ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Sunday, July 6, 2014

పూర్వం ఎన్నికలప్పుడు, ఆ తరువాతా రాజకీయాల పేరుతోనూ, సినిమా అభిమానం పేరుతోనూ జనాలు కొట్టుకుంటుంటే, ఆశ్చర్యం వేసేది. వాళ్ళందరూ చదువు లేనోళ్ళనుకునేవాడిని. కానీ ఈ మధ్యన ఫేస్‌బుక్ లాంటి వాటిలో చూసుంటే మనలో కులభిమానాలు, ప్రాంతీయవాదాలు, బానిస మనస్థత్వాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. ఏ నాయకుడినయినా ఏదన్నా అంటే మీద పడిపోతున్నారు. ప్రతీ మనిషిలోనూ మంచీ, చెడూ రెండూ ఉంటాయి. మనకు నచ్చిన నాయకుడిలో అంతా మంచే అనుకునే స్థితిలో మనం ఉండి, అతనిని ఇంకెవరూ ఏమీ అనకూడదు, అంటే బూతులు తిడతాం అంటే సమాధానం ఏమీ ఉండదు. మన దగ్గర ఓటు హక్కు ఉన్నవాళ్ళే యాభై శాతం మంది ఉంటారు, అందులో ఓటు వేసేవాళ్ళు అరవై శాతం లోపు. ఆ అరవై శాతం మంది మూడు పార్టీలకు వేస్తారు. అంటే ఇరవై ఒక్క శాతం ఓట్లు వచ్చిన వాడు నాయకుడు. వాడిని ఎన్నుకున్నది మొత్తంగా చూస్తే పది శాతం మందే. అలాంటి వాడి గురించి మనం మన సంస్కారాన్ని వదిలెయ్యక్కరలేదు అనుకుంటాను. ఇక్కడ ఓడిపోయిన పార్టీలో కొంత మంది అభ్యర్ధులను మనలాంటి ప్రజలే ఎన్నుకున్నది. అలా అని ఓడిన పార్టీ వాడు నెగ్గిన పార్టీ నాయకుడిని ప్రశ్నించకూడదంటే, మనం ప్రజాస్వామ్యం వదిలేసి ఆటవిక పాలనలోకి మళ్ళడం మంచిదేమో. ఇష్టం ఉన్నా, లేకపోయినా నెగ్గిన వాడు అందరినీ పరిపాలించవలసిందే. నాకు ఇష్టం లేని వాడు నన్ను పరిపాలించకూడదు అని అనడం ఎంత తప్పో, ఓటు వెయ్యనివాడు నన్ను ప్రశ్నించకూడదు అని అనడం కూడా అంతే తప్పు.

Saturday, May 31, 2014

ఏదయినా పని మొదలుపెట్టక ముందు ఆలోచించాలి కానీ, మొదలుపెట్టాకా ఇక దాని గురించి ఆలోచించకూడదు.ఇది నరేంద్ర మోడీ నమ్ముతాడో లేదో నాకు తెలియదు కానీ, ఆర్టికల్ 370 నుంచి మొదలయిన రచ్చ, ఇప్పుడు విద్యా వ్యవస్థకు, యూనిఫాం సివిల్ కోడ్ మీదకు మళ్ళింది. ఇంకా ఇటువంటివి ఏమయినా ఉన్నాయేమో చూసి అవి కూడా ఆయనకు చెప్పి వాటి మీదకు కూడా దృష్టి పెట్టేటట్టు చెయ్యవలసిన అవసరం మనకు ఉంది. అలాగే సేవ పేరుతో జరిగే మతమార్పిడులు, సెక్యులరిజం పేరుతో ఉగ్రవాదులను వెనకేసుకొస్తున్న వారి సంగతి అన్నీ ఒకే సారి మొదలుపెట్టేయాలి. ఎక్కడా ఖాళీ అనేది ఇవ్వకూడదు. వేడిలో వేడి అన్నీ ఒకేసారి జరిగిపోవాలి. గొడవలు కూడా ఒకేసారి జరిగి అదుపు చెయ్యబడాలి. అంతే కానీ రోజుకొకటి చొప్పున మొదలుపెట్టి ఈ దేశం ఉన్నంత కాలం వాటిని అలా పొడిగించుకుంటూ వెళ్ళడం వలన ఏ పనీ సరిగ్గా కాదు. అనవసర మొహమాటాలు అనవసరం.


