ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Monday, March 14, 2011

నా నెచ్చెలి.















 

ఈ బుజ్జిముండని 2004 లో, అప్పటిదాకా నా దగ్గర ఉన్న పల్సర్ 150cc, మారుతీ 1000cc లు అమ్మేసి కొన్నాను. పాపం ఆ రోజు నుండీ ఈ రోజు దాకా నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, నన్ను చాలా క్షేమంగా నా గమ్యానికి చేరుస్తూనే ఉంది. షాద్‌నగర్ పొలాల్లో తిరిగినా, తిరుపతి ఏడుకొండలు ఎక్కినా, అరకు అందాలు చూడడానికి వెళ్ళినా, శ్రీశైలం, ఆత్మకూర్ ఘాట్ రోడ్‌ల్లో తిరిగినా, మంత్రాలయం, పుట్టపర్తిలు తిరిగినా, తుల్జాపూర్, అక్కల్‌కోట్, ఘాణుగాపూర్‌లు తిరిగినా ఆఖరికి విపరీతమైన డిప్రెషన్‌తో ఎక్కడో అక్కడ ఏక్సిడెంట్ అయ్యి చావకపోతానా అని (ఒక ఆత్మహత్యా ప్రయత్నం విఫలం అయ్యి రెండో సారి చేసుకునే దైర్యంలేక) అర్ధరాత్రి హైదారాబాద్‌లో బయలుదేరి వైజాగ్ ప్రయాణమైనా, నా కోరిక తీరకుండా నా గమ్యస్థానానికి నన్ను చేరుస్తూనే ఉంది. ఏరోజూ నన్ను దారిలో ఇబ్బంది పెట్టలేదు. ఇండియన్స్‌ని సెంటిమెంటల్ ఫూల్స్ అని విదేశీయులు వేళాకోలం చేస్తారు. కానీ వాళ్ళకేమి తెలుసు, మనల్ని ప్రాణం లేని వస్తువులు కూడా కాపాడతాయని.

నేను ఇప్పటిదాకా Luna, Bajaj Chetak, Kawasaki RTZ, Calibar, Hero Honda SS, Pulsar 150cc, Maruti 1000cc లు వాడినా, నా మదిని దోచినవి మాత్రం Kawasaki, ఇప్పుడు నా దగ్గర ఉన్న Yamaha Crux లు మాత్రమే. ఇది కొనడం కూడా మా కజిన్ చెప్పేడని కొన్నాను. లేకపోతే మళ్ళీ బజాజ్ వాళ్ళదే ఏదో ఒకటి కొనేవాడిని. వాడిని ఇప్పటికీ తిడుతూ, నువ్వు జీవితంలో చేసిన ఒకే ఒక్క మంచిపని నన్ను ఈ బండి కొనమనడంరా అంటుంటాను.

దీనిని నేను సరిగ్గా వాడడం మొదలుపెట్టింది  2008 జనవరి 17 నుండే. ఆ రోజు ఎక్కడో అక్కడ ఏక్సిడెంట్‌లో చచ్చిపోవాలని రాత్రి 11.00కి హైదరాబాద్‌లో వైజాగ్ వెళ్ళడానికి బయలుదేరాను. అప్పటినుండీ ఇది నా ప్రియనేస్తం అయ్యిపోయింది.దీనిమీద అరకు అందాలు చూసాను, శ్రీశైలం, మహానంది, తిరుపతి, కాళహస్తి, కాణిపాకం, పుట్టపర్తి, మంత్రాలయం, తుల్జాపూర్, అక్కల్‌కోట్, ఘాణుగాపూర్ లాంటి పుణ్యక్షేత్రాలు తిరిగాను. ఏరోజూ ఎక్కడా ఆగడం అనేది జరుగలేదు. ఈ జనవరిలో ఇది అమ్మేసి Apachi కొందామనుకొని, దీనిని అమ్మబుద్ది కాక Apachi కొనడం ఆపేసాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో రెండు బళ్ళు వాడడం కష్టం. ఇదివరకు ఐతే వాడినా వాడకపోయినా నా Kawasaki ని అమ్మకుండా అలాగే ఉంచేసాను. చివరికి ఆస్థితోపాటు అది కూడా అమ్మేసాను. ఎందుకంటే నాది అనుకొనే ఏ వస్తువుకూడా నా దగ్గర ఉంచుకోదలచుకోక దానిని షాద్‌నగర్‌లో అమ్మేసాను. ఇక ఇప్పుడు దీనిని అమ్మే ఆలోచన లేదు. నేను వేరే ఊరు ఏదైనా పనిమీద ఎక్కువ కాలం వెళ్ళవలసి వస్తే, రాగానే ముందు నేను దీనిని తనివితీరా చూసుకొనిగానీ పైకి వెళ్ళను. ఇది నా మీద అంత ప్రభావం చూపించింది.

Saturday, March 12, 2011

ఇది ఎవడబ్బ సొత్తు?

