ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Tuesday, December 13, 2011

లోకం


మనుషులు ఎన్ని రకాలు అని ఎవరైనా అడిగితే, మనం, చెప్పే సమాధానం రెండు రకాలు అని. అది ఆడ, మగ అని ఒకరు, డబ్బున్నవాడు, డబ్బులేని వాడు అని ఒకరు, దోచుకునేవాడు, దోచుకోబడేవాడు అని ఒకరు అలా ఎవరికి తోచిన సమాధానం వాళ్ళు చెపుతారు. కానీ, నిజంగా మనుషులు ఎన్ని రకాలంటే, ఈ భూమి మీద, నరజాతి ఎంత ఉందో, అన్ని రకాలు అని చెప్పడం సరి అయినది అని అనిపిస్తోంది.
ఏ ఇద్దరి మనుషులు ఒకలాగ ఆలోచించరు, అలాగే, ఏ ఇద్దరి కష్టం ఒకలాగా ఉండదు. ఎవరి కష్టాలు వారికి పెద్దవి, అవతలి వారికి పెదవి విరిచేటంత చిన్నవి. ఈ రోజు నేను విన్న రెండు సంగతులు నన్ను చాలా భాధించాయి. అందులో, ఒకటి మా ఆఫీసులో పని చేసే ఒక వృద్దురాలిది, రెండోది నా కజిన్ ది.
ఈ రోజు మధ్యాహ్నం, నేను ఆఫీసులో టిఫిన్ చేస్తూ, ఆవిడను మీది ఏ ఊరు అని అడిగాను. మిర్యాలగూడ దగ్గర పల్లె సారూ, మా నాన్న, మేము పుట్టకముందే హైదరాబాదు వచ్చేసాడు, మాకు అక్కడ చాలా పొలం ఉండేదంట, అప్పుడు అక్కడ నీళ్ళు లేక మా అయ్య ఇక్కడకు వచ్చేసాడు. తరువాత అక్కడ సాగర్ కాలువ వచ్చింది. మా తాతా వాళ్ళు అక్కడకు వెళ్ళేసరికి, అక్కడ పాలెగాడు దానిని సాగుచేసుకుంటున్నాడంట, మా అయ్యా వాళ్ళని బెదిరించాడంట, వీళ్ళు భయపడి వచ్చేసారు. అప్పటినుండీ ఇక్కడే బట్టలు నేసుకుంటూ బ్రతికాడంది. ఈ లోపు, మా అకౌంటంట్, మీ ఆయనది ఏ ఊరు అని అడిగాడు. నల్గొండ అని, నా పెళ్ళి ఎప్పుడు అయ్యిందో నాకు యాదికే లేదు, కానీ గుర్రం మీద ఊరేగించారు, అది ఒక్కటి గుర్తుంది. పెళ్ళి అయ్యాకా ఎప్పటికో, మా ఆడబిడ్డతో విజయవాడ కేసి వెళ్ళినప్పుడు అక్కడే, రజస్వలని అయ్యాను అని చెప్పింది. ఇప్పుడు మీ ఆయన ఎక్కడుంటున్నాడు అని అడిగితే, రెండో పెళ్ళి చేసుకొని దానితో నల్గొండలోనే ఉన్నాడు అని చెప్పింది. నిన్ను ఎందుకు వదిలేసాడు, ఆవిడ బాగుంటుందా అని అడిగాడు. దానికి ఆమె, నేను దానినెక్కడ చూసాను, నాకు ఆరోగ్యం బాగాలేదని నన్నొగ్గేసి దానిని చేసుకున్నాడు అంది. ఎప్పుడైనా నిన్ను కలిసాడా అని అడిగితే, మొన్న మా మరిది పోయినప్పుడు అక్కడకు వెళితే ఫుల్ గా కల్లు తాగేసి వచ్చి నన్ను ఒకటే తన్నులు, అప్పుడు అక్కడే ఉన్న మా ఆడబిడ్డలు నవ్వుతుంటే, మా మరిది కూతురు వచ్చి వాడిని తిట్టి, నన్ను పక్కకు లాకెళ్ళిపోయింది అని ఎటువంటి భాధ లేకుండా నవ్వుతూ చెప్పింది. ఇక్కడకు వస్తాడా అని అడిగితే అప్పుడప్పుడూ వచ్చి కొడుకుని నెలకు మూడువేలు ఇవ్వు అని గొడవచేసి పోతాడండీ అంది. నా కొడుకు ఎలా ఇస్తాడండీ, వాడు పదో తరగతి పూర్తయిపోయాకా, నేను హాస్పిటల్ లో ఉంటే, ఇంటికి వచ్చి ఇల్లు అమ్మేసాను, వచ్చి సంతకం పెట్టు అని నా కొడుకుది స్కూలు టీ.సి. తీసుకుపోయి వాడూ, అక్కడ ఉన్న పెద్దమనిషి కలిసి బెదిరించారంట. వీడు పెట్టనంటే, నీ టీ.సి చింపేస్తాను అంటుంటే మా ఆడబిడ్డ కొడుకు వచ్చి ఒరేయ్, వెధవ ఇల్లు పోతేపోయింది, నువ్వు చదువుకుంటే పెద్ద ఉద్యోగం చేసుకోవచ్చు, సంతకం పెట్టేసి ఆ టీ.సి తీసుకో అని సంతకం పెట్టించాడంట. వీడు సంతకం పెట్టగానే ఆ టీ.సి ఇచ్చేసి, ఏరా డబ్బులేమన్నా కావాలా అని నవ్వుతూ అడిగాడంట. నువ్వూ వద్దు, నీ డబ్బూ వద్దు అని నా కొడుకు వచ్చేసాడు అని నవ్వుతూ చెప్పింది. ఆవిడ అది చెపుతున్నంత సేపూ ఆవిడలో ఎక్కడా భాధ అనేది కనిపించలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. భర్త వదిలేసాడు అని భాధ లేకపోవచ్చు, కానీ, పడిన కష్టాల గురించి కూడా ఆవిడలో ఎక్కడా భాధ కనిపించలేదు. జీవితాన్ని ఎలా వస్తే అలా నడుపుకుంది ఆవిడ. ఆవిడను నేను గత నాలుగు సంవత్సరాల నుండీ చూస్తున్నాను. ఎప్పుడూ, నవ్వుతూనే తింగరి, తింగరిగా ఉంటుంది. ఆవిడ అదృష్టం, కొడుకు ఈ మధ్యనే కారు కొనుక్కున్నాడంట, కూతురి పరిస్థితి కూడా బాగానే ఉంది. ఆవిడ కొడుకు, కారు కొనుక్కున్న రోజు మాకు చెపితే, మా అకౌంటంట్, శుభ్రంగా ఇంటిలో కూర్చుని తినక ఈ పని నీకెందుకు అని అడిగితే, నాకు ఓపిక ఉండగా నేను వాళ్ళ సొమ్ము ఎందుకు తినాలి ఓపిక ఉన్నంతవరకు చేస్తూనే ఉంటాను అంది. రోజూ సిటీబస్ లో విద్యానగర్ దగ్గరనుండి అమీర్ పేట దగ్గర ఉన్న మా ఆఫీస్ కు వస్తుంది. ఇంతకూ ఆవిడకు ఇచ్చేది 1200 రూపాయలు.     

Thursday, August 4, 2011

నేనేమిటి?

చాలా రోజుల తరువాత బ్లాగ్ వ్రాయాలనిపించింది. ఏమి వ్రాయాలి అని ఆలోచిస్తుంటే, అసలు ఎప్పుడూ దాని గురించో, దీని గురించో లేకపోతే ఎవరెవరి గురించో వ్రాస్తున్నాము కదా, ఈసారి నా గురించే వ్రాస్తే పోలేదా అనిపించింది. అది కూడా ఎందుకంటే నా బ్లాగ్ చదివే వాళ్ళకు నేనెవరో తెలియదు. నా రాతలు చూసి వాళ్ళు, నన్ను ఏదో గొప్ప సంస్కారం ఉన్నవాడిని అనుకుంటారేమోనని (అనుకోవాలనే కోరిక నాలో ఉందనుకోండి) నాకు అనుమానం వచ్చింది. కానీ, నేను ఇటువంటి వాడిని అని తెలిసాకా నా బ్లాగ్‌లు ఎంతమంది చదువుతారో తెలుసుకోవాలనిపించింది.  మనిషి రాతకు, వాడి వ్యక్తిత్వానికి ఇంత తేడా ఉంటుందా అని, వాళ్ళు అనుకుంటారని నా నమ్మకం. అప్పుడు నా బ్లాగ్ ఎంతమంది చదువుతున్నారో కౌంటర్ చూసి తెలుసుకుంటే ఎలా ఉంటుందా అనే కుతూహలంతో నా గురించి 90% వాస్తవాలు రాస్తున్నాను. మిగిలిన 10% ఎందుకు దాస్తున్నానంటే దాని అవసరం నాకు వ్యక్తిగతంగా ఉంది. అది మీకు ఇప్పుడు చెప్పేది కాదు.

నేను శ్రీశ్రీ కంటే విశ్వనాధవారిని ఇష్టపడతాను. విశ్వనాధ్ సప్తపది కంటే బాపూ గారి రాధాకళ్యాణం ఇష్టపడతాను. దీనిని బట్టే మీరు ఒక నిర్ణయానికి వచ్చేయవచ్చు. నేను ఛాంధసవాదిని అని. యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల కంటే అంతర్ముఖం ఇష్టపడతాను. చలం గారు చెప్పిన దైవమిచ్చిన భార్య అంటే నాకు ఇష్టం, కానీ నా భార్య నాతో తప్పితే వాళ్ళ అమ్మా, తమ్ముల్లతో ప్రేమగా ఉన్నా తట్టుకోలేను. గొప్ప స్వార్థపరుడను. నేను ఒంటరిగా ఉంటున్నాను, నన్ను చూడడానికి నా భార్యా, పిల్లలు ఇష్టపడడం లేదు. పిల్లలతో అసహ్యించుకోబడే తండ్రి ఖచ్చితంగా వెధవ అయ్యుంటాడు, కాబట్టి నేను వెధవనే. నా దగ్గర శ్రీశ్రీ, చలం, విశ్వనాధ, బుచ్చిబాబు, తిలక్ లాంటి వాళ్ళ సాహిత్యం ఉంటుంది కాబట్టి, నన్ను గొప్ప మానవతావాదినని నమ్మి నన్ను ఇష్టపడి పెళ్ళి చేసుకుని మోసపోయానని నా భార్య అనేది కాబట్టి నేను మోసగాడిని. తను నా దగ్గర నుండి నా తప్పుందని వెళ్ళిపోయినా, ఆ నెపం వాళ్ళ అమ్మా వాళ్ళ మీద వేస్తున్నాను కాబట్టి, నేను నెపం ఇతరుల మీద వేసేవాడిని. నా మాటకెదురు చెప్పే వాళ్ళని, నేను అసలు భరించలేను, కాబట్టి నేను అహంభావిని. అప్పుడప్పుడు నాకు ఇవ్వవలసిని డబ్బులు ఇవ్వకుండా, హాయిగా ఎంజాయ్ చేసే వాళ్ళని చూస్తుంటే కడుపు మండిపోతుంది. కాబట్టి ఈర్ష్యాపరుడను. సంవత్సరం క్రితం దాకా రోజుకు 6 పెట్టెలు సిగరెట్‌లు కాల్చేవాడిని. కాబట్టి నాతో పాటు పాసివ్ స్మోకింగ్‌తో మిగిలిన వాళ్ళని కూడా చంపడానికి ఇష్టపడేవాడిని. (ఇప్పుడు రెండు పెట్టెలే కాలుస్తున్నాను). కోపం వచ్చిందంటే (ఊరికే అంటున్నాను, అది ఎప్పుడూ నాతోనే ఉంటుంది), నా నోట్లోంచి వచ్చే మాటలు తాగిన వాడి నోట్లోంచి కూడా రావు. పక్కా యాబ్రాసిని.