       ఆయనన్నట్టు ఆయన చేసేది మంచి పనే కదా (కనీసం నాలాంటి ఊరోళ్ళ దృష్టిలో)

Saturday, May 24, 2014

మొన్న రాత్రి CNN-IBN లో అనుకుంటా, కర్ణాటకు చెందిన జ్ఞానపీఠ్ (?) అవార్డు గ్రహీత, మోడీ ప్రధాని అయితే దేశం విడిచి వెళ్ళిపోతానన్న అనంతమూర్తి, మన దేశంలో స్త్రీలల్లో స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేటట్టు నటించిన ఇద్దరు స్త్రీ మూర్తులలో ఒకరు, తను మైనారిటీ కాబట్టి తనకు ఎవరూ ఇల్లు అమ్మడం లేదు (తనకు తక్కువ డబ్బు ఇస్తే తను చేస్తుందో లేదో నాకు తెలియదు) అని వాపోయిన షబానా అజ్మీల మాటలు విన్నాకా నాకు అనిపించింది ఏమిటంటే, ఈ దేశంలో మైనారిటీలు అంటే ముస్లింలు, క్రిస్టియన్స్ మాత్రమే అని, వాళ్ళను చంపితే మాత్రమే వీళ్ళ హృదయాలు ద్రవించి నీరై పోతాయని, అదే మైనారిటీలుగా ఉన్న సిక్కులను, జైనులను కానీ, కాశ్మీరులో హిందువులను కానీ చంపితే వీళ్ళకు ఏమీ అనిపించదని.

అదే 1984లో డిల్లీలో మూడు వేల మంది సిక్కులను చంపేసినా, చంపిన వాళ్ళు కాంగ్రెస్ హిందువులు కాబట్టి వీళ్ళకు ఆ మారణకాండ కనిపించలేదని, హిందువులు అయినా, ఇక వేరే మతస్థులు ఎవరైనా కాంగ్రెస్, కమ్యూనిస్టుల వాళ్ళు అయ్యి మైనారిటీలను చంపినా అది తప్పు కాదని వీళ్ళు చెపుతున్నారు. అంతే కాదు, మన జ్ఞాన్ అనంతమూర్తి గారయితే ఇంకొక అడుగు ముందుకు వేసి, ఆ ఘోరాన్ని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాను, నేను ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాను అని కూడా చెప్పాడు. ఇంతకీ అదే మాట అనుకుంటున్నారు, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదట, మోడీ గురించి ఆయన అన్నమాటట. పైగా అప్పుడు ఆయన ఆ వేదనలో ఉండి దేశం విడిచివెళ్ళిపోతానని అన్నడట కానీ, ఆయనకు ఆ ఉద్దేశ్యం లేదట. మనమే ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నామంట.

మరి అంత జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానపీఠం మీద కూర్చున్నవాడు నోరు జారితే, మరుసటి రోజైనా నేను ఏదో వేదనలో ఉండి అన్నాను కానీ, నా మాతృభూమిని వదిలి నేను ఎందుకు వెళతాను అని సరి చేసుకోవాలి కదా. అలా చెయ్యకపోవడం ఆయన తప్పు కాదంట, మనం వెళ్ళిపొమ్మనడం మన తప్పంట. మనమేమీ ఊరికే వెళ్ళిపొమ్మనలేదు కదా, ఆయన జ్ఞానపీఠం మీద ఉన్నాడు కాబట్టి, కొద్దిగా అన్నా జ్ఞానాన్ని చూపిస్తాడని ఆయన మాట ఆయనకు గుర్తు చేసాము. దానికి మనల్ని తప్పు పడితే ఎలా? నాకు ఏమిటో అంతా అయోమయంగా ఉంది. మనం ఏమన్నా తప్పు మాట్లాడామా?

