ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Sunday, April 27, 2014



జనాభాపరంగా ఎక్కువ ఉన్నామ్ము కాబట్టి, మనది పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతోంది కానీ, అందరూ అంటునట్టు గొప్ప ప్రజాస్వామ్య దేశం కాదు. ఎప్పటికీ కాదు కూడా. ఇది నేను నిరాశావాదంతో చెపుతున్న మాట కాదు, వాస్తవ పరిస్థితిని "నిజాయితీగా" గమనించండి, మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది.

కాంగ్రెస్‌ని ఇంతకాలం గమనించాము, మధ్యలో కొద్దికాలం బిజెపిని చూసాము. కాంగ్రెస్‌తో పోల్చి చూసినప్పుడు బిజెపి పాలన బాగుంది అని అనిపించి ఉండవచ్చు. కానీ అప్పుడు కూడా అభివృద్ధిలో అవినీతి జరిగింది. కాదని ఎవరన్నా అనుకుంటే, వాళ్ళు పిచ్చోళ్ళన్నా అయ్యి ఉండవచ్చు, లేదూ ఎంతో కొంత జరిగిందిలే, ఇంతకు మించి ఎవరు మాత్రం ఏమి చెయ్యగలరు అని ఆనందపడే అల్ప సంతోషి అన్నా అయ్యుంటాడు. నేను అల్ప సంతోషిని కాదు, పిచ్చి వాడిని అంతకంటే కాదు.

ఈ దేశంలో అవినీతి చెయ్యకుండా, ఏ మనిషీ ఆనందంగా బ్రతకలేడు. దానికి కారణం మన ప్రభుత్వ విధానాలు. కనీస అవసరం అయిన, మంచి నీరు కూడా రెండు రూపాయలకే ఇస్తాము అని గొప్పగా చెప్పుకోవలసిన స్థితికి మన నాయకులు వచ్చేసారు. ప్రపంచంలో ఎక్కడైనా కరువు వచ్చినప్పుడు మాత్రమే రైతు నష్టపోతాడు. మన దేశ రైతు దౌర్భాగ్యం ఏమిటంటే, ఎప్పుడూ నష్టపోతూనే ఉంటాడు.

జైలులో ఉండి, బెయిల్ మీద బయటకు వచ్చి, ఎన్నికలలో నిలబడిన వ్యక్తికి ప్రభుత్వం రక్షణ కల్పించే దుస్థితి మన దేశంలోనే ఉందేమో. అది నేనే చేసాను, ఇదీ నేనే చేసాను అని చెప్పుకునే వ్యక్తి మధ్యపాన నిషేధాన్ని అమలు పరచలేనని నిషేధాన్ని ఎత్తివేసి, ప్రజల ప్రాణాల మీద వచ్చే పన్నులతో పరిపాలన చేసాడు. ఆరోగ్యశ్రీ పేరుతో ప్రజల సొమ్ముని కార్పొరేట్ హాస్పిటల్స్‌ వాళ్ళకు కట్టబెట్టి, ప్రభుత్వ వైద్యశాలలను పడుకోబెట్టిన వ్యక్తి ఈ దేశంలో మాత్రమే దేవుడిగా పిలువబడతాడేమో. సంస్క్రృతీ పరిరక్షకులం అని చెప్పుకునే పార్టీ వాళ్ళు, పరిపాలనలో ఉండగా మాత్రం గోహత్యను నిషేధించలేకపోయారు.

ప్రతీ పార్టీ కూడా పారిశ్రామిక వేత్తల చేతుల్లో ఉన్న ఈ దేశంలో సామాన్యుడి కోసం పరిపాలన చేసేవాడిని మనం చూడగలము అని అనుకుంటే, అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు.

ప్రతీ ఐదువేల సంవత్సరాలకొకసారి భూమి మీద యుద్ధం వలనో, ఉత్పాతాల వల్లనో జనాభా ముప్పాతిక భాగం నశించిపోతుందనేది నిజమైతే, అది జరిగే దాకా మనం ఏదైనా ఆశించడం అనవసరం. మహా భారత యుద్ధం జరిగి ఇప్పటికి ఐదువేల సంవత్సరాలు అయ్యింది అని లెక్కలు చెపుతున్నారు కాబట్టి మనం ఆ క్షణాల గురించి ఎదురుచూడడమే.