నా తల్లి, నా కూతుర్లు, నా మేనకోడల్లు, నా అక్కలు, నన్ను మావయ్యా అని పిలిచే వాళ్ళల్లో తప్పితే మిగతా అందరిలో నాకు ఆడదే కనిపిస్తుంది. అలాగని అందరినీ నేను కోరుకుంటానని కాదు, నాకూ ఒక టేస్ట్ ఏడిచింది. ఇలియానాను ఇష్టపడతాను కానీ, అనుష్కని ఇష్టపడను. నేను సివిల్ ఫీల్డ్‌లో ఉన్నవాడిని కాబట్టి నా భాషలో చెప్పాలంటే నేను 6mm Plain bar ని ఇష్టపడతాను. రోడ్డు మీద రెచ్చగొట్టేటట్టు ప్రవర్తించే ఆడవాళ్ళని చూస్తే నాకు తెలియకుండానే నోట్లోంచి డైలాగ్‌లు వచ్చేస్తాయి (ఇప్పుడు నా వయసు 48), వ్యక్తి స్వేచ్చని ఇష్టపడను కాబట్టి కుసంస్కారిని. నన్నెవరైనా కించపరిచితే వెనుకా, ముందూ చూడకుండా నువ్వెంత, నీ బ్రతుకెంత అని కడిగి పారేస్తాను. ఒళ్ళు పొగరెక్కువ. నేను ఈ రోజు దాకా నా షర్ట్ పై బటన్ ముగ్గురు ముందే పెట్టాను, కాబట్టి బలుపెక్కువ. జాతకాలనీ, పూజలనీ, హోమాలనీ నా ప్రోబ్లం తీరడానికి లక్షలు ఖర్చుపెట్టాను కాబట్టి మూర్ఖుడిని.

 ఇన్ని నెగటివ్ లక్షణాలు నాలో ఉన్నాయి. కాబట్టి, ఇక నాలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నా అవి పట్టించుకోవక్కరలేదు.

ఇక్కడితో నేనేంటో తెలిసింది కాబట్టి, వీడి గురించి చదవడం శుద్ద దండుగ అనుకుని సిస్టం ఆపుచేసేసేవాళ్ళు ఆపుచేసేయండి.

***************************************************************************************************************************************************************

లేదులే రావణాసురుడిలో కూడా కొంత మంచి ఉంది కదా, ఈ వెధవలో కూడా ఏమైనా మంచి ఉందేమో చూద్దాము అనుకుని ఎవరైనా మిగిలి ఉంటే ఇక్కడ నుండీ నాలో ఉన్న ( అవి మంచివి అని నేననుకుంటున్నాను కాబట్టి,  మీరూ అలాగే అనుకోవాలి, అన్నీ నేనే డిసైడ్ చేస్తాను, ఎంతైనా అహంభావిని కదా) కొన్ని పాజిటివ్ లక్షణాలు చూడండి.

అవి నా బ్లాగ్ కౌంటర్ చూసాకా వ్రాస్తాను. బై.
మీ? రామర్రాజు. (రామర్రాజు అని పొరపాటున వ్రాయలేదు, 3000 ఇచ్చి మరీ మార్పించుకున్న పేరది).

Monday, June 13, 2011

బాల కార్మిక వ్యవస్థ.

చాలా కాలం తరువాత బ్లాగు వ్రాస్తున్నాను. ఈ రోజు Anti Child Labor Day అని నా ఫేస్‌బుక్ ఫ్రెండ్ లక్కీ దాని మీద ఒక ఒక పోస్ట్ పెట్టింది. నన్ను గంజివరపు శ్రీనివాస్ గారు, లక్కీలు తమ స్నేహితుడిగా కలుపుకున్నందుకు నేను చాలా గర్వ పడుతుంటాను. నేను ఈ సోషల్ సైటుల గురించి మాట్లాడవలసి వస్తే ముందుగా వీళ్ళిద్దరి గురించే చెపుతాను. ఈ మద్యనే శ్రీనివాస్ గారు, Ramanjaneyulu GV గారి గురించి చెప్పారు. ఇప్పుడే ఆయనకు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. వీళ్ళందరూ ఏదో ఒక కాజ్ మీద ఉద్యమిస్తున్నారు. ఇలాంటి వాళ్ళతో నాకు పరిచయం ఉందని చెప్పుకోవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వీళ్ళీద్దరూ నా కంటే చిన్నవాళ్ళు. మనకంటే చిన్న వాళ్ళని మనం పొగడకూడదని పెద్దలు చెపుతారు. అందుకని, ఇంతకంటే నేను వాళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నానో చెప్పదలచుకోలేదు.

ఇక పోతే, ఈ రోజు లక్కీ పెట్టిన పోస్ట్ గురించి నా ఆలోచన చెపుదామనే ఈ బ్లాగ్ వ్రాస్తున్నాను. బాల కార్మిక వ్యవస్థ పోవాలంటే ముందుగా వాళ్ళ తల్లి, తండ్రుల ఆర్ధిక పరిస్థితి మారాలి. ఎవ్వరూ కూడా తమ పిల్లలను చిన్నతనంలోనే పనిలోకి పంపడానికి ఇష్టపడరు. వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. పిల్లలు వాళ్ళకు ఒక పెట్టుబడి సాధనం. సహజంగా లేబర్‌లో 90% పైన మొగవాళ్ళు సంపాదించిన దానిలో ముప్పాతిక వంతు తాగుడుకే ఖర్చుపెడతారు. ఇక ఇంటిలో ఉన్న ఆడవాళ్ళూ, పిల్లలూ  కలిపి పనిచేస్తే కానీ వాళ్ళ కడుపులు నిండవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలను (మన ప్రభుత్వాల చిత్తశుద్ది మనకు తెలిసిందే)  తీసుకునివెళ్ళి ఏమి చేస్తారు? ఒక హాస్టల్ చేర్చడం, అంతే. మన గవర్నమెంట్ హాస్టల్లు ఎలా ఉంటున్నాయో మనకు తెలిసిందే. వాడు బయటకు వచ్చి, మళ్ళీ కూలివాడుగా ఉండవలసిందే. ఒకవేళ వాడు తెలివైన వాడయ్యి సొంతంగా చదువుకున్నా, వాడు కాంపిటీటివ్ ఎగ్జామ్‌ వ్రాస్తే, వాడు పోటీ పడేదెవరితో? కార్పోరేట్ కాలేజీలో చదివిన విద్యార్ధితో. అసలు మన వ్యవస్థే లోపాల పుట్ట. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పేవారు ఉండరు. వీళ్ళు ఇంటర్ చదివి ఇంజనీరింగ్‌, మెడికల్ ఎంట్రన్స్ వ్రాయాలంటే వాడు పోటీ పడవలసింది మళ్ళీ కార్పోరేట్ కాలేజీలో చదివినవాడితోనే. కొద్దిగా మనకున్న నాయకుల్లో,  జయలలిత ఒక్కావిడే, ఈ విషయంలో సరిగ్గా ఆలోచించింది అనిపిస్తుంది. ఆవిడ అక్కడ ఎగ్జామ్‌స్ లో రిజర్వేసన్ పెట్టింది. దానిని చాలా మంది తప్పు పట్టారు. మన దేశంలో ప్రభుత్వ తప్పుడు లెక్కల ప్రకారమే 30% పైన బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి (అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారికి) రిజర్వేసన్ కల్పించకపోతే వాడు ఇంటర్ దాకా చదివి ఉపయోగమేమిటి? అలా కాకుండా వాడు ఏ మెకానిక్ దగ్గరో పనిచేసుకుని ఉంటే, వాడు వయసు వచ్చేసరికి అందులో మెలకువలు నేర్చుకొని సంపాదనాపరుడౌతాడు.

నేనెప్పుడో 10 ఏళ్ళ క్రితం చదివిన ఒక కధ గుర్తుకవస్తోంది. చాలా బాగా రాసాడు. ఆ రచయిత ఎవరో, ఎందులో చదివానో కూడా గుర్తులేదు. MA సోషల్‌వర్క్ చదివిన విద్యార్ధి తన ఫైనల్ ఇయర్‌ ప్రాజక్ట్ వర్కులో భాగంగా జాలర్లుండే సముద్ర ప్రాంతానికి వెళతాడు. అక్కడ నాలుగు రోజులు పరిశీలించి, ఒక పల్లె అతన్ని నువ్వు రోజూ నీ కొడుకుని సముద్రంలోకి ఎందుకు తీసుకుని వెలుతున్నావు అని అడుగుతాడు. అంటే అతను నా కొడుక్కి చేపల వేట నేర్పటానికి అంటాడు. అలా వద్దు, అతన్ని స్కూల్‌కి పంపు, అక్కడ చదువుకుంటాడు అని ఈ వ్యక్తి అంటాడు. అప్పుడు, ఆ పల్లెతను చదువుకుని మా వాడు ఏమి చేస్తాడు అంటే, ఈ కుర్రవాడు హాయిగా ఉద్యోగం చేసుకుంటాడు అని అనగానే ఆ పల్లెతను బాబూ ఇంతకీ నువ్వేమి చేస్తున్నావు, నన్ను ఇన్ని ప్రశ్నలేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ కుర్రవాడు ఇది నా ప్రాజక్ట్ వర్క్, ఇది చేస్తే నాకు డిగ్రీ ఇస్తారు. అది తీసుకుని నేను ఉద్యోగంలో చేరుతాను అంటాడు. వెంటనే ఆ పల్లెతను నాయనా ఇప్పుడు నా కొడుకు చేస్తున్నది ఆ ప్రాజక్ట్ వర్కే. ఇది వాడు బాగా చేస్తే తరువాత వీడు సొంతంగా వేటకెల్లి వాడి సంపాదన వాడు సంపాదించుకుంటాడు అని చెప్పి కొడుకుని తీసుకుపోతాడు. నాకెందుకనో ఆ కధ చాలా బాగా నచ్చింది.

  నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముందు ప్రభుత్వ పాఠశాలలని సరిచెయ్యమనండి. చెప్పడానికి మాస్టార్లు ఉండరు, కూర్చోవడానికి బల్లలుండవు, వీళ్ళని స్కూల్లల్లో చేర్చి సాధించేదేమిటి? ఒక చిన్న ఉదాహరణ. మా ఫాదర్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఒక గర్ల్స్ పాలిటెక్నిక్ దగ్గరుండి కట్టీంచాకా ఒక బ్రాంచ్‌కి లెక్చరర్స్ లేరంట. ఆయన డైరక్టర్‌కి లెటర్ మీద లెటర్ పెట్టి పని అవ్వక చివరికి మినిస్టర్‌కి ఆ బ్రాంచ్‌ని అసలు ఆ కాలేజీలో తీసేసి అక్కడ ఉన్న అమ్మాయిలని స్టాఫ్ ఉన్న కాలేజీలకి పంపమని లెటర్ పెట్టారంట. అప్పుడు ఆ డైరక్టర్ మా ఫాదర్ మీద సీరియస్ అయితే, ఈయన కూడా సీరియస్ అయ్యి ఆడపిల్లలని మన దగ్గరకు చదువు చెప్పమని పంపిస్తే, మనం వాళ్ళకి చదువులు చెప్పకుండా ఖాళీగా హాస్టల్‌లో కూర్చోపెట్టి పంపుదామా, నీ దగ్గర స్టాఫ్ లేరని తెలిసి ఈ కాలేజీలో ఆ బ్రాంచ్ ఎలా పెట్టావు అని అడిగారంట. అదీ మన కాలేజీల పరిస్థితి.