Wednesday, May 14, 2014

నేను సివిల్ డిప్లొమా పూర్తి చేసింది 1981 లో అయినా, మా నాన్నగారు సివిల్ ఇంజనీరింగులో లెక్చరరే కాకుండా చార్టర్డ్ ఇంజనీరు కూడా కావడం వలన 1978 నుండీ నా ఫీల్డుతో నాకు పరిచయం ఉంది. ఆ అనుభవంతో చెపుతున్నాను.
మా ఫీల్డు ఎన్‌డియే, తెలుగుదేశం హయాం నుండి సర్వనాశనం అయ్యిపోయింది. అప్పటి దాకా ఒక పనిని పది మంది కాంట్రాక్టర్స్‌కు పది బాగాలు చేసి ఇచ్చేవారు. ఎవరికి వారు పదిహేనో, ఇరవయ్యో శాతం లాభం వేసుకొని పని చేసేవారు. కానీ వీళ్ళ పాలన వచ్చాకా వేల కోట్ల విలువ చేసే పనిని కూడా ఒకే కాంట్రాక్టర్‌కు ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ చివరకు వచ్చే సరికి ఆ పని ఏ ఐదో కాంట్రాక్టరో సబ్‌కు తీసుకొని చేస్తున్నాడు. దాని ప్రకారం లెక్క వేస్తే, కనీసం మూడో వాడు సబ్ చేసినా పని విలువ నలబై ఐదు నుండి అరవై శాతం అంచనా పెరగడమో, లేదూ అంటే అంత శాతం నాణ్యత తగ్గడమో జరుగుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న IVRCL, NCC, RAMKY, MADHUCON లాంటివి అప్పుడు పురుడుపోసుకున్నవే. వీళ్ళు కూడా వర్క్‌ని సబ్‌ కాంట్రాక్ట్‌కే ఇస్తున్నారు, అలా మూడు నాలుగు చేతులు మారుతోంది. ఈ వ్యవస్థ నశించాలి, పని తక్కువ ఖర్చుతో నాణ్యతతో పూర్తవ్వాలంటే, పూర్వంలా చిన్న కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. బిజెపి వాళ్ళ మొదటి మానిఫెస్టోలో ఉప్పు తయారుచెయ్యడానికి మల్టీ నేషనల్ కంపెనీలకు పర్మిషన్ ఇవ్వము అని చెప్పుకున్నారు. ఆ తరువాత జరిగింది మనం చూసిందే. ఇప్పుడు దేశంలో ఉన్న కన్‌స్ట్రక్షన్ పనులన్నీ కూడా పాతిక, ముపై కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. ఆ వట వృక్షాల ముందు చిన్న కంపెనీలు బ్రతకలేకపోతున్నాయి. ఇలా ప్రతీ వ్యవస్థ కూడా పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఆఖరుకు రక్షణ వ్యవస్థ కూడా. దీనిని మోడీ ఏమన్నా మారుస్తాడేమో చూడాలి.

Sunday, April 27, 2014



జనాభాపరంగా ఎక్కువ ఉన్నామ్ము కాబట్టి, మనది పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతోంది కానీ, అందరూ అంటునట్టు గొప్ప ప్రజాస్వామ్య దేశం కాదు. ఎప్పటికీ కాదు కూడా. ఇది నేను నిరాశావాదంతో చెపుతున్న మాట కాదు, వాస్తవ పరిస్థితిని "నిజాయితీగా" గమనించండి, మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది.

కాంగ్రెస్‌ని ఇంతకాలం గమనించాము, మధ్యలో కొద్దికాలం బిజెపిని చూసాము. కాంగ్రెస్‌తో పోల్చి చూసినప్పుడు బిజెపి పాలన బాగుంది అని అనిపించి ఉండవచ్చు. కానీ అప్పుడు కూడా అభివృద్ధిలో అవినీతి జరిగింది. కాదని ఎవరన్నా అనుకుంటే, వాళ్ళు పిచ్చోళ్ళన్నా అయ్యి ఉండవచ్చు, లేదూ ఎంతో కొంత జరిగిందిలే, ఇంతకు మించి ఎవరు మాత్రం ఏమి చెయ్యగలరు అని ఆనందపడే అల్ప సంతోషి అన్నా అయ్యుంటాడు. నేను అల్ప సంతోషిని కాదు, పిచ్చి వాడిని అంతకంటే కాదు.

ఈ దేశంలో అవినీతి చెయ్యకుండా, ఏ మనిషీ ఆనందంగా బ్రతకలేడు. దానికి కారణం మన ప్రభుత్వ విధానాలు. కనీస అవసరం అయిన, మంచి నీరు కూడా రెండు రూపాయలకే ఇస్తాము అని గొప్పగా చెప్పుకోవలసిన స్థితికి మన నాయకులు వచ్చేసారు. ప్రపంచంలో ఎక్కడైనా కరువు వచ్చినప్పుడు మాత్రమే రైతు నష్టపోతాడు. మన దేశ రైతు దౌర్భాగ్యం ఏమిటంటే, ఎప్పుడూ నష్టపోతూనే ఉంటాడు.

