ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Monday, June 13, 2011

బాల కార్మిక వ్యవస్థ.

చాలా కాలం తరువాత బ్లాగు వ్రాస్తున్నాను. ఈ రోజు Anti Child Labor Day అని నా ఫేస్‌బుక్ ఫ్రెండ్ లక్కీ దాని మీద ఒక ఒక పోస్ట్ పెట్టింది. నన్ను గంజివరపు శ్రీనివాస్ గారు, లక్కీలు తమ స్నేహితుడిగా కలుపుకున్నందుకు నేను చాలా గర్వ పడుతుంటాను. నేను ఈ సోషల్ సైటుల గురించి మాట్లాడవలసి వస్తే ముందుగా వీళ్ళిద్దరి గురించే చెపుతాను. ఈ మద్యనే శ్రీనివాస్ గారు, Ramanjaneyulu GV గారి గురించి చెప్పారు. ఇప్పుడే ఆయనకు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. వీళ్ళందరూ ఏదో ఒక కాజ్ మీద ఉద్యమిస్తున్నారు. ఇలాంటి వాళ్ళతో నాకు పరిచయం ఉందని చెప్పుకోవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వీళ్ళీద్దరూ నా కంటే చిన్నవాళ్ళు. మనకంటే చిన్న వాళ్ళని మనం పొగడకూడదని పెద్దలు చెపుతారు. అందుకని, ఇంతకంటే నేను వాళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నానో చెప్పదలచుకోలేదు.

ఇక పోతే, ఈ రోజు లక్కీ పెట్టిన పోస్ట్ గురించి నా ఆలోచన చెపుదామనే ఈ బ్లాగ్ వ్రాస్తున్నాను. బాల కార్మిక వ్యవస్థ పోవాలంటే ముందుగా వాళ్ళ తల్లి, తండ్రుల ఆర్ధిక పరిస్థితి మారాలి. ఎవ్వరూ కూడా తమ పిల్లలను చిన్నతనంలోనే పనిలోకి పంపడానికి ఇష్టపడరు. వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. పిల్లలు వాళ్ళకు ఒక పెట్టుబడి సాధనం. సహజంగా లేబర్‌లో 90% పైన మొగవాళ్ళు సంపాదించిన దానిలో ముప్పాతిక వంతు తాగుడుకే ఖర్చుపెడతారు. ఇక ఇంటిలో ఉన్న ఆడవాళ్ళూ, పిల్లలూ  కలిపి పనిచేస్తే కానీ వాళ్ళ కడుపులు నిండవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలను (మన ప్రభుత్వాల చిత్తశుద్ది మనకు తెలిసిందే)  తీసుకునివెళ్ళి ఏమి చేస్తారు? ఒక హాస్టల్ చేర్చడం, అంతే. మన గవర్నమెంట్ హాస్టల్లు ఎలా ఉంటున్నాయో మనకు తెలిసిందే. వాడు బయటకు వచ్చి, మళ్ళీ కూలివాడుగా ఉండవలసిందే. ఒకవేళ వాడు తెలివైన వాడయ్యి సొంతంగా చదువుకున్నా, వాడు కాంపిటీటివ్ ఎగ్జామ్‌ వ్రాస్తే, వాడు పోటీ పడేదెవరితో? కార్పోరేట్ కాలేజీలో చదివిన విద్యార్ధితో. అసలు మన వ్యవస్థే లోపాల పుట్ట. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పేవారు ఉండరు. వీళ్ళు ఇంటర్ చదివి ఇంజనీరింగ్‌, మెడికల్ ఎంట్రన్స్ వ్రాయాలంటే వాడు పోటీ పడవలసింది మళ్ళీ కార్పోరేట్ కాలేజీలో చదివినవాడితోనే. కొద్దిగా మనకున్న నాయకుల్లో,  జయలలిత ఒక్కావిడే, ఈ విషయంలో సరిగ్గా ఆలోచించింది అనిపిస్తుంది. ఆవిడ అక్కడ ఎగ్జామ్‌స్ లో రిజర్వేసన్ పెట్టింది. దానిని చాలా మంది తప్పు పట్టారు. మన దేశంలో ప్రభుత్వ తప్పుడు లెక్కల ప్రకారమే 30% పైన బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి (అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారికి) రిజర్వేసన్ కల్పించకపోతే వాడు ఇంటర్ దాకా చదివి ఉపయోగమేమిటి? అలా కాకుండా వాడు ఏ మెకానిక్ దగ్గరో పనిచేసుకుని ఉంటే, వాడు వయసు వచ్చేసరికి అందులో మెలకువలు నేర్చుకొని సంపాదనాపరుడౌతాడు.

