్న ప్రేమ అటువంటిది. ఆయన రిటైర్ అయ్యాకా పుట్టపర్తి వెళ్ళిపోయి అక్కడ స్కూలులో టీచర్‌గా సర్వీస్ చేసుకుంటున్నారు. మా నాన్నగారు ఒక్కరే కాదు, అక్కడ ఉన్న టీచర్స్‌లో ముప్పాతిక వంతు మంది ఫ్రీగా టీచ్ చేస్తున్నారు. వాళ్ళల్లో ఎవరికీ కూడా బయట ఉద్యోగం చేస్తే, ఏ కార్పొరేట్ కాలేజీ వాళ్ళైనా, నెలకు రెండు లక్షలకు తక్కువ కాకుండా జీతం ఇస్తారు. అటువంటి చోట మా నాన్న గారు హాయిగా సేవ చేసుకుంటున్నారు. నా ఈ అహంకారానికి కారణం మా నాన్నగారు. కానీ నేను వేసిన ఒక తప్పటడుగు ఈ రోజు వాళ్ళను రోడ్డు మీద నిలబెట్టింది. అందుకు నేను చాలా భాధపడుతున్నాను. కానీ ఈ రోజుకూ ఆయన నేను వేసింది తప్పడడుగు అని అనరు. నేను నాకు సంబంధించిన ఏ విషయమూ ఆయనకూ చెప్పను. నా ప్రోబ్లం ఏదో నేనే చూసుకుంటున్నాను. నన్ను చాలా మంది అడిగారు, కాదు తిట్టారు, ఉన్నవాడివి ఒక్కడివి, వాళ్ళను నీ దగ్గరకు తీసుకువచ్చేసుకోవచ్చు కదా అని. వాళ్ళు అక్కడ చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, ఇక్కడకు వచ్చినదగ్గరనుండీ, నా స్థితి చూసి వాళ్ళు భాధపడాలి అనేది నాకు తెలుసు. అందుకని నేను వాళ్ళను ఇక్కడకు రమ్మని అడగను. ఒకవేళ వాళ్ళు ఇక్కడకు వచ్చినా నా రూముకు తీసుకురాను, మా మేనకోడలి ఇంటి దగ్గర ఉండమంటాను. నన్ను ఒక్కడిని చూస్తే వాళ్ళకు భాధకలుగుతుందని నా భాధ. మా నాన్న గారికి స్టూడెంట్స్ కాళ్ళకు దణ్ణం పెట్టడం చూసాను, అందులో కొంతమంది, దరిదాపులదాకా ఆయన వయసువాళ్ళు కూడా ఉన్నారు. ప్రైవేటుగా డిప్లొమా చేసేవాళ్ళు కొంతమంది ఆయన వయసువాళ్ళు ఆయన దగ్గరకొచ్చి నేర్చుకొనేవారు. వాళ్ళ డిప్లొమా చేతికొచ్చాకా వాళ్ళు వచ్చి ఈయన కాళ్ళకు దణ్ణం పెట్టబోయేవారు. కానీ, ఆయనతో పాటు పనిచేసిన లెక్చరర్స్ కూడా ఆయన కాళ్ళకు దణ్ణం పెట్టడం నేను కొన్ని సంవత్సరాల క్రితం తిరుపతిలో చూసాను. మా నాన్నగారు అప్పటికి రిటైర్ అయ్యిపోయారు. మా మేనల్లుడికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ అంటే తిరుపతి వెళ్ళాము. అప్పుడు మా నాన్నగారు తన దగ్గర లెక్చరర్‌గా చేసిన ఒకాయనకు ఫోన్ చేసి వీలుంటే రమ్మని చెప్పారు. ఆయన సాయంత్రం భార్యతో కలిసి వచ్చి, వెళ్ళిపోతూ కాళ్ళకు నమస్కారం చేసివెళ్ళారు. నాకు చాలా ఆశ్చ్రర్యం వేసింది. నా తండ్రి ఇంత ఉన్నతుడా అని అనిపించింది. ఇప్పటికీ హిందూపూర్ పాలిటెక్నిక్‌లో మా నాన్నగారు ప్రిన్సిపాల్‌గా చేసినప్పటి బ్యాచెస్ అమ్మాయిలు పుట్టపర్తి వచ్చి మా నాన్నగారిని కలిసివెళుతుంటారంట. వాళ్ళు కూడా మా నాన్నగారిని మేము పిలిచినట్టే భాజీ అంటారంట. 

Saturday, June 16, 2012

ప్రైవేట్ పెత్తనం.


వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదానికి కారణం ఎవరూ అని అడిగితే, అది ఖచ్చితంగా ఈ బూర్జువా ప్రభుత్వమే అని ప్రతి ఒక్కరూ చెప్పగలరు. అసలు మన దేశం ఎటు పోతోందో సామాన్యులెవరికీ అర్థం కావడం లేదు. అర్థమైన వాళ్ళు హాయిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకా ఇలాంటి వాటిని మనం ఎన్ని చూడవలసి వస్తుందో.
మన్ మోసం సింగులు, అహ్లూవాలియాలు ఈ దేశానికి పట్టిన శనులు. వాళ్ళ పీడ ఎప్పుడు వదులుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. చేతిలో కొద్దిగా పైసలు, సవరించగల మెలకువలు తెలిస్తే చాలు, ఈ దేశంలో ఏదైనా చేసుకోవచ్చు అనే స్థితికి ఈ దేశాన్ని దిగజార్చేసారు. ఈ కొడుకులు వాళ్ళ పెళ్ళాలతో కాపురాలు తప్ప, మిగిలినవన్నీ  ఔట్ సోర్సింగే అనే మంత్రం జపిస్తున్నారు. ఒక ప్రభుత్వ శాఖకు కావలసిన భవనాలు ఎవడో బయటి వాడు, వాడి ఇష్టమొచ్చిన రేటుకు, ఇష్టమొచ్చిన డిజైన్‌తో, ఇష్టమొచ్చిన రీతిలో, ఇష్టమొచ్చిన క్వాలిటీతో కట్టుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఏ శాఖలోనూ డిజైన్ వింగ్ అనేది లేదు. దేశ వ్యాప్తంగా వేల కోట్లతో ఇ.ఎస్.ఐ. హాస్పిటల్స్ కడుతున్నారు, దానిని పర్యవేక్షించడానికి దానికంటూ ఒక యంత్రాంగం లేదు. పూర్వం అలాంటి పనులన్నీ సి.పి.డబ్ల్యూ.డి. వాళ్ళు చూసేవారు. ఇప్పుడు డిజైన్ చేసేవాడు ఒకడు, ఆర్కిటెక్ట్ ఒకడు, కట్టేవాడు ఒకడు, పర్యవేక్షించే వాడు ఒకడు. అసలు వీళ్ళల్లో ఒక్కడు కూడా ప్రభుత్వం తరపున ఉండడు. ఈ జాడ్యం దానికొక్కదానికే పరిమితం కాలేదు. దేశ రక్షణ వ్యవస్థకు మూల స్థంభం అయిన డి.ఆర్.డి.వో లో కూడా ఇదే జాడ్యం. ప్రతీది ఔట్ సోర్సింగ్. ప్రైవేట్ వాడికి భాధ్యత ఎంత వరకు ఉంటుంది.

ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 10mm మందం ఉండవలసిన  పైపుల స్థానంలో 5mm మందానివి వాడారంటున్నారు. వాడు కడతాడు, వీడు వాడతాడు. పెళ్ళి చేసుకొనేవాడు ఒకడైతే, శోభనం చేసుకునే వాడు ఇంకొకడు అన్నట్టు తయారయ్యింది ఈ దేశం. తాహతుని మించి ఒక కంపెనీకే వర్కులు ఇవ్వడం, వాడు దానిని ఇంకో నలుగురికి సబ్ ఇవ్వడం. ప్రతీ ఒక్కడూ కనీసం 10 శాతం లాభం వేసుకున్నా, అది నాలుగు చేతులు మారేసరికి క్వాలిటీ సగం పడిపోతుంది. అడిగే వాడు ఎవడు? పూర్వం ఒక డ్రాఫ్ట్‌మెన్ డిజైన్ చేస్తే దానిని పైన నలుగురు చెక్ చేసి కానీ ఓకె అనేవారు కాదు. ఇప్పుడు వాడి దగ్గర ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నవాడు ఉన్నాడో మనకు తెలియదు, వాడీకి పార్లమెంటులోనో, లేక అసెంబ్లీలోనే పలుకుబడి ఉంటే చాలు వాడు ఒక కన్స్‌ల్‌టెంట్, వాడికి దేశ వ్యాప్తంగా వర్కులు. దీనమ్మా ఈ ఔట్‌సోర్సింగ్ అనే ప్రక్రియనుe, ఏ ఉద్దేశ్యంతో మొదలుపెట్టారో కానీ వ్యవస్థ సర్వనాశనం అయిపోతోంది. ఒక చిన్న అనుమానం తీర్చడానికి కూడా కన్స్‌ల్టెంట్ రావలసిందే. నేను సంవత్సరం క్రితం చేసిన కంపెనీ వర్కులో అయితే కన్స్‌ల్టెంట్ ఒక మోనార్క్. వాడిని కాదనే ధైర్యం ఈ రాష్ట్రానికే హెడ్ అయిన వ్యక్తి కూడా లేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.

 ఈ ఔట్ సోర్సింగ్ అనే దాని పీడ పోతే కానీ ఎక్కడా క్వాలిటీ రాదు.  వాళ్ళ మీద అజమాయిషీ చేసే ధైర్యం ఎవడికీ లేదు. మన జలయజ్ఞం దానికొక పెద్ద ఉదాహరణ. ఇంకా మనం ఎన్ని చూడాలో.