జైలులో ఉండి, బెయిల్ మీద బయటకు వచ్చి, ఎన్నికలలో నిలబడిన వ్యక్తికి ప్రభుత్వం రక్షణ కల్పించే దుస్థితి మన దేశంలోనే ఉందేమో. అది నేనే చేసాను, ఇదీ నేనే చేసాను అని చెప్పుకునే వ్యక్తి మధ్యపాన నిషేధాన్ని అమలు పరచలేనని నిషేధాన్ని ఎత్తివేసి, ప్రజల ప్రాణాల మీద వచ్చే పన్నులతో పరిపాలన చేసాడు. ఆరోగ్యశ్రీ పేరుతో ప్రజల సొమ్ముని కార్పొరేట్ హాస్పిటల్స్‌ వాళ్ళకు కట్టబెట్టి, ప్రభుత్వ వైద్యశాలలను పడుకోబెట్టిన వ్యక్తి ఈ దేశంలో మాత్రమే దేవుడిగా పిలువబడతాడేమో. సంస్క్రృతీ పరిరక్షకులం అని చెప్పుకునే పార్టీ వాళ్ళు, పరిపాలనలో ఉండగా మాత్రం గోహత్యను నిషేధించలేకపోయారు.

ప్రతీ పార్టీ కూడా పారిశ్రామిక వేత్తల చేతుల్లో ఉన్న ఈ దేశంలో సామాన్యుడి కోసం పరిపాలన చేసేవాడిని మనం చూడగలము అని అనుకుంటే, అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు.

ప్రతీ ఐదువేల సంవత్సరాలకొకసారి భూమి మీద యుద్ధం వలనో, ఉత్పాతాల వల్లనో జనాభా ముప్పాతిక భాగం నశించిపోతుందనేది నిజమైతే, అది జరిగే దాకా మనం ఏదైనా ఆశించడం అనవసరం. మహా భారత యుద్ధం జరిగి ఇప్పటికి ఐదువేల సంవత్సరాలు అయ్యింది అని లెక్కలు చెపుతున్నారు కాబట్టి మనం ఆ క్షణాల గురించి ఎదురుచూడడమే.

Monday, March 17, 2014

ఇప్పుడు సోషన్ నెట్ వర్క్స్‌ని ప్రతీ పార్టీ వాడుకుంటోంది. మనం పెట్టే కొన్ని పొస్టులు, రాసే కొన్ని కామెంటులు  కొంత మంది రాజకీయ నాయకులైనా అప్పుడప్పుడు చూసే అవకాశం ఉంది. కాబట్టి మనం అభిమానించే  పార్టీ / నాయకుడిలో మనకు తప్పు కనిపించినప్పుడు దానిని ఫేస్‌బుక్ / ట్విట్టర్‌ల ద్వారా చెపితే సరిదిద్దుకోవడానికి (సరిదిద్దుకోరు  అనేది అందరికీ తెలుసు, కానీ ఎక్కడైనా కొద్దిగా పలచటి చర్మం ఉన్నవాడు ఉంటే వాడికోసం) అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం. అంతే కానీ నా పార్టీ గంగలాంటిది, నా నాయకుడు అపర భగీరధుడు అని చెప్పడం వలన ఉపయోగం కంటే అపకారమే ఎక్కువ జరుగుతుంది. మన దేశంలో అన్ని  వ్యవస్థలను మన రాజకీయనాయకులు నిర్వీర్యం చేసేసారు. కాబట్టి వాళ్ళను అదుపు చెయ్యగలిగేది మనమే. 

నా అంచనా ప్రకారం 

 అతి తొందరలో మన దేశంలో అంతర్యుద్ధాలు మొదలవుతాయి. అవి మొదలు కాకుండా ఉండాలంటే మనమే మేలుకోవాలి. మన దేశంలో ఏ వ్యవస్థా ఆఖరికి న్యాయ వ్యవస్థ కూడా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడలేదు.ఇప్పుడు, నిరక్ష్యరాశ్యులయిన రాజకీయనాయకుల కంటే విద్యావేత్తలయిన రాజకీయనాయకులే ఎక్కువగా మన దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఈ విషయంలో విద్య అపాత్ర దానం కాకూడదు అని మనువు చెప్పిన వాస్తవాన్ని అందరం ఒప్పుకోవలసిందే.