నేనెప్పుడో 10 ఏళ్ళ క్రితం చదివిన ఒక కధ గుర్తుకవస్తోంది. చాలా బాగా రాసాడు. ఆ రచయిత ఎవరో, ఎందులో చదివానో కూడా గుర్తులేదు. MA సోషల్‌వర్క్ చదివిన విద్యార్ధి తన ఫైనల్ ఇయర్‌ ప్రాజక్ట్ వర్కులో భాగంగా జాలర్లుండే సముద్ర ప్రాంతానికి వెళతాడు. అక్కడ నాలుగు రోజులు పరిశీలించి, ఒక పల్లె అతన్ని నువ్వు రోజూ నీ కొడుకుని సముద్రంలోకి ఎందుకు తీసుకుని వెలుతున్నావు అని అడుగుతాడు. అంటే అతను నా కొడుక్కి చేపల వేట నేర్పటానికి అంటాడు. అలా వద్దు, అతన్ని స్కూల్‌కి పంపు, అక్కడ చదువుకుంటాడు అని ఈ వ్యక్తి అంటాడు. అప్పుడు, ఆ పల్లెతను చదువుకుని మా వాడు ఏమి చేస్తాడు అంటే, ఈ కుర్రవాడు హాయిగా ఉద్యోగం చేసుకుంటాడు అని అనగానే ఆ పల్లెతను బాబూ ఇంతకీ నువ్వేమి చేస్తున్నావు, నన్ను ఇన్ని ప్రశ్నలేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ కుర్రవాడు ఇది నా ప్రాజక్ట్ వర్క్, ఇది చేస్తే నాకు డిగ్రీ ఇస్తారు. అది తీసుకుని నేను ఉద్యోగంలో చేరుతాను అంటాడు. వెంటనే ఆ పల్లెతను నాయనా ఇప్పుడు నా కొడుకు చేస్తున్నది ఆ ప్రాజక్ట్ వర్కే. ఇది వాడు బాగా చేస్తే తరువాత వీడు సొంతంగా వేటకెల్లి వాడి సంపాదన వాడు సంపాదించుకుంటాడు అని చెప్పి కొడుకుని తీసుకుపోతాడు. నాకెందుకనో ఆ కధ చాలా బాగా నచ్చింది.

  నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముందు ప్రభుత్వ పాఠశాలలని సరిచెయ్యమనండి. చెప్పడానికి మాస్టార్లు ఉండరు, కూర్చోవడానికి బల్లలుండవు, వీళ్ళని స్కూల్లల్లో చేర్చి సాధించేదేమిటి? ఒక చిన్న ఉదాహరణ. మా ఫాదర్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఒక గర్ల్స్ పాలిటెక్నిక్ దగ్గరుండి కట్టీంచాకా ఒక బ్రాంచ్‌కి లెక్చరర్స్ లేరంట. ఆయన డైరక్టర్‌కి లెటర్ మీద లెటర్ పెట్టి పని అవ్వక చివరికి మినిస్టర్‌కి ఆ బ్రాంచ్‌ని అసలు ఆ కాలేజీలో తీసేసి అక్కడ ఉన్న అమ్మాయిలని స్టాఫ్ ఉన్న కాలేజీలకి పంపమని లెటర్ పెట్టారంట. అప్పుడు ఆ డైరక్టర్ మా ఫాదర్ మీద సీరియస్ అయితే, ఈయన కూడా సీరియస్ అయ్యి ఆడపిల్లలని మన దగ్గరకు చదువు చెప్పమని పంపిస్తే, మనం వాళ్ళకి చదువులు చెప్పకుండా ఖాళీగా హాస్టల్‌లో కూర్చోపెట్టి పంపుదామా, నీ దగ్గర స్టాఫ్ లేరని తెలిసి ఈ కాలేజీలో ఆ బ్రాంచ్ ఎలా పెట్టావు అని అడిగారంట. అదీ మన కాలేజీల పరిస్థితి.

