ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Thursday, August 4, 2011

నేనేమిటి?

చాలా రోజుల తరువాత బ్లాగ్ వ్రాయాలనిపించింది. ఏమి వ్రాయాలి అని ఆలోచిస్తుంటే, అసలు ఎప్పుడూ దాని గురించో, దీని గురించో లేకపోతే ఎవరెవరి గురించో వ్రాస్తున్నాము కదా, ఈసారి నా గురించే వ్రాస్తే పోలేదా అనిపించింది. అది కూడా ఎందుకంటే నా బ్లాగ్ చదివే వాళ్ళకు నేనెవరో తెలియదు. నా రాతలు చూసి వాళ్ళు, నన్ను ఏదో గొప్ప సంస్కారం ఉన్నవాడిని అనుకుంటారేమోనని (అనుకోవాలనే కోరిక నాలో ఉందనుకోండి) నాకు అనుమానం వచ్చింది. కానీ, నేను ఇటువంటి వాడిని అని తెలిసాకా నా బ్లాగ్‌లు ఎంతమంది చదువుతారో తెలుసుకోవాలనిపించింది.  మనిషి రాతకు, వాడి వ్యక్తిత్వానికి ఇంత తేడా ఉంటుందా అని, వాళ్ళు అనుకుంటారని నా నమ్మకం. అప్పుడు నా బ్లాగ్ ఎంతమంది చదువుతున్నారో కౌంటర్ చూసి తెలుసుకుంటే ఎలా ఉంటుందా అనే కుతూహలంతో నా గురించి 90% వాస్తవాలు రాస్తున్నాను. మిగిలిన 10% ఎందుకు దాస్తున్నానంటే దాని అవసరం నాకు వ్యక్తిగతంగా ఉంది. అది మీకు ఇప్పుడు చెప్పేది కాదు.

నేను శ్రీశ్రీ కంటే విశ్వనాధవారిని ఇష్టపడతాను. విశ్వనాధ్ సప్తపది కంటే బాపూ గారి రాధాకళ్యాణం ఇష్టపడతాను. దీనిని బట్టే మీరు ఒక నిర్ణయానికి వచ్చేయవచ్చు. నేను ఛాంధసవాదిని అని. యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల కంటే అంతర్ముఖం ఇష్టపడతాను. చలం గారు చెప్పిన దైవమిచ్చిన భార్య అంటే నాకు ఇష్టం, కానీ నా భార్య నాతో తప్పితే వాళ్ళ అమ్మా, తమ్ముల్లతో ప్రేమగా ఉన్నా తట్టుకోలేను. గొప్ప స్వార్థపరుడను. నేను ఒంటరిగా ఉంటున్నాను, నన్ను చూడడానికి నా భార్యా, పిల్లలు ఇష్టపడడం లేదు. పిల్లలతో అసహ్యించుకోబడే తండ్రి ఖచ్చితంగా వెధవ అయ్యుంటాడు, కాబట్టి నేను వెధవనే. నా దగ్గర శ్రీశ్రీ, చలం, విశ్వనాధ, బుచ్చిబాబు, తిలక్ లాంటి వాళ్ళ సాహిత్యం ఉంటుంది కాబట్టి, నన్ను గొప్ప మానవతావాదినని నమ్మి నన్ను ఇష్టపడి పెళ్ళి చేసుకుని మోసపోయానని నా భార్య అనేది కాబట్టి నేను మోసగాడిని. తను నా దగ్గర నుండి నా తప్పుందని వెళ్ళిపోయినా, ఆ నెపం వాళ్ళ అమ్మా వాళ్ళ మీద వేస్తున్నాను కాబట్టి, నేను నెపం ఇతరుల మీద వేసేవాడిని. నా మాటకెదురు చెప్పే వాళ్ళని, నేను అసలు భరించలేను, కాబట్టి నేను అహంభావిని. అప్పుడప్పుడు నాకు ఇవ్వవలసిని డబ్బులు ఇవ్వకుండా, హాయిగా ఎంజాయ్ చేసే వాళ్ళని చూస్తుంటే కడుపు మండిపోతుంది. కాబట్టి ఈర్ష్యాపరుడను. సంవత్సరం క్రితం దాకా రోజుకు 6 పెట్టెలు సిగరెట్‌లు కాల్చేవాడిని. కాబట్టి నాతో పాటు పాసివ్ స్మోకింగ్‌తో మిగిలిన వాళ్ళని కూడా చంపడానికి ఇష్టపడేవాడిని. (ఇప్పుడు రెండు పెట్టెలే కాలుస్తున్నాను). కోపం వచ్చిందంటే (ఊరికే అంటున్నాను, అది ఎప్పుడూ నాతోనే ఉంటుంది), నా నోట్లోంచి వచ్చే మాటలు తాగిన వాడి నోట్లోంచి కూడా రావు. పక్కా యాబ్రాసిని.