అసలు మన రాజకీయనాయకులు ఏమి అనుకుంటున్నారో అర్ధం కావడంలేదు. ఎవరి సొమ్ము, ఎవరు దానం చేస్తున్నారు? ఇప్పుడే కనుక శ్రీ శ్రీ బ్రతికుంటే, కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిల్లా కాదేదీ కవిత కనర్హం అని కాకుండా అడవి చెక్కా, కొండ గుట్టా, సాగరతీరం కాదేదీ సెజ్‌ కనర్హం అని వ్రాసేవారేమో? 10 సంవత్సరాల క్రితం అడ్రస్ అంటూ లేని వాళ్ళు, ఈ రోజు బిజినెస్ మాగ్నట్‌లు. ఎవడైనా ఇండస్ట్రీ పెడతానంటే పాపం, వాడి వెనకాల మా రాష్ట్రంలో పెట్టు, మా రాష్ట్రంలో పెట్టు అని పరిగెడుతున్నారు. వాళ్ళకు ఇచ్చే సబ్సిడీలు చూస్తుంటే, వాడి కంపెనీలో ప్రొడక్షన్ లేకపోయినా పరవాలేదు అనిపిస్తోంది. సాగరతీరం..సంద్యాసమయం అనే పాటకి ఇప్పుడు రక్తమయం అని కలుపుకుని పాడుకునే రోజులు వచ్చాయి

అందులో మన రాష్ట్ర పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సరే ఇవన్నీ నడిస్తే, ఒక 50 సంవత్సరాల పాటు కొంతమందికైనా ఉద్యోగాలు వస్తాయి అనుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళకి కారుచవగ్గా స్థలాలు ఇవ్వడం ఏమిటో అర్ధం కావడంలేదు. పోనీ వాడేమైనా సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు అమ్ముతాడా అంటే, అన్నీ కూడా చదరపు అడుగు 2500-4000 వరకు విలువచేసేవే. అంటే డబ్బున్న వాడికి డబ్బున్నవాడు కట్టి అమ్ముకోవడానికి, ప్రజల ఆస్తులు ధారపోస్తున్నారన్నమాట.

మొన్న జరిగిన మిలియన్ మార్చ్‌లో, ఎటువంటి రాజకీయప్రమేయంలేని మహానుభావుల విగ్రహాలు ధ్వంసం చేసేబదులు, ప్రజల ఆస్తులని సెజ్‌ల పేరు చెప్పి కొల్లగొడుతున్నవాళ్ళ కొంపలు కూలగొట్టి ఉంటే, మిగిలిన అసహాయులకి మార్గదర్శకులుగా మిగిలిపోయేవారు. వీరికి దేశమంతా జోహార్లు చెప్పేది. సి.బి.ఐ. కూడా ఆశ్చర్యపోయే రీతిలో మన రాష్ట్రంలో అవినీతి జరుగుతుంటే మనమేమో తెలంగాణా అని, సమైక్యాంధ్రా అని కొట్టుకు చస్తున్నాము. నిజంగా తెలంగాణా కావాలనుకొనే వాళ్ళు ముందు సెజ్‌లని నాశనం చెయ్యాలి. దేనికి ఎంత అవసరమో అంత భూమి మాత్రమే ఉంచి, మిగిలిన భూమి ప్రజలు స్వాధీనం చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం పిల్లలని రెచ్చగొడుతున్న ఈ నాయకులు, రేపు తెలంగాణా వచ్చాకా వాటాలు తీసుకొని ఆ సెజ్‌ల జోలికి వెళ్ళరు. ఈ రాజకీయ రాబందులు ఆంధ్రాలో అయినా, తెలంగాణాలో అయినా ఒకటే జాతి. వీళ్ళని ఇరగదీస్తే కానీ సామాన్యుడి ఆస్తులకి రక్షణ ఉండదు.

పాపం నా స్నేహితుడు గంజివరపు శ్రీనివాస్ పెళ్ళాం, పిల్లలని వదిలేసి అడవి బిడ్డల కోసమని చెట్టూ, పుట్టా కాగితాలు, కెమెరాలు పట్టుకుని తిరుగుతున్నారు. వాటి వలన ఎంతవరకు ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు కానీ, అవి కాకుండా వాళ్ళకి తుపాకులు ఎలా కాల్చాలో చెపితే వెంటనే ఉపయోగం కనిపిస్తుంది. ప్రతి ఊరు, ప్రతి అడవి ఒక సోంపేట, ఒక కాకరాపల్లి, ఒక సింగూరు అవ్వవలసిందే. ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉండవలసింది కారం డబ్బాలు కాదు, చేతి బాంబులు, గండ్ర గొడ్డల్లు.

జపానులో సునామీ, మరో 12 దేశాల్లో ప్రమాదహెచ్చరికలు. ఒక ప్రక్క అడవులు నరుక్కుంటూ వెళుతూ మనల్ని మనమే చంపేసుకుంటున్నాము. ఇప్పుడు, ఆ నష్టాన్ని సరిచెయ్యడానికి, కొన్ని లక్షల కోట్ల డాలర్లు కాంట్రాక్టర్‌ల చేతిలో పెట్టాలి. సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడిన కాకినాడ హోప్ ఐలండ్‌ని ఇప్పుడు ఒక వ్యాపారవేత్త చేతిలో పెట్టారు. రేపు ఉప్పెన వస్తే కాకినాడ పరిస్థితి ఏమిటి?

యుగాంతానికి ఆకాశంలో జరిగే మార్పులేమిటో, వాటి వలన ఎంతవరకూ నష్టముందో తెలియదు కానీ, ప్రకృతిని నాశనం చేసి, మనం భూమి మీదే ఆ పరిస్థితులు సృష్టిస్తున్నాం.