ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Sunday, July 6, 2014

పూర్వం ఎన్నికలప్పుడు, ఆ తరువాతా రాజకీయాల పేరుతోనూ, సినిమా అభిమానం పేరుతోనూ జనాలు కొట్టుకుంటుంటే, ఆశ్చర్యం వేసేది. వాళ్ళందరూ చదువు లేనోళ్ళనుకునేవాడిని. కానీ ఈ మధ్యన ఫేస్‌బుక్ లాంటి వాటిలో చూసుంటే మనలో కులభిమానాలు, ప్రాంతీయవాదాలు, బానిస మనస్థత్వాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. ఏ నాయకుడినయినా ఏదన్నా అంటే మీద పడిపోతున్నారు. ప్రతీ మనిషిలోనూ మంచీ, చెడూ రెండూ ఉంటాయి. మనకు నచ్చిన నాయకుడిలో అంతా మంచే అనుకునే స్థితిలో మనం ఉండి, అతనిని ఇంకెవరూ ఏమీ అనకూడదు, అంటే బూతులు తిడతాం అంటే సమాధానం ఏమీ ఉండదు. మన దగ్గర ఓటు హక్కు ఉన్నవాళ్ళే యాభై శాతం మంది ఉంటారు, అందులో ఓటు వేసేవాళ్ళు అరవై శాతం లోపు. ఆ అరవై శాతం మంది మూడు పార్టీలకు వేస్తారు. అంటే ఇరవై ఒక్క శాతం ఓట్లు వచ్చిన వాడు నాయకుడు. వాడిని ఎన్నుకున్నది మొత్తంగా చూస్తే పది శాతం మందే. అలాంటి వాడి గురించి మనం మన సంస్కారాన్ని వదిలెయ్యక్కరలేదు అనుకుంటాను. ఇక్కడ ఓడిపోయిన పార్టీలో కొంత మంది అభ్యర్ధులను మనలాంటి ప్రజలే ఎన్నుకున్నది. అలా అని ఓడిన పార్టీ వాడు నెగ్గిన పార్టీ నాయకుడిని ప్రశ్నించకూడదంటే, మనం ప్రజాస్వామ్యం వదిలేసి ఆటవిక పాలనలోకి మళ్ళడం మంచిదేమో. ఇష్టం ఉన్నా, లేకపోయినా నెగ్గిన వాడు అందరినీ పరిపాలించవలసిందే. నాకు ఇష్టం లేని వాడు నన్ను పరిపాలించకూడదు అని అనడం ఎంత తప్పో, ఓటు వెయ్యనివాడు నన్ను ప్రశ్నించకూడదు అని అనడం కూడా అంతే తప్పు.