ఇక్కడ బాల కార్మిక వ్యవస్థ రద్దుకంటే దానిని క్రమబద్దీకరించడం సరి అయిన పని అనిపిస్తోంది. ఎందుకంటే ఆర్ధిక పరిస్థితులు మారనంతవరకు దానిని రద్దు చెయ్యడం ఎవరి వల్లా కాదు. అంతకంటే పిల్లలు చేసే పనులు వర్గీకరించి వయసుల వారీగా వాళ్ళకు పనులు కేటాయించేటట్టు చూస్తే కొంతలో కొంత మెరుగు. నేను కొద్దికాలం క్రితం ఒక పెద్ద కంపెనీలో చిన్న వర్క్ చేసాను. అప్పుడు అక్కడ లేబర్ కేంప్‌లో చాలా మంది చిన్న పిల్లలను చూసాను. వెంటనే అక్కడ ఉన్న మా మేస్త్రీతో నేను నెలకు మూడు వేలు జీతం ఇస్తాను, ఇక్కడ ఎవరైనా చదువుకుని ఖాళీగా ఉన్న కుర్రవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడు, ఈ పిల్లలకు చదువుచెప్పడానికి అని చెప్పాను. అతను వెంటనే ఇవన్నీ మీకెందుకు సార్, ఇప్పటికే మునుగుతారో, తేలతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు, అంటే నేను ఏమయ్యా నాకొచ్చే నష్టంలో ఇదో లెక్క కాదులే అని చూడమని చెప్పి వచ్చేసాను. దురదృష్టవశాత్తు నా లేబర్ అడ్వాన్స్ పుచ్చుకున్నవాళ్ళు ఆ రాత్రే పారిపోవడంతో నేను ఇంక ఆ వర్క్ మానివేసాను. కాకపోతే నేను అక్కడ చూసినదానిని బట్టి మన ప్రభుత్వం అలా లేబర్ కేంప్‌లు ఉన్న చోట ఆ కాంట్రాక్టర్ ఖచ్చితంగా ఉచిత విద్య నేర్పే ఏర్పాటు చెయ్యాలి. ఎందుకంటే పెద్ద సైటుల్లో ఎంత తక్కువగా చూసినా 300మంది పైనే లేబర్ ఉంటారు. అక్కడ ఎలా లేదన్నా పాతిక మంది పైనే చిన్న పిల్లలుంటారు. వాళ్ళకి నాలుగు అక్షరం ముక్కలు వ్రాయడం, కొద్దిగా కూడికలూ, తీసివేతలు వచ్చేటన్ని లెక్కలూ నేర్పిస్తే చాలు. అది కూడా ఆ కాంట్రాక్టర్‌లు చేయరు.

ఇక మన LEO లు ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు మాకు ముందే కబురు తెలిసిపోతుంది. వెంటనే మా కాంట్రాక్టర్లు వర్క్ ఆపుచేసేస్తారు. మేము కూడా వాళ్ళకే వంత పాడతాము. మా దగ్గర కొద్దిగా మొహం ముదరగా ఉంటే చాలు వాడికి 18 ఏళ్ళు అని చెప్పమంటాము, లేదూ వాడు పొట్టోడు అని చెపుతాము. తప్పదు, వాడి పొట్ట నిండాలి కదా. కాకపోతే నేను మాత్రం వాళ్ళతో క్యూరింగ్ తప్పితే బరువు పనులు చెయ్యనిచ్చేవాడిని కాదు. ఎందుకంటే మా అమ్మ నేను ఉద్యోగంలో చేరేవరకు నాతో బకెట్ నీళ్ళు కూడా మొయ్యనిచ్చేది కాదు. ఒక సారి నా చేపల చెరువు దగ్గర నీటి కాకులని కొట్టడానికి ఒక కుర్రవాడిని నెలకు 700 ఇచ్చి పెట్టాను. కొన్ని రోజులు పోయాక మా ప్రెసిడెంట్ వచ్చి కుర్రవాడిని తీసేయమన్నాడు. సరే తీసేస్తాను, అంతే కాదు వాడికి పుస్తకాలు కూడా కొనిస్తాను, ఆరు నెలల తరువాత వాడికి నేనే పరీక్ష పెడతాను, వాడు సరిగ్గా రాయకపోతే నీకు పగులుద్ది అని చెప్పి పుస్తకాలు కొనిచ్చాను. సరిగ్గా నెల తరువాత వాడు వేరే రైతు దగ్గర మేతలు కడుతూ కనిపించాడు. వాడు మాత్రం ఏమి చేస్తాడు. బడిలో మాష్టారులుండరు.  

బాల కార్మికులను ఎటువంటి పనుల్లో పెట్టవచ్చో ప్రభుత్వమే నిర్ణయించాలి. హోటల్లో పనిచేసే పిల్లలను చూపించి ఆ ఓనర్లను బెదిరించడానికి తప్పితే ఈ చట్టం ఎందుకూ పనికి రాదు. ప్రమాదకరమైన పనుల్లో కొన్ని వేల మంది పిల్లలు పనిచేస్తున్నారు, వాళ్ళని రక్షించవలసిన అధికారుల కళ్ళు డబ్బుతో మూస్తుంటారు. సంపద అందరికీ పంపిణీ అయితే ఈ ప్రోబ్లం ఉండదు. అందులో ఇప్పుడు మన ప్రభుత్వం పెట్టిన ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీము అసలు వర్కర్‌లు దొరకని పరిస్థితి కలించింది. వాడు వెళ్ళి రెండు గంటలు పని చేస్తే చాలు వాడికి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇంక వాడు బయట పనికి ఎందుకు వస్తాడు? ఇంక పిల్లల మీద అధారపడవలసిందే. నేను కన్‌స్ట్రక్షన్ ఫీల్డులో ఉన్నాను. ఏ మేస్త్రీని కదిపినా లేబర్ లేరనే మాటే. ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. నేను బాల కార్మిక వ్యవస్థను సపోర్ట్ చేస్తున్నాననుకోవద్దు, కానీ మన వ్యవస్థ మారనంతవరకూ దీనిని మనం ఆపలేము.


Monday, March 14, 2011

నా నెచ్చెలి.















 

ఈ బుజ్జిముండని 2004 లో, అప్పటిదాకా నా దగ్గర ఉన్న పల్సర్ 150cc, మారుతీ 1000cc లు అమ్మేసి కొన్నాను. పాపం ఆ రోజు నుండీ ఈ రోజు దాకా నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, నన్ను చాలా క్షేమంగా నా గమ్యానికి చేరుస్తూనే ఉంది. షాద్‌నగర్ పొలాల్లో తిరిగినా, తిరుపతి ఏడుకొండలు ఎక్కినా, అరకు అందాలు చూడడానికి వెళ్ళినా, శ్రీశైలం, ఆత్మకూర్ ఘాట్ రోడ్‌ల్లో తిరిగినా, మంత్రాలయం, పుట్టపర్తిలు తిరిగినా, తుల్జాపూర్, అక్కల్‌కోట్, ఘాణుగాపూర్‌లు తిరిగినా ఆఖరికి విపరీతమైన డిప్రెషన్‌తో ఎక్కడో అక్కడ ఏక్సిడెంట్ అయ్యి చావకపోతానా అని (ఒక ఆత్మహత్యా ప్రయత్నం విఫలం అయ్యి రెండో సారి చేసుకునే దైర్యంలేక) అర్ధరాత్రి హైదారాబాద్‌లో బయలుదేరి వైజాగ్ ప్రయాణమైనా, నా కోరిక తీరకుండా నా గమ్యస్థానానికి నన్ను చేరుస్తూనే ఉంది. ఏరోజూ నన్ను దారిలో ఇబ్బంది పెట్టలేదు. ఇండియన్స్‌ని సెంటిమెంటల్ ఫూల్స్ అని విదేశీయులు వేళాకోలం చేస్తారు. కానీ వాళ్ళకేమి తెలుసు, మనల్ని ప్రాణం లేని వస్తువులు కూడా కాపాడతాయని.

నేను ఇప్పటిదాకా Luna, Bajaj Chetak, Kawasaki RTZ, Calibar, Hero Honda SS, Pulsar 150cc, Maruti 1000cc లు వాడినా, నా మదిని దోచినవి మాత్రం Kawasaki, ఇప్పుడు నా దగ్గర ఉన్న Yamaha Crux లు మాత్రమే. ఇది కొనడం కూడా మా కజిన్ చెప్పేడని కొన్నాను. లేకపోతే మళ్ళీ బజాజ్ వాళ్ళదే ఏదో ఒకటి కొనేవాడిని. వాడిని ఇప్పటికీ తిడుతూ, నువ్వు జీవితంలో చేసిన ఒకే ఒక్క మంచిపని నన్ను ఈ బండి కొనమనడంరా అంటుంటాను.

దీనిని నేను సరిగ్గా వాడడం మొదలుపెట్టింది  2008 జనవరి 17 నుండే. ఆ రోజు ఎక్కడో అక్కడ ఏక్సిడెంట్‌లో చచ్చిపోవాలని రాత్రి 11.00కి హైదరాబాద్‌లో వైజాగ్ వెళ్ళడానికి బయలుదేరాను. అప్పటినుండీ ఇది నా ప్రియనేస్తం అయ్యిపోయింది.దీనిమీద అరకు అందాలు చూసాను, శ్రీశైలం, మహానంది, తిరుపతి, కాళహస్తి, కాణిపాకం, పుట్టపర్తి, మంత్రాలయం, తుల్జాపూర్, అక్కల్‌కోట్, ఘాణుగాపూర్ లాంటి పుణ్యక్షేత్రాలు తిరిగాను. ఏరోజూ ఎక్కడా ఆగడం అనేది జరుగలేదు. ఈ జనవరిలో ఇది అమ్మేసి Apachi కొందామనుకొని, దీనిని అమ్మబుద్ది కాక Apachi కొనడం ఆపేసాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో రెండు బళ్ళు వాడడం కష్టం. ఇదివరకు ఐతే వాడినా వాడకపోయినా నా Kawasaki ని అమ్మకుండా అలాగే ఉంచేసాను. చివరికి ఆస్థితోపాటు అది కూడా అమ్మేసాను. ఎందుకంటే నాది అనుకొనే ఏ వస్తువుకూడా నా దగ్గర ఉంచుకోదలచుకోక దానిని షాద్‌నగర్‌లో అమ్మేసాను. ఇక ఇప్పుడు దీనిని అమ్మే ఆలోచన లేదు. నేను వేరే ఊరు ఏదైనా పనిమీద ఎక్కువ కాలం వెళ్ళవలసి వస్తే, రాగానే ముందు నేను దీనిని తనివితీరా చూసుకొనిగానీ పైకి వెళ్ళను. ఇది నా మీద అంత ప్రభావం చూపించింది.