Wednesday, January 15, 2014

చాలా కాలం అయ్యింది బ్లాగ్ వ్రాసి, ఎందుకనో ఈ రోజు మళ్ళీ రాయాలనిపించింది. ఏమి వ్రాయాలి? మనసు చాలా భారంగా ఉంది. ఏదో కాలక్షేపానికి అని ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసాను. కానీ చివరికి అది నాకు సమయం చాలకుండా చేసింది. కాలక్షేపం అనుకున్నది కాస్తా వ్యసనమయ్యి కూర్చుంది. ఒక విధంగా మంచే జరిగింది అనిపిస్తోంది.  

గతం గతః




మన జాతి ఇలా ఎందుకుందో తెలుసుకోవలసిన అవసరం, మనకు మునుపు కంటే ఇప్పుడే ఎక్కువ కనిపిస్తోంది. "గతం గతః" అనే భావనను, మన పెద్దలు మన మంచి కోరి వ్యాప్తి చేసారు. అది వ్యక్తిగతంగా అనవసర శతృభావనలు ఉండకూడదు, జరిగిన చెడుని మరచిపోయి, తిరిగి మామూలు జీవితం గడపాలి అనే సదుద్ధేశ్యంతో మనకు ఎప్పుడూ చెపుతుంటారు. కానీ అలా అనుకోవడం జాతికి కూడా అన్వయించేసుకుంటున్నాము మనము. చరిత్రని మరచిన ఏ జాతీ ప్రపంచాన్ని ఏలలేదు, చరిత్ర నుండి ప్రేరణ పొందాలి, జరిగిన అవమానాలు గుర్తుచేసుకోవాలి, పైకి ఎదగాలి. అది మన జాతిలో ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మన జాతి ప్రపంచాన్ని ఏలుతుంది. 

నేను, నాథూరాం గాడ్సే మరణ వాంగ్మూలం పుస్తకం తెప్పించమని ఒక ఆర్.ఎస్.ఎస్ ముఖ్యుడిని అడిగాను. దానికి ఆయన ఇప్పుడు, గాంధీ లేడు. గాడ్సే లేడు, అవి చదివి మనం తెలుసుకోవడం వలన ఏమన్నా ఉపయోగం ఉందా అని అన్నారు. ఈ భావన పోవాలి. చరిత్ర నిజాయితీగా తెలుసుకోవాలి, తప్పొప్పులు చూసుకోవాలి.

కనీసం మన పాఠ్య పుస్తకాలలో నిజాన్ని చెప్పాలి, బాబ్రీ మసీదు, కాశీ విశ్వేశ్వరాలయం, తేజో మహల్, కుతుబ్ మీనార్ల గురించిన నిజాలు పిల్లలకు చెప్పాలి. రాజమండ్రి లాంటి ప్రాంతాలలో కూడా దేవాలయాలు కూలగొట్టిన విషయాలను తెలియచెయ్యాలి. పనికిరాని సీరియల్స్ ప్రచురించే వార్తా పత్రికలు, చరిత్రను రచయితలతో వ్రాయించి, అవి సీరియల్స్‌గా ప్రచురించాలి.


ముదిగొండ శివప్రసాద్, శ్రీ ప్రసాద్ గార్ల వారసులను వెతకాలి. కొద్దిగా నాయకీయత జోడించాలి తప్పదు, మన దౌర్భాగ్యం కొద్దీ పిల్లలకు చరిత్ర అంటే అంత ఇష్టం కలగడం లేదు.

 పిల్లలను చిన్నతనం నుండే, భారతీయులం మనం ప్రపంచానికే మార్గదర్శ్డకులం అనే గర్వాన్ని పెంచాలి, ఇంగిలిపీసులో చెప్పాలంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ పెంచాలి, మళ్ళీ తిరిగి మనం "ప్రపంచానికి మార్గ దర్శకులం కావాలి" అనే పట్టుదల పెంచాలి. 

ఇవన్నీ జరిగిన రోజు మాత్రమే ఈ జాతి పతాకం ప్రపంచ వీధుల్లో ఎగురుతుంది.

జై భరతమాత.