ఇక్కడ బాల కార్మిక వ్యవస్థ రద్దుకంటే దానిని క్రమబద్దీకరించడం సరి అయిన పని అనిపిస్తోంది. ఎందుకంటే ఆర్ధిక పరిస్థితులు మారనంతవరకు దానిని రద్దు చెయ్యడం ఎవరి వల్లా కాదు. అంతకంటే పిల్లలు చేసే పనులు వర్గీకరించి వయసుల వారీగా వాళ్ళకు పనులు కేటాయించేటట్టు చూస్తే కొంతలో కొంత మెరుగు. నేను కొద్దికాలం క్రితం ఒక పెద్ద కంపెనీలో చిన్న వర్క్ చేసాను. అప్పుడు అక్కడ లేబర్ కేంప్‌లో చాలా మంది చిన్న పిల్లలను చూసాను. వెంటనే అక్కడ ఉన్న మా మేస్త్రీతో నేను నెలకు మూడు వేలు జీతం ఇస్తాను, ఇక్కడ ఎవరైనా చదువుకుని ఖాళీగా ఉన్న కుర్రవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడు, ఈ పిల్లలకు చదువుచెప్పడానికి అని చెప్పాను. అతను వెంటనే ఇవన్నీ మీకెందుకు సార్, ఇప్పటికే మునుగుతారో, తేలతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు, అంటే నేను ఏమయ్యా నాకొచ్చే నష్టంలో ఇదో లెక్క కాదులే అని చూడమని చెప్పి వచ్చేసాను. దురదృష్టవశాత్తు నా లేబర్ అడ్వాన్స్ పుచ్చుకున్నవాళ్ళు ఆ రాత్రే పారిపోవడంతో నేను ఇంక ఆ వర్క్ మానివేసాను. కాకపోతే నేను అక్కడ చూసినదానిని బట్టి మన ప్రభుత్వం అలా లేబర్ కేంప్‌లు ఉన్న చోట ఆ కాంట్రాక్టర్ ఖచ్చితంగా ఉచిత విద్య నేర్పే ఏర్పాటు చెయ్యాలి. ఎందుకంటే పెద్ద సైటుల్లో ఎంత తక్కువగా చూసినా 300మంది పైనే లేబర్ ఉంటారు. అక్కడ ఎలా లేదన్నా పాతిక మంది పైనే చిన్న పిల్లలుంటారు. వాళ్ళకి నాలుగు అక్షరం ముక్కలు వ్రాయడం, కొద్దిగా కూడికలూ, తీసివేతలు వచ్చేటన్ని లెక్కలూ నేర్పిస్తే చాలు. అది కూడా ఆ కాంట్రాక్టర్‌లు చేయరు.

ఇక మన LEO లు ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు మాకు ముందే కబురు తెలిసిపోతుంది. వెంటనే మా కాంట్రాక్టర్లు వర్క్ ఆపుచేసేస్తారు. మేము కూడా వాళ్ళకే వంత పాడతాము. మా దగ్గర కొద్దిగా మొహం ముదరగా ఉంటే చాలు వాడికి 18 ఏళ్ళు అని చెప్పమంటాము, లేదూ వాడు పొట్టోడు అని చెపుతాము. తప్పదు, వాడి పొట్ట నిండాలి కదా. కాకపోతే నేను మాత్రం వాళ్ళతో క్యూరింగ్ తప్పితే బరువు పనులు చెయ్యనిచ్చేవాడిని కాదు. ఎందుకంటే మా అమ్మ నేను ఉద్యోగంలో చేరేవరకు నాతో బకెట్ నీళ్ళు కూడా మొయ్యనిచ్చేది కాదు. ఒక సారి నా చేపల చెరువు దగ్గర నీటి కాకులని కొట్టడానికి ఒక కుర్రవాడిని నెలకు 700 ఇచ్చి పెట్టాను. కొన్ని రోజులు పోయాక మా ప్రెసిడెంట్ వచ్చి కుర్రవాడిని తీసేయమన్నాడు. సరే తీసేస్తాను, అంతే కాదు వాడికి పుస్తకాలు కూడా కొనిస్తాను, ఆరు నెలల తరువాత వాడికి నేనే పరీక్ష పెడతాను, వాడు సరిగ్గా రాయకపోతే నీకు పగులుద్ది అని చెప్పి పుస్తకాలు కొనిచ్చాను. సరిగ్గా నెల తరువాత వాడు వేరే రైతు దగ్గర మేతలు కడుతూ కనిపించాడు. వాడు మాత్రం ఏమి చేస్తాడు. బడిలో మాష్టారులుండరు.  

బాల కార్మికులను ఎటువంటి పనుల్లో పెట్టవచ్చో ప్రభుత్వమే నిర్ణయించాలి. హోటల్లో పనిచేసే పిల్లలను చూపించి ఆ ఓనర్లను బెదిరించడానికి తప్పితే ఈ చట్టం ఎందుకూ పనికి రాదు. ప్రమాదకరమైన పనుల్లో కొన్ని వేల మంది పిల్లలు పనిచేస్తున్నారు, వాళ్ళని రక్షించవలసిన అధికారుల కళ్ళు డబ్బుతో మూస్తుంటారు. సంపద అందరికీ పంపిణీ అయితే ఈ ప్రోబ్లం ఉండదు. అందులో ఇప్పుడు మన ప్రభుత్వం పెట్టిన ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీము అసలు వర్కర్‌లు దొరకని పరిస్థితి కలించింది. వాడు వెళ్ళి రెండు గంటలు పని చేస్తే చాలు వాడికి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇంక వాడు బయట పనికి ఎందుకు వస్తాడు? ఇంక పిల్లల మీద అధారపడవలసిందే. నేను కన్‌స్ట్రక్షన్ ఫీల్డులో ఉన్నాను. ఏ మేస్త్రీని కదిపినా లేబర్ లేరనే మాటే. ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. నేను బాల కార్మిక వ్యవస్థను సపోర్ట్ చేస్తున్నాననుకోవద్దు, కానీ మన వ్యవస్థ మారనంతవరకూ దీనిని మనం ఆపలేము.