Saturday, March 12, 2011

ఇది ఎవడబ్బ సొత్తు?

అసలు మన రాజకీయనాయకులు ఏమి అనుకుంటున్నారో అర్ధం కావడంలేదు. ఎవరి సొమ్ము, ఎవరు దానం చేస్తున్నారు? ఇప్పుడే కనుక శ్రీ శ్రీ బ్రతికుంటే, కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిల్లా కాదేదీ కవిత కనర్హం అని కాకుండా అడవి చెక్కా, కొండ గుట్టా, సాగరతీరం కాదేదీ సెజ్‌ కనర్హం అని వ్రాసేవారేమో? 10 సంవత్సరాల క్రితం అడ్రస్ అంటూ లేని వాళ్ళు, ఈ రోజు బిజినెస్ మాగ్నట్‌లు. ఎవడైనా ఇండస్ట్రీ పెడతానంటే పాపం, వాడి వెనకాల మా రాష్ట్రంలో పెట్టు, మా రాష్ట్రంలో పెట్టు అని పరిగెడుతున్నారు. వాళ్ళకు ఇచ్చే సబ్సిడీలు చూస్తుంటే, వాడి కంపెనీలో ప్రొడక్షన్ లేకపోయినా పరవాలేదు అనిపిస్తోంది. సాగరతీరం..సంద్యాసమయం అనే పాటకి ఇప్పుడు రక్తమయం అని కలుపుకుని పాడుకునే రోజులు వచ్చాయి

అందులో మన రాష్ట్ర పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సరే ఇవన్నీ నడిస్తే, ఒక 50 సంవత్సరాల పాటు కొంతమందికైనా ఉద్యోగాలు వస్తాయి అనుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళకి కారుచవగ్గా స్థలాలు ఇవ్వడం ఏమిటో అర్ధం కావడంలేదు. పోనీ వాడేమైనా సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు అమ్ముతాడా అంటే, అన్నీ కూడా చదరపు అడుగు 2500-4000 వరకు విలువచేసేవే. అంటే డబ్బున్న వాడికి డబ్బున్నవాడు కట్టి అమ్ముకోవడానికి, ప్రజల ఆస్తులు ధారపోస్తున్నారన్నమాట.

మొన్న జరిగిన మిలియన్ మార్చ్‌లో, ఎటువంటి రాజకీయప్రమేయంలేని మహానుభావుల విగ్రహాలు ధ్వంసం చేసేబదులు, ప్రజల ఆస్తులని సెజ్‌ల పేరు చెప్పి కొల్లగొడుతున్నవాళ్ళ కొంపలు కూలగొట్టి ఉంటే, మిగిలిన అసహాయులకి మార్గదర్శకులుగా మిగిలిపోయేవారు. వీరికి దేశమంతా జోహార్లు చెప్పేది. సి.బి.ఐ. కూడా ఆశ్చర్యపోయే రీతిలో మన రాష్ట్రంలో అవినీతి జరుగుతుంటే మనమేమో తెలంగాణా అని, సమైక్యాంధ్రా అని కొట్టుకు చస్తున్నాము. నిజంగా తెలంగాణా కావాలనుకొనే వాళ్ళు ముందు సెజ్‌లని నాశనం చెయ్యాలి. దేనికి ఎంత అవసరమో అంత భూమి మాత్రమే ఉంచి, మిగిలిన భూమి ప్రజలు స్వాధీనం చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం పిల్లలని రెచ్చగొడుతున్న ఈ నాయకులు, రేపు తెలంగాణా వచ్చాకా వాటాలు తీసుకొని ఆ సెజ్‌ల జోలికి వెళ్ళరు. ఈ రాజకీయ రాబందులు ఆంధ్రాలో అయినా, తెలంగాణాలో అయినా ఒకటే జాతి. వీళ్ళని ఇరగదీస్తే కానీ సామాన్యుడి ఆస్తులకి రక్షణ ఉండదు.

పాపం నా స్నేహితుడు గంజివరపు శ్రీనివాస్ పెళ్ళాం, పిల్లలని వదిలేసి అడవి బిడ్డల కోసమని చెట్టూ, పుట్టా కాగితాలు, కెమెరాలు పట్టుకుని తిరుగుతున్నారు. వాటి వలన ఎంతవరకు ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు కానీ, అవి కాకుండా వాళ్ళకి తుపాకులు ఎలా కాల్చాలో చెపితే వెంటనే ఉపయోగం కనిపిస్తుంది. ప్రతి ఊరు, ప్రతి అడవి ఒక సోంపేట, ఒక కాకరాపల్లి, ఒక సింగూరు అవ్వవలసిందే. ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉండవలసింది కారం డబ్బాలు కాదు, చేతి బాంబులు, గండ్ర గొడ్డల్లు.

జపానులో సునామీ, మరో 12 దేశాల్లో ప్రమాదహెచ్చరికలు. ఒక ప్రక్క అడవులు నరుక్కుంటూ వెళుతూ మనల్ని మనమే చంపేసుకుంటున్నాము. ఇప్పుడు, ఆ నష్టాన్ని సరిచెయ్యడానికి, కొన్ని లక్షల కోట్ల డాలర్లు కాంట్రాక్టర్‌ల చేతిలో పెట్టాలి. సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడిన కాకినాడ హోప్ ఐలండ్‌ని ఇప్పుడు ఒక వ్యాపారవేత్త చేతిలో పెట్టారు. రేపు ఉప్పెన వస్తే కాకినాడ పరిస్థితి ఏమిటి?

యుగాంతానికి ఆకాశంలో జరిగే మార్పులేమిటో, వాటి వలన ఎంతవరకూ నష్టముందో తెలియదు కానీ, ప్రకృతిని నాశనం చేసి, మనం భూమి మీదే ఆ పరిస్థితులు సృష్టిస్తున్నాం.

Tuesday, February 1, 2011

అవినీతి మీద పోరాటం ప్రారంబింఛేది ఎవరు?

ఖచ్చితంగా, చదువున్న వాళ్ళం మాత్రం కాదు. ఎందుకంటే మనమందరము ఆ తానులో ముక్కలమే.  మద్యపాన నిషేదం గురించి గోదావరిఖనిలో నక్సలైట్‌లు, దూబకుంటలో మహిళలు పోరాటం మొదలుపెట్టినట్టు అలాంటి వాళ్ళే మొదలుపెట్టాలి.

మనం అవినీతి మీద పోరాటం ఎలాగూ చెయ్యలేము, కనీసం నిజాయితీగా పనిచేసేవారికి అండగా కూడ నిలబడము. 1996 లో అనుకుంటాను, ఒకే నెలలో హైదరాబాద్‌లో, అప్పట్లో నిజాయితీగా ఉన్న ముగ్గురు IAS ఆఫీసర్లను ఒకే నెలలో, చంద్రబాబు నాయిడు ట్రాన్స్‌ఫర్ చేస్తే, పాపం శర్మగారు అనుకుంటాను, ఆయన గురించి మాత్రం ఫిల్మ్‌నగర్ గుడిసెవాసులు కొద్దిగా పోరాటం చేసి, వాళ్ళ వల్ల కాక విరమించుకున్నారు. అమృతా కాజిల్ మీద యాక్షన్ తీసుకోబొయిన శ్రీమతి. సుజాతారావుకి గానీ, కారణం సరిగ్గా గుర్తులేదు శ్రీ. బ్రహ్మ గారికి కానీ ఆ మాత్రం సపోర్ట్ కూడా దొరకలేదు. (అప్పట్లో అని ఎందుకన్నానంటే, వాళ్ళు నిజాయితీగా ఇప్పటికీ ఉంటే, వాళ్ళ ట్రాన్స్‌ఫర్స్ గురించి రోజూ చదువుతూనే ఉండేవాల్లము) ముగ్గురూ నిజాయితీగా పనిచేసినందుకు వాళ్ళకు దొరికిన బహుమానం అది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకనో 1998 లో నిజాయితీగా వున్న సుబ్రమణ్యం అనే IFS ఆఫీసర్‌ని మాత్రం, ఎన్ని ఒత్తిల్లు వచ్చినా బదిలీ చెయ్యకుండా ఆపుచేసి, కొల్లేరు చెరువు ఆక్రమణల బారిన పడకుండా కాపాడేడు. ఆయన వలన, అప్పట్లో చెరువులు తవ్వలేక నష్టపోయిన వాళ్ళల్లో నేను ఒకడిని. నిజంగా ఆయన ఒక్కడి వలన, సుమారు రెండున్నర సంవత్సరాల పాటు కొల్లేరులో, చెరువుల తవ్వకం ఆగిపోయింది. ఆయన్ను బదిలీ చేయించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేవీ పనిచెయ్యలేదు. నేను పర్సనల్‌గా నష్టపోయి వుండవచ్చు, కానీ ఆయన నిజాయితీకి మాత్రం చాలా ఆనందించేవాడిని. ఒక్కడ్నీ, ఏమి చెయ్యగలనులే అనుకొనే నాకులాంటి వాళ్ళకి, జయప్రకాష్‌ నారాయణ, గద్దర్ లాంటి వాళ్ళకి ఆయన, పూనం మాలకొండయ్య లాంటి వాల్లు చేసి చూపించారు.

ఇక్కడ, గద్దర్ ప్రస్తావన ఎందుకంటే, నాకు ఎప్పుడో చదివిన గుర్తు, ఆయన్ని ఒక విలేఖరి మీరు ఇంజనీరింగ్ ఎందుకు మానేసారు అంటే ఇసుకలో సిమెంట్ కలపించలేక అని సమాదానం చెప్పారు. ఆయన సివిల్ ఇంజనీరింగ్ చదువుతో మానేసాడంట. తుపాకీ పట్టుకోవడానికి ఉన్న దైర్యం ఉద్యోగం చేయడానికి లేదన్నమాట. ఈ మాటలన్నీ భాద్యత నుండి పారిపోయే మనస్తత్వాన్ని చూపిస్తాయి. అధికారం ఉండి, ఏమీ చెయ్యలేని వాళ్ళకు వ్యవస్థని నిందించే అర్హత లేదు అనుకుంటున్నాను. ఈరోజు మనం ఈ మాత్రమన్నా ఉన్నామంటే, కొద్దిమందైనా నిజాయితీపరులు వుండబట్టే. కానీ కనీస భాద్యతగా మనం వాల్ల వెనకాల నిడబడనందుకే, అవినీతి అరోపణలున్నా సిగ్గూ, ఎగ్గూ లేకుండా థామస్ లాంటి వాల్లు CVC లు, నవీన్ చావ్లా లాంటి వాల్లు CEC లు అవుతున్నారు. కానీ ఈ నిజాయితీపరులకు కూడా, కొద్ది కాలానికి నిర్వేదం వచ్చేస్తుంది. ఈ రోజు శ్రీమతి. పూనం మాలకొండయ్య ఎక్కడ వున్నారో కూడా తెలియడం లేదు. ఎవరి గురించి అయితే వాళ్ళు కష్టపడుతున్నారో, వాళ్ళే వాల్ల వెనుక నిలబడకపోతే, వాళ్ళు మాత్రం ఎన్నిసార్లు ట్రాన్స్‌ఫర్‌ల మీద ఊరూరూ తిరగగలరు. సింగరేణి ఎం.డిగా చేసి కోల్ మినిష్ట్రీకి వెల్లిపోయిన శ్రీ. మహాపాత్రో ఇంటి పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నప్పుడు? (అలా అని కేస్ క్లోజ్ చేసారు, ఆయన అంత పిరికివాడు కాదు), అదే సమయంలో, మారుతి ఎం.డి. భాస్కరుడి కారుని, నెంబర్ ప్లేట్ లేని లారీ గుద్ది వెల్లిపోయినప్పుడు(అప్పుడు మారుతీకి, సుజుకీ కి గొడవలు నడుస్తున్నాయి) దాని మీద ఎటువంటి ఎంక్వరీ జరగకుండా అడ్డుకున్నదెవరో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. జర్నలిస్ట్‌లు కూడా వ్రాయలేదు. అంటే వీళ్ళని కూడా కొనేసివుంటారా?