నా తల్లి, నా కూతుర్లు, నా మేనకోడల్లు, నా అక్కలు, నన్ను మావయ్యా అని పిలిచే వాళ్ళల్లో తప్పితే మిగతా అందరిలో నాకు ఆడదే కనిపిస్తుంది. అలాగని అందరినీ నేను కోరుకుంటానని కాదు, నాకూ ఒక టేస్ట్ ఏడిచింది. ఇలియానాను ఇష్టపడతాను కానీ, అనుష్కని ఇష్టపడను. నేను సివిల్ ఫీల్డ్‌లో ఉన్నవాడిని కాబట్టి నా భాషలో చెప్పాలంటే నేను 6mm Plain bar ని ఇష్టపడతాను. రోడ్డు మీద రెచ్చగొట్టేటట్టు ప్రవర్తించే ఆడవాళ్ళని చూస్తే నాకు తెలియకుండానే నోట్లోంచి డైలాగ్‌లు వచ్చేస్తాయి (ఇప్పుడు నా వయసు 48), వ్యక్తి స్వేచ్చని ఇష్టపడను కాబట్టి కుసంస్కారిని. నన్నెవరైనా కించపరిచితే వెనుకా, ముందూ చూడకుండా నువ్వెంత, నీ బ్రతుకెంత అని కడిగి పారేస్తాను. ఒళ్ళు పొగరెక్కువ. నేను ఈ రోజు దాకా నా షర్ట్ పై బటన్ ముగ్గురు ముందే పెట్టాను, కాబట్టి బలుపెక్కువ. జాతకాలనీ, పూజలనీ, హోమాలనీ నా ప్రోబ్లం తీరడానికి లక్షలు ఖర్చుపెట్టాను కాబట్టి మూర్ఖుడిని.

 ఇన్ని నెగటివ్ లక్షణాలు నాలో ఉన్నాయి. కాబట్టి, ఇక నాలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నా అవి పట్టించుకోవక్కరలేదు.

ఇక్కడితో నేనేంటో తెలిసింది కాబట్టి, వీడి గురించి చదవడం శుద్ద దండుగ అనుకుని సిస్టం ఆపుచేసేసేవాళ్ళు ఆపుచేసేయండి.

***************************************************************************************************************************************************************

లేదులే రావణాసురుడిలో కూడా కొంత మంచి ఉంది కదా, ఈ వెధవలో కూడా ఏమైనా మంచి ఉందేమో చూద్దాము అనుకుని ఎవరైనా మిగిలి ఉంటే ఇక్కడ నుండీ నాలో ఉన్న ( అవి మంచివి అని నేననుకుంటున్నాను కాబట్టి,  మీరూ అలాగే అనుకోవాలి, అన్నీ నేనే డిసైడ్ చేస్తాను, ఎంతైనా అహంభావిని కదా) కొన్ని పాజిటివ్ లక్షణాలు చూడండి.

అవి నా బ్లాగ్ కౌంటర్ చూసాకా వ్రాస్తాను. బై.
మీ? రామర్రాజు. (రామర్రాజు అని పొరపాటున వ్రాయలేదు, 3000 ఇచ్చి మరీ మార్పించుకున్న పేరది).