ఈ రోజు ఏ పోరాటం చెయ్యాలన్నా నిరక్షరాశ్యులు చెయ్యాలితప్పితే, చదుకున్నవాళ్ళు మాత్రం చేయడం లేదు. మరీ ఎక్కువ ఆలోచించేవాళ్ళు ఇక్కడ పోరాడలేమనే భయంతో తుపాకులు పట్టుకొని అడవుల్లోకి పారిపోతున్నారు. ప్రజల గురించి ఆలోచించేవాల్లు వుంటే కష్టమని ఛిఛీదంబరం, మన్ మోషం సింగులు వాళ్ళ వెనకాలపడి చంపేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే 47 సంవత్సరాల వయసువున్న నాకే నక్సలైట్‌గా మారిపోదామని అనిపిస్తోంది.

కానీ ఈ రోజు అన్ని సమస్యలకు కారణం అవినీతేనని, అది పోతే, ప్రాంతాలకతీతంగా దేశం మొత్తం బాగుపడుతుందని తెలిసినా, యువత రాజకీయనాయకుల కుతంత్రాలకు లొంగిపోయి, మన రాష్ట్రవిషయానికి వస్తే తెలంగాణా అని, సమైకాంద్రా అని వ్యర్ద పోరాటాలలో మునిపోయారు. ఇక్కడ రాజకీయనాయకులని ఈరోజు దాకా ఒరేయ్ కొడకల్లారా, మాట్లాడితే ఆంధ్రావాళ్ళు గత 60 సంవత్సరాల నుండి దొచేస్తున్నారు అని అంటున్నారు, మీరు అక్కడ ఉండి, ఎవరి చంకలు నాకుతున్నారు అని అడగలేదు. ఈ రోజు KCR పిచ్చి పట్టినట్టు వాగుతుంటే ఒరేయ్, పిచ్చి నా.....కా ఇలా వాగితే, ప్రేమకు ప్రతిరూపాలైన తెలంగాణా ప్రజలు, నీ మొహం మీద ....పోస్తారురా అనేవాళ్ళు కనిపించడంలేదు. ఎందుకంటే ఈ తెలంగాణా ప్రేమను 1983 నుండి పొంది, వీర తెలంగాణా అభిమానిగా మారిన నేను, అతని భాషని చూసి, ఈ రోజు మిగిలిన దేశమంతా నా తెలంగాణా ప్రజల్ని ఎక్కడ అసహ్యించుకుంటుందో అని బాధపడుతున్నాను. చదువు చెప్పే వృత్తిలో వున్న ప్రొ. కోదండరామ్ సంస్కారం ఎక్కడకు పోయింది?  


ఈ పరిస్థితుల్లో ఎవరు నిజాయితీగా ఉంటారు? ఉండమనే హక్కు మనకెక్కడ ఉంది?

Monday, January 31, 2011

నేనూ, నా హిందూ మతం - 3

                  ప్రతీ హిందువూ కీ.శే. శ్రీ. పి.వి. నరసింహరావు గారికి ఋణపడి ఉన్నారు.

హిందువంత విశ్వాసఘాతకుడు ఎవరూ ఉండరేమో. ఎందుకంటే, మసీదు కూల్చివేతకు కారణం కీ.శే. శ్రీ. పి.వి.నరసింహారావు గారేనని చాలా మంది నమ్మకం. అటువంటి వ్యక్తి (సోనియాకు భయపడి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు) వర్ధంతి సందర్భంగా, హిందువు గురించే వున్నాము అని చెప్పుకొనే బి.జే.పి. వాళ్ళు, కనీసం గుర్తుకుతెచ్చుకోలేదు. ఆయన ప్రమేయం కూల్చివేతలో లేకపోయినప్పటికీ, ఆ నింద ఆయన మీద పడినందుకు, గత 400 సంవత్సరాలుగా కానిది, ఆయన హయాంలో అయినందుకు అయినా, వీళ్ళు ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవలసిన అవసరముంది కదా. పాపం, ఆయన భౌతికకాయానికి జరిగిన అవమానానికి కారణం, ఆయన మసీదు కూల్చివేతకు కారకుడవ్వడమేనని, ఆయనకే కాదు, దానికి కారకులయినవారందరికి ఇలాగే అవుతుందని మా ఫ్రెండ్ నాతో అనేవాడు. అప్పుడు నేను వాడితో, ఒరేయ్, అలా అయితే మీరందరూ ఆయన కాళ్ళకు దన్నాలు పెట్టాలి అన్నాను. వాడికి అర్ధం కాలేదు. ఎందుకురా అన్నాడు. ఒరే, ఒక్క మసీదు కూలగొడుతుంటే, ఏమీ చెయ్యనందుకే పాపం ఆయనకు ఇలా అయితే, కొన్నివేల దేవాలయాలు కూలగొట్టినందుకు, పాపం మీ బాబర్ ఆత్మ ఇంకెంత క్షోభ పడుతూ ఉండి ఉంటుందో, దానికి ఈయన వలన చివరికి మోక్షం దొరికివుంటుంది కాబట్టిరా అన్నాను. ఆ రోజు, పి.వి. గారిని ప్రక్కనపెట్టండి, ఒకవేళ అద్వానీ, వాజ్‌పాయ్‌లే గనుక అడ్డుకునుంటే, కరసేవకులు వాళ్ళని చంపేసుందురు అంట. అక్కడ వాళ్ళ ఉద్రేకం అలా ఉందంట. ఇది ఒక్క అద్వానీయో, జోషీయో చెపితే జరిగినది కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా హిందూ గుండెల్లో అణగద్రొక్కుకుంటూ వస్తున్న అవమాన భారం వీళ్ళ వలన బయటకువచ్చిందంతే.

జనవరి 26 న లాల్ చౌక్‌లో, జాతీయపతాకం ఎగురవెయ్యాలని బి.జె.పి. ఎప్పటినుండో ప్రయత్నిస్తోంది కదా. దాని మీద చాలా మంది ముస్లింమేధావులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు కదా. బి.జె.పి ని ప్రక్కనపెట్టి, వీళ్ళే వెల్లి ఎగురవెయ్యవచ్చుకదా? అక్కడ ఉన్నది వీళ్ళ సోదరులే కదా. చెయ్యరు. నాకు ఎప్పటికీ అర్ధంకాని చిక్కుముడి ఒకటి ఉంది. అదేమిటంటే ప్రపంచంలో ఎక్కడవున్న హిందువైనా సరే భారతదేశం వంకే చూస్తాడు, ఎందుకంటే అతని మతానికి సంబందించిన మూలాలు ఇక్కడే వున్నాయి కనుక. అలాగే భారతదేశపు ముస్లిం సోదరులు మిడిల్ ఈస్ట్ వైపు చూస్తే అర్ధం ఉంది, వీళ్ళ మూలాలు అక్కడ ఉన్నాయి కనుక. కానీ వీళ్ళకు పాకిస్థాన్ మీద ప్రేమ ఎందుకో నాకు అర్ధం కాదు. బి.జె.పి లో ముస్లిం లీడర్ ఎవరైనా ఉంటే అతను షియానా, సున్నీనా అని అడుగుతారు. వీళ్ళకి దేశం మీద భాద్యత లేదా? కాశ్మీరు గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు. ఒకసారి షబానాఅజ్మీ తను మత వివక్షకు గురిఅయ్యానని మాట్లాడింది. రూపాయిని అర్దరూపాయికి అడిగితే ఎవడూ ఇవ్వడు. పోనీ తను తక్కువ ఇస్తే నటిస్తుందా? ఆవిడా, ఆవిడ భర్తా మేము మేధావులమి, సెక్యులరిస్ట్‌లమి అంటారు కదా వాళ్ళు కాశ్మీర్ వెళ్ళి మాట్లాడవచ్చుకదా. బి.జె.పి. వాళ్ళు వెలుతుంటే కొంతమంది వీళ్ళు అక్కడకు వెల్లాకా వీళ్ళ మీదకు సెపరేటిస్ట్ లను వదిలితే బాగుంటుంది అంటారు. అంటే, వేరే దేశం వాడు నీ దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంటే నీకు బాధగా లేదా? వీళ్ళకు ఆ దేశం మీద ప్రేమ ఉంటే అక్కడకే వెళ్ళిపోవచ్చు కదా? వెళ్ళరు. ఎందుకంటే, ఒక్క ఈ దేశంలో మాత్రమే ఎవరైనా సరే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతకవచ్చు. వాళ్ళకి వాళ్ళ పెర్సనల్ లా ప్రకారం నడవాలి, అది కూడా సివిల్ లా మాత్రమే, క్రిమినల్‌లా మళ్ళీ ఈ దేశానిదే కావాలి. అలా ఎందుకు? ఖురాన్ ప్రకారం ముస్లిం దొంగతనం చేస్తే చెయ్యి తీసేయడం, వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపండం చేయించుకోవచ్చు కదా, అప్పుడు ఎవరూ తప్పు పట్టరు. అది కుదరదు. ఒక్క భారతదేశ ప్రజాస్వామ్యంలో మాత్రమే ఈ వింత.

అసలు, మన నాయకులకి వీళ్ళంటే ఎంత భయమంటే, ఇజ్రాయిల్ ప్రక్కనున్న అరబ్ దేశాలు, ఏనాడో ఆ దేశంతో దౌత్యసంబందాలు పెట్టుకుంటే మన దేశానికి మాత్రం శ్రీ. పి.వి గారు వచ్చేదాకా దైర్యం చాల లేదు. అప్పుడు కూడా, దేశవ్యాప్తంగా జరిగిన గోల అందరము చూసాము కదా. ఇజ్రాయిల్ దాకా ఎందుకు, సంస్కృతంలో దూరదర్శన్‌లో వార్తలు పెట్టే దైర్యం కూడా లేదు.  ఇది అంతా మహానుభావుడు ఆ పి.వి గారి పుణ్యమే. హిందూ పార్టీ అని చెప్పుకొనే  బి.జె.పి. ఎట్టి పరిస్థితుల్లోను ఇవన్నీ చేసేదికాదు. అంటే ఈ దేశ బాహ్య, అంతర్గ్‌త విషయాలని వీళ్ళు ఎంత ప్రభావితం చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకోవాలి.

ఈ దేశంలో పార్శీలు, బౌద్దులు, సిక్కులు, జైనులు ఆఖరికి చైనా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన చైనీయులు అంతఃర్భాగంలా కలసిపోతుంటే వీళ్ళు ఎందుకు కలవలేకపోతున్నారు? మొన్నా మద్యన వచ్చిన సచార్ కమిటీ రిపోర్ట్ చూడండి. వీళ్ళ వెనుకబాటుతనానికి ఎవరు కారణం? బీదరికం, చదువులేకపోవడం జనాభా పెరుగుదలకు ఒక ముఖ్య కారణం. బీదవాళ్ళకి పిల్లలు ఒక పెట్టుబడి సాధనం, అది హిందువు అయినా, ముస్లిం అయినా. పైగా వీళ్ళకి మత భావనలు నూరిపోసే మేధావులు ఉండనే ఉన్నారు. చెప్పేవాల్లు మాత్రం ఇద్దరితోనే ఆపేస్తారు.

1986-87 ల్లో అనుకుంటాను, ఒకసారి, మా జే.ఇ. నాతో, ఇంకో ఇరవై సంవత్సరాలలో ఇండియా ముస్లిం రాజ్యం అయిపోతుంది అన్నారు. వెంటనే నేను, అదే గనుకు జరిగితే మీతో మొదలుపెట్టి వంద మందిని చంపి నేను చస్తా అన్నాను. దానికి ఆయన రామరాజు, నువ్వు కోపం తెచ్చుకోకుండా ఆలోచించు మాలో ఆపరేషన్ చేయించుకుంటానికి మా లా ఒప్పుకోదు, అందుకనే నేను అలా అన్నాను అన్నారు. సార్, మీరు ముగ్గురితో ఆపేసారు కదా, అలాగే మిగిలిన వాళ్ళు కూడా కొద్దికాలానికి తెలుసుకుంటారు, ఎందుకంటే, పిల్లల్ని ఇచ్చేది దేముడైనా పోషిందేది మాత్రం మనమే కదా అన్నాను. అంతకు ముందు షాబానో కేస్ అప్పుడు కూడా ఆయన అలాగే అన్నారు. నేను ఆయన్ను, సార్ ఇక్కడ మతాన్ని ప్రక్కన పెట్టి మనషి లా అలోచించండి, ఆ వయసులో ఆవిడని పోషించవలసిన బాద్యత, భర్త మీద లేదా అని అడిగితే, ఆయన నువ్వు అన్నది నిజమే, కాదనను, కానీ మేము ఇప్పుడు దీనికి ఒప్పుకుంటే తరువాత మీరు, మమ్మలని మా శవాలు కప్పెట్టకూడదు, కాల్చండి అంటారు అన్నారు. నేను, సార్ మీరు పదిమందికి చెప్పవలసిన వాళ్ళు, మీరే ఇలా అంటే ఇంకేమి మాట్లాడతాము అన్నాను. 

నేను, మొన్న ఒక పెద్దాయన్ని కలిసాను. ఆయన, నాకు నమాజ్‌కి టైం అయ్యింది ముందు అక్కడకు వెళ్ళి వద్దాము అన్నారు. ఇద్దరం కలసి మసీదుకు వెల్లాము. నేను బయట నిలబడ్డాను. ఆయన నమాజ్ అయ్యాక, ఇద్దరం మళ్ళి బండి మీద వస్తుంటే, నేను, మీరు ప్రార్దనలో ఏమి చదువుతారు, దేముడ్ని పొగుడుతారా, లేక మాకులాగా వర్ణన తో కలిపి పొగుడుతారా అంటే, ఆయన మేము దేముడికి రూపం లేదనుకుంటాము కాబట్టి వర్ణన ఉండదు, ఇది మా పద్దతి అన్నారు. అంతే తప్పితే, మీరు చేసేది తప్పు అనలేదు. అది సంస్కారమంటే. నిజమైన ముస్లిం, హిందువు, క్రిష్టియన్ ఇంకెవరైనా సరే, నిజంగా వాళ్ళు దేముడిని నమ్మేటట్టైతే ఎప్పుడూ వేరే వాళ్ళ దేముల్లని కామెంట్ చెయ్యరు.

తెలంగణాకు హైదరాబాద్‌లో వున్న కొంతమంది ముస్లింలు వ్యతిరేకమంటున్నారు. ఎందుకు? ఇక్కడ ప్రతి వినాయకచవితికి, ఏమౌతుందో అని భయపడేది హిందువు కదా, మరి వీళ్ళు ఎందుకు వద్దంటున్నారు? హిందువు అన్నవాడు ఎక్కడున్నా సెక్యులరే. అది అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా. అందులో ఎవరూ ఎటువంటీ అనుమానాలు పెట్టుకోవక్కరలేదు. కాకపోతే ఇదివరకిటిలాగా ఇప్పుడు ఎవరు ఏమి చేసినా ఊరుకొనేపరిస్థితి మాత్రం కనిపించడంలేదు. అనవసరంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు హిందువుని రెచ్చగొడుతున్నారు. మొన్న దిగ్విజయ్ సింగ్, నిన్న వీరప్పమొయిలీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. వీరప్పమొయిలీ దృష్టిలో RSS,BJP వాళ్ళ ప్రమేయముందని నిర్ధారన చేస్తేనే ఆ కమిటీ మాట నిజం, లేకపోతే అది అబద్దం. ఇటువంటి వాగుల్లు వాగే, వాళ్ళు గొడవలు జరిగేటట్టు చేస్తున్నారు. ఒక విధంగా అది హిందువుకి మేలు చేస్తున్నట్టే లెక్క. లేకపోతే హిందువులు కొంతమందైనా ఎప్పటికి ఏకమవ్వరు.

ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా పదిమందితో కలసి నడిచినంతకాలం ఏ గొడవలు ఉండవు. కాదు నాకు ప్రత్యేక గుర్తింపు కావాలి అన్నప్పుడే గొడవలు మొదలౌతాయి. క్రితం సంవత్సరం నేను టిఫిన్ చేద్దామని ఒక హోటల్‌కి వెళ్ళాను. అక్కడ, ఒక కుర్రవాడి ముందు ఈనాడు పేపర్ ఉంది, నేను అతన్ని పేపర్ అడిగితే, ఆ అబ్బాయి హిందీలో నాకు తెలుగు రాదు అన్నాడు. మీది ఏ స్టేట్ అని అడిగాను,  ఆ అబ్బాయి హైదరాబాదే అన్నాడు. అదేమిటి, ఇక్కడ వాడివి తెలుగు రాకపోవడమేమిటి అని అడిగితే, ఆ కుర్రవాడు నేను ముస్లిం‌ని అన్నాడు. ఏమి చదివావు అని అడిగితే డిగ్రీ అన్నాడు. నేను ఆ అబ్బాయితో, బాబూ నువ్వు బ్యాంక్ ఎగ్జామ్ రాసి, నీకు మా కాకినాడలో ఉద్యోగం వచ్చిందనుకో, అక్కడ హిందీ మాట్లాడరు అప్పుడు ఏమి చేస్తావు, పైగా ఇది ఈ రాష్ట్ర భాష, నువ్వు IAS, IPS, Group 1 వ్రాసినా, ఇక్కడ ఉద్యోగం చెయ్యాలంటే లోకల్ భాష నేర్చుకోవాలి, భాషకి, మతానికి సంబందం లేదు అని చెప్పేసరికి, నిజమే అంకుల్, కాకపోతే మా దగ్గర తెలుగు మాట్లాడేవాల్లు లేకపోయేసరికి అది సరిగ్గా రాలేదు, ఈ మద్యనే మాట్లాడడం నేర్చుకుందామనుకుంటున్నాను అన్నాడు. మనం పిల్లల్లో కూడా ఇలాంటి భావజాలం నింపితే ఎలా?

ప్రతి మనిషీ, ఖచ్చితంగా తన మతాన్ని పాటించవలసిందే, అందులో ఎటువంటి మినహాయింపులు లేవు, కానీ ప్రక్క మతాన్ని కూడా గౌరవించవలసిందే. లేక పోతే ఇప్పుడు జరుగుతున్నట్టే గొడవలు ఎప్పటికీ జరుతూనేవుంటాయి. ఇంకా ఎక్కువగా. ఎందుకంటే, కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ మతం ఎప్పుడూ లేనిది, ఇప్పుడు తిరగబడడం నేర్చుకుంటోంది. ఇది ప్రస్తుతానికి కొద్దిగానే వుండవచ్చు, కానీ, పరిస్థితులు ఇలాగే ఉంటే, ఊచకోత కోయించుకోవడానికి అలవాటు పడిన హిందువు, ఊచకోతకోయడానికి సిద్దపడే స్థితికి వచ్చేసాడు. దయచేసి ఎవరు గొడవ చేసినా ఖండించండి. ఇందులో మత ప్రమేయాన్ని పెట్టకండి. ఈ దేశం మన అందరిదీ. మతభక్తి దేశ‌భక్తిని మింగకుండా చూడండి.

Friday, January 28, 2011

నేనూ, నా హిందూ మతం - 2

నేను హైదరాబాదు వచ్చినవెంటనే నాంపల్లి మసీదు కి వెళ్ళాను. ఇప్పటికీ, అప్పుడప్పుడు అత్తాపూర్ దర్గాకి వెళుతుంటాను. మా అమ్మమ్మగారి ఊరు వెళ్ళేటప్పుడు, యానాం లో ఉన్న చర్చికి వెళతాను. ఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే చెట్టూ,పుట్టల్లో కూడా దైవాన్ని చూసే మేము దేవుళ్ళందరూ ఒకటే అని నమ్ముతాము. ఇక్కడ నా వ్యతిరేకత మభ్యపెట్టడం మీద, మా మతాన్ని కించపరచడం మీద.

నేను, జిల్లాపరిషత్ జాబ్ చేసేటప్పుడు ఒక వార్డ్ మెంబర్ కలిసాడు. చాలా మంచివాడు. NREP ప్రోగ్రాం కింద వాళ్ళ ఊరిలో కాలనీ కట్టిస్తున్నాము. దానికి అతను వార్డ్ మెంబర్. ఒకరోజు మాటల్లో అతనిని కన్న తల్లి లాంటి మతాన్ని ఎలా వదలగలిగావు అని అడిగితే, అతను అతని చిన్నప్పుడు వాళ్ళ నాన్నకి జరిగిన అవమానం గురించి చెప్పి, మీరైతే ఏమి చేస్తారు అని అడిగాడు. అతను చెప్పింది విని నాకు చాలా భాద అనిపించింది. నువ్వు చెప్పింది నిజమే, కానీ మతం మారడంవలన, వాళ్ళు నిన్ను గౌరవించారా అని అడిగా. లేదన్నాడు. అంటే నువ్వు వాళ్ళ మీద తిరగబడకుండా పారిపోయావు. దాని వలన నీకు జరిగిన అవమానం అలాగే వుంది కదా అన్నాను. పోనీ, ఈ రోజు అన్ని కులాలనుండి మతం మారుతున్నారు కదా, నీ పిల్లల్ని అలా మారిన అగ్ర కులస్తుడు వాళ్ళ పిల్లలకిచ్చి పెళ్ళి చేస్తాడా అన్నాను. లేదు అన్నాడు. మతం మారినంత మాత్రాన బుద్ది మారదుకదా, మారవలసింది మన అలోచనా విధానం, అది మారనంత కాలం మనం ఏ మతంలోకి వెల్లినా ఒకటే అన్నాను.

వీళ్ళు చెప్పేది ఒకటే, నువ్వు నీ మతమునందు కించబరచబడుతున్నావు, మా ప్రభువు నందు అందరునూ సమానులే అంటారు. అవమాన బాధతో వున్న మనిషి అది నమ్ముతాడు. అప్పుడు మొదలుపెడతారు విషం నింపడం. వాళ్ళ దేవుడు గొప్పవాడు అని చెప్పుకుంటే పరవాలేదు. హిందూ మతాన్ని కించపరుస్తారు. ఎందుకంటే అలా చేస్తే తప్పితే వాళ్ళ మాట వినరు కదా. సంస్కారంలో తేడా చూడండి. ఒక సారి నా ఫ్రెండ్ తో వాదనలో వాడు ఉన్నట్టుండి, మీ విష్ణుమూర్తి నీటి అడుగున ఎందుకు ఉంటాడు అన్నాడు, నాకు వెంటనే అర్దం అయ్యి, ఏరా, మీ చర్చిలో మీ ప్రభువు గురించి కంటే కూడా మా గురించే, ఎక్కువ చెపుతారా అని అడిగా. ఎందుకంటే వాడు  ఏసు గురించి మాట్లాడడం కంటే హిందూ మతం గురించి కామెంట్ చెయ్యడమే ఎక్కువ చేస్తాడు. నేను వాడితో వ్యతిరేక భావన లోంచి పుట్టిన మతాలు అంత కంటే ఎక్కువ ఏమి చెపుతాయిలే అన్నాను. ఎందుకంటే హిందూ మతం మీద వ్యతిరేకతతోనె వాటి బ్రతుకు ఆధారపడిఉంది. దమ్మున్న వస్తువుకి పబ్లిసిటీ అవసరం లేదు కదా. నీమీద నీకు నమ్మకం లేనప్పుడే నువ్వు అవతలవాడి మీద చెడు చెపుతావు. 


సంస్కారమంటే ఎలావుంటుందంటే, ఒక‌సారి ఏదో మాటల్లో, మా మణుగూరు రామాలయం పూజారి గారితో మా వాదన విషయం చెప్పాను. ఆయన, వెంటనే మీరు వాళ్ళతో వాదించడం అనవసరం, ఎవరి నమ్మకాలు వారివి. వాళ్ళ దారిలో వాళ్ళని వెల్లనియ్యడమే అన్నారు. నేను ఆయనతో అలా కాదు, వీళ్ళు జనాల్ని మభ్యపెట్టి మతాలు మార్పిస్తున్నారు, దీనిని మనం ఆపాలి అన్నాను. ఆయన ఆ అవసరమేమిటి, వెళ్ళేవాళ్ళు వెలతారు, వచ్చేవాళ్ళు వస్తారు దానిని మనం ఆపకూడదు అన్నారు. తరువాత, ఆయన, ఆయన ప్రక్కనున్న తాళం కప్ప చూపించి రాజుగారు, మీరు దీనినే దేవుడు అనుకొని మనస్పూర్తిగా ద్యానం చేసుకోండి, మీరు అనుకున్న పని అవ్వకపోతే నన్ను అడగండి అన్నారు. అని ఇక్కడ మీకు కావలసింది దైవం మీద నమ్మకం అంతే అన్నారు. ఆయన ఎంత సెక్యులరిస్ట్ అంటే, ఆ గుల్లో పనిచేసే తోటమాలి క్రీస్టియన్. వాడు, వాడి ఇంట్లో పదిమందిని పిలిచి ఏసు ప్రార్దనలు చేయించేవాడంట. వాడు ఉండేది మా గుడిలోనే ఉన్న క్వార్టర్‌లో. ఆ విషయం ఈయన ఏ రోజూ మాకు చెప్పలేదు. కానీ, ఒకసారి వాడు మా గుడి హాల్లోనే ప్రార్దనలు పెట్టేడు. అప్పుడు ఆయన వాడిని తిట్టి మాకు చెప్పారు. మేము ఈ విషయం మాకు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు అని దెబ్బలాడితే, వాడింట్లో వాడు, వాడి దేముడిని ప్రార్దించుకోవడం తప్పు కాదు కాబట్టి నేను మీకు చెప్పలేదు, కానీ ఇప్పుడు వాడు లిమిట్ దాటాడు కాబట్టి చెప్పాను అన్నారు. అదీ దేముడ్ని నమ్మడమంటే. అదీ సంస్కారమంటే. అసలు గుడిలో ప్రార్దన చెయ్యడానికి వచ్చిన ఫాదర్‌ని అనాలి. కానీ సంస్కార హీనులని ఏమీ అని ఉపయోగం లేదు.
 

Monday, January 24, 2011

నేనూ, నా హిందూ మతం.


పిల్ల వచ్చి గుడ్డుని ఎక్కిరించినట్టు, ఈ రోజు అందరూ హిందువుకి నీతులు చెబుతున్నారు. హిందువు అన్నవాడు పరమత సహనం గురించి ఒకళ్ళ దగ్గర నుండి తెలుసుకొనే దౌర్భాగ్యపు స్థితి లో లేడు. హిందువుకి సహనం అవసరాన్ని మించి ఉంది కాబట్టే, ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుండి వేరే మతాలని కలుపుకుపోతున్నాడు. ఈ సహనం ఎల్లకాలం ఉంటుంది అనుకొనే రోజులు పోయాయి. నిన్న సుప్రీంకోర్ట్ తీర్పు మీద కాంగ్రెస్ స్పందన చూసాకా, అసలు వీళ్ళ మూలాలు ఏమిటనే అనుమానం వస్తోంది. 1984 లో సిక్కుల ను ఊచకోత కోసినందుకు వాళ్ళు చెప్పినదేమిటి? ఒక మహా వృక్షం నేలవాలితే భూమి కంపిస్తుందా? ఒక మనిషే మహా వృక్షం ఐతే హిందూ మతాన్ని ఏమనాలి? అసలు గాంధీని చంపిన రోజే, నెహ్రూని కుడా చంపి ఉంటె, ఈ దేశానికి ఈ శని పట్టేదికాదు. హిందువుని అని గర్వంగా చెప్పుకో అని స్వామి వివేకానంద చెప్పవలసిన అవసరం ఉండేది కాదు.

సుప్రీంకోర్ట్ చెప్పినట్టు, అసలు మనుషుల్ని ప్రలోభపెట్టి, భయపెట్టి మతాన్ని మార్చవలసిన అవసరమేమిటి? ఎవడైనా ప్రోబ్లం లో ఉన్నాడు అని తెలిస్తే పాపం, వాలిపోవడం, మతం మారమంటం. పోనీ దేముడికి దణ్ణం పెట్టుకో అంటే పరవాలేదు, మీ దేముడ్ని వదిలేయి, మా దేముడ్ని నమ్ముకో ఇదీ వాళ్ళు చెప్పేది. అదీ సొంత ఫ్రెండ్సే. ఈ మద్యన నేను కొద్దిగా ట్రబుల్స్ లో వున్నానని, నా గురించి తెలిసి కూడా, నా ఫ్రెండ్స్ నన్ను మతం మారమంటారు. నేను చర్చ్, మసీదులు ముందు నుండి వెళ్ళేటప్పుడు ఆటోమెటిగ్గా నా చెయ్యి పైకి లేపి దణ్ణం పెట్టుకుంటాను. అది వాళ్ళకీ తెలుసు. అయినా సరే అలాక్కాదు, పూర్తిగా మతం పుచ్చుకోండి అంటారు. నా గురించి అతను ఆలోచిస్తున్నాడు, అనే ఒకే విషయం మీద వాళ్ళని ఏమీ అనడంలేదు. ఎంత ఫ్రెండ్ అయినా సరే, వాడు అవసరంలో ఉన్నాడు అనేసరికి వీళ్ళకి మతం మార్పించేయాలి అనే ఆలోచన ఎలా వస్తుందో అర్థంకావడం లేదు. 

అసలు ప్రపంచమంతా హిందువు గురించి ఏమనుకొంటోంది? ఇక్కడ గొడవ జరిగితే వాళ్ళ గోల ఏమిటి? ట్విన్ టవర్స్ మీద దాడి జరిగినప్పుడు బుష్ నోటి నుండి జారిన మాట ఏమిటి? క్రూసేడ్ మొదలుపెడదాము. వెంటనే సరి దిద్దుకొని మళ్ళీ ఆ మాట వాడలేదు. ఎవడి మీద యుద్ధం చేస్తాడు? అలా చేసే కదా ప్రపంచాన్ని రక్తసిక్తం చేసింది. పాముకి పాలు పోస్తే ఏమౌతుంది? మా మానాన మేము బ్రతుకుతున్నాము. మేము ఏ రోజు దేముడ్ని ఒక వస్తువు అమ్ముకున్నట్టు అమ్ముకోలేదు. అలా చేసి ఉంటే మా మతం లోంచి వచ్చిన బౌద్ధం ప్రపంచ వ్యాప్తం అయినట్టే మా మతం కూడా వ్యాపించేది.

కాబట్టే ప్రపంచంలోనే పురాతనమైన మూడు మతాలలో ఒకటైన హిందూ మతం ఈ దేశానికే పరిమితమైంది. మిగిలిన వాళ్ళు అమ్ముకున్నట్టే అమ్ముకుని వుంటే ఈ మూడు మతాలు ఈ స్థితి లో ఉండేవి కావు. ఆ జంతు జాతి నశించిపోతోంది, ఈ వృక్ష జాతి నశించిపోతోంది అని గోల పెడుతున్నారు గానీ, మన కళ్ళ ఎదురుగుండా పార్సీ మతం నశించిపోతుంటే వీళ్ళకి కనపడడంలేదు. గట్టిగా నిలబడ్డారు గనుక సరిపోయింది గానీ, లేకపోతె యూదు మతం పరిస్థితి ఏమయ్యేది? ఇప్పటికైనా హిందువు మేలుకొనకపోతే హిందూ మతం పరిస్థితి కూడా పార్సీ మతం లాగ అయ్యిపోవడానికి ఎక్కువ కాలం పట్టదు. 

కొన్ని జిల్లాల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పెళ్లి చేసుకోవాలంటే ముందు వాళ్ళింటిలో హిందూ దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయో, లేదో చూసుకోవలసి వస్తోంది. బస్సు స్టాండ్, రైల్వే స్టేషన్ లలో నిలబడితే ఎవడో వస్తాడు, చేతిలో కాగితం పెట్టి వెళ్ళిపోతాడు. ఏమిటా అని చూస్తే మా దేముడు ఇలాగా,అలాగా అని ఉంటుంది. నాకు చాలాసార్లు ఈ అనుభవాలు అయ్యాయి. ఒకసారి కొత్తగూడెం నుండి మణుగూరు వెళుతుంటే బస్సు లో నా పక్కన కూర్చున్న అతను ప్రభువు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నాకు ఇంట్రస్ట్ లేదు వదిలేయండి అని మర్యాదగా చెప్పాను. లేదు, ఒకసారి బైబిల్ చదవండి అని ఇవ్వబోయాడు, నేను ఇప్పటిదాకా మా భగవద్గీతే చదవలేదు, ఇదేక్కడ చదువుతాలెండి అనేసి నేను మాగజైన్ చదువుకోవడం మొదలుపెట్టాను. ఎన్నిసార్లు చెప్పినా అతను నన్ను వదిలిపెట్టకుండా ఏదో చెబుతానేవున్నాడు. ఈ లోపు మా కాలనీ స్టేజ్ వచ్చింది. బ్రతికానురా అనుకుంటూ దిగుదామని లేస్తుంటే వాడు బైబిల్ తీసి చేతిలో పెట్టబోయాడు. అప్పుడు లేసింది నా బి.పి. నా కొడకా ఇందాకటినుండీ మర్యాదగా చెపుతున్నా దొబ్బుతావేంటి, ....పగులుద్ది జాగ్రత్త అని బూతులు తిట్టి కిందకు దిగిపోయాను.

ఏలూరులో ఇంటి ముందు నిలబడి సిగరెట్ కాల్చుకుంటుంటే ఒక పెద్దాయన కాగితం ఇవ్వబోయాడు, నేను హిందువుని నాకొద్దు అని మర్యాదగా చెపితే వెళ్ళిపోయాడు. నేను ఇంట్లోకెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసరికి, ఆయన కాగితం లోపలకేసి వెళ్ళిపోతున్నాడు. అంతకు ముందు మర్యాదగా మీరు అన్న నేను, ఒరేయ్ అని పిలిచా. వెనక్కు వచ్చాడు. గెట్ పిల్లర్స్ మీద చూడమన్నా, చూసాక ఏమున్నాయి అక్కడ అని, ఏరా బోర్డ్ మీద నా పేరు రామ రాజు అని అందంగా ఉంది, పిల్లర్స్ మీద ఒక ప్రక్క దుర్గ ఫోటో, ఇంకో ప్రక్క సాయి బాబా ఫోటో ఉన్నాయి కదా, కళ్ళు ......నాయా, నాకొడకా, ఇందాకా మర్యాదగా చెప్పాను, ఇంకోసారి కాగితం నా గేట్లో పడిందంటే చస్తావు జాగ్రత్త అని అరిసా. అప్పుడు మా ఎదురింటి వాళ్ళు, మాకు రోజు ఇదే గొడవండి, కాకపొతే మీరు తిట్టినట్టు మేము తిట్టలేకపోతున్నాము అన్నారు. నేను అసలే నిర్మొహమాటంగా ఉంటాను, దాన్ని నా తెలంగాణా జీవితం ఇంకా పెంచింది. నాలో ఉన్న ఆలోచనాశక్తి (మూర్ఖత్వం) ఇంకా ఎక్కువ పెరిగిందంటే నా సింగరేణి జీవితమే కారణం.

నా మేనకోడలు హాస్టల్ లో ఉన్నప్పుడు, దాని రూమ్ మేట్స్ దానితో క్రీస్తు ప్రార్దన చేయించేవాల్లంట. ఆ విషయం తెలిసి నేను తిడితే, అది అందులో తప్పేమిటి మావయ్యా అని నామీదే తిరగబడింది. దాన్ని మార్చడానికి నాకు వారం రోజులు పట్టింది. ఇప్పటికీ అది అమెరికా నుండి రాగానే ఏడిపిస్తుంటాను. ఇదే మనిషి ఇంజనీరీంగ్ చదివేటప్పుడు ఒక లెక్చరర్ రోజూ క్రీస్తు గురించి చెపుతుంటే తిరగబడింది. సాయంత్ర్రానికి దాని పేరు కాలేజీలో మారుమోగిపోయిందంట. అసలు పాఠాలు చెప్పవలసిన మాస్టారులు మతాల గురించి చెప్పడమేమిటి? నా క్లాస్‌మేట్ ఆదిత్యం అని ఉన్నాడు. అతని తమ్ముడి స్కూల్లో మాష్టారు, ఒక సారి కుంతీ దేవిని కామెంట్ చేసాడంట. ఆ కుర్రవాడు ఇంటికొచ్చి వాల్ల నాన్నగారితో చెపితే, ఆయన ఒరేయ్, రేపు మీ మాష్టారిని మన పాండవుల తండ్రుల అడ్రెస్స్ లు మనకు తెలుసు, వాళ్ళ దేముడి నాన్న అడ్రెస్ ఏమిటో అడుగు అన్నారంట. మరుసటి రోజు ఇంక ఆ మాష్టార్ ఏమి మాట్లాడతాడు?


ఒక రోజు నేను చెరువు దగ్గర నుండి వస్తూ పక్క ఊరిలో ఉన్న వెల్డర్ దగ్గర  నా పడవలు రిపేర్ చేయించడానికి అని ఆగాను. అతను కొత్తగా వచ్చాడు. అప్పటికి ఆరు నెలలయ్యింటుంది అతను అక్కడ పెట్టి. రోడ్ మీద ఆగి పిలిచాను. నేను ఎవరితో ఐనా ముందు నా పేరు చెప్పి పరిచయం చేసుకుంటాను. అతనికి నా పేరు చెప్పగానే సార్ మీ గురించి విన్నానండి. మీ దగ్గర నేను రేట్ చెప్పనండి, మీకెంత ఇవ్వాలనిపిస్తే అంతే ఇవ్వండి అన్నాడు. నేను అక్కడ బాగా పేరు సంపాదించేను. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరూ కూడా ఒకే సంవత్సరంలో నా అంత నష్టపోయినవాడు లేడు. అదీ మన పేరు గొప్పదనం. సరే రేపు పంపిస్తానని చెప్పి బయలుదేరుతుంటే, అతనికి నన్ను చూస్తే ఏమనిపించిందొ ఏమో, నన్ను ఆపి సార్, నేను రెండు సంవత్సరాల క్రితం మతం తీసుకున్నానండి అన్నాడు. మంచిదమ్మా, ఇప్పుడు బాగుందా అన్నాను. చాలా బాగుంది సార్ అన్నాడు. బైబిల్ పూర్తిగా చదివావా అన్నాను. చాలా సార్లు చదివానండి, రోజూ చదువుతానండి అన్నాడు. అప్పుడు, నీ వయసెంత అని అడిగాను. 25 ఏళ్ళండి అన్నాడు. అంటే ఊహ వచ్చాకా 1౦ ఏళ్ళు హిందువుగానే ఉన్నావు కదా అన్నాను. ఆయ్ అన్నాడు. ఎప్పుడైనా రామాయణ, భారత, భాగవతాలు చదివావా అన్నాను. లేదండీ అన్నాడు. ఇప్పుడు ఒక బూతు మాట అంటాను, ఏమనుకోవు కదా అన్నాను. బలే ఉన్నారండి, మీరంటే నేనెందుకు అనుకుంటానండి అన్నాడు. అయితే అంత కాలం ...................................వు అన్నాను. నిజమే సార్ నేను చేసింది తప్పేనండీ అన్నాడు. అతనికి ఒక అరగంట క్లాస్ పీకి వచ్చేసాను.


మా సింగరేణి లో గుడి, చర్చ్, మసీదు అన్నీ అన్‌అఫీషియల్ గా సివిల్ వాళ్ళమే కట్టిస్తాము. అలాగే మసీదు కట్టించాము. దాని ఓపెనింగ్ కి మా జే.ఇ నన్ను రమ్మని పిలిచారు. అదేంటి సార్, నన్ను పిలుస్తారు, కట్టించిందే మనం, మనం బయటవాళ్ళని పిలవాలి గానీ అన్నాను. అంటే ఆయన, అది కాదు ఒక బ్రాహ్మిణ్ ఇస్లాం తీసుకున్నారు, రేపు వచ్చేది ఆయనే అందుకని ప్రత్యేకంగా చెపుతున్నాను అన్నారు. వెంటనే నేను సారీ సార్, నేను రాను అన్నాను. ఎందుకని అని అడిగారు ఆయన. సార్ నా మతం గొప్పతనం తెలుసుకోలేనోడు ఇంక మీ మతం గురించి ఏమి చెపుతాడు, అది నేను వినడమేమిటి అని మరుసటిరోజు నేను ఊర్లో ఉంటే బాగోదని హంటింగ్ కి వెల్లిపోయాను. నాకు మొహమాటం తక్కువ, కానీ మేము కట్టించిన దాని ఓపెనింగ్ కి నేను లేకపోతే బాగోదని వెళ్ళిపోయాను. ఆయన, నేను, మతం విషయంలో తప్పితే సొంత అన్నాతమ్ముల్ల గా ఉండేవాళ్ళము. 


ఇంక, కొన్ని హాస్పిటల్స్ లో పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరైనా పల్లెటూరి నుండి డెలివరీ గురించి వస్తే, వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు మతం పుచ్చుకొని తీరుతారు. ఎలాగంటే సరిగ్గా నొప్పులు రావడానికి ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందు నర్స్ వచ్చి అమ్మా కడుపులో బిడ్డ అడ్డంతిరిగింది, జాగ్రత్త, మీ దేముడికి దణ్ణం పెట్టుకో అని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ అమ్మాయి భయంతో దణ్ణం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ నర్స్ మళ్ళీ వస్తుంది. ఏదో నా నమ్మకానికి ఈ లాకెట్ వేసుకోఅమ్మా, నేను కూడా మా దేముడుకి నీ గురించి దణ్ణం పెట్టుకుంటాను అని వెళ్ళిపోతుంది. తరువాత డాక్టర్ వచ్చి నొప్పులు రావడానికి ఇంజెక్షన్ ఇస్తుంది. తరువాత మాములుగా డెలివరీ అయ్యిపోతుంది. ఆ నర్స్ వచ్చి మా దేముడే నిన్ను కాపాడేడు అని చెప్పేసరికి వీళ్ళకి నమ్మకం పెరిగిపోయి మతం మారిపోతున్నారు. ఈ విషయం మీద ఒక హాస్పిటల్ లో గొడవ కూడా అయ్యింది. ఇలాంటివి చూసే దారా సింగ్ ఆ పని చేసింది. అదే టైంలో ఒరిస్సా లో ఒక నన్ ని ఎవరో రేప్ చేసారు. ఆ వార్త పేపర్లో మొదటిపేజీలో వచ్చింది. ఏమని, హిందూ అతివాదుల చేతిలో నన్ మానభంగం. తరువాత తనని రేప్ చేసింది మాజీ లవర్ అని తెలిసింది. ఈ వార్త మాత్రం చిన్న బాక్స్ లో నాలుగో పేజిలో వేసారు. గ్రాహం స్టైన్స్ తో పనిచేసిన వ్యక్తే కమిటీ ముందు అతను మతం మార్పించే పద్దతి గురించి చెప్పాడు. 


1997-98 ల్లొ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ లకు చెందిన కొంతమంది కలసి ఈ రెండు రాష్ట్రాలలో ఉన్న కొన్ని జిల్లాలని కలపి క్రిష్టియన్ స్టేట్ గా చెయ్యాలని అడగడానికి అని కలకత్తాలో మీటింగ్ పెట్టుకున్నారు. అడిగారొ లేదో తరువాత పేపర్ లొ రాలేదు. ఈశాన్య రాష్త్రాలలొ పరిస్థితి చూస్తూకూడా మనం ఇలా ఉంటే ఎలాగ? పరిస్థితి లొ మార్పు రాకపోతే దేశంలో చాలామంది దారాసింగ్ లు వస్తారు. శ్రీరామసేన, అభినవభారత్ ల అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

Saturday, January 22, 2011

నా రూపాయికి కూడా వంద పైసలే.

నేను మొన్న మణుగూరు వెళుతుంటే, బస్సు సూర్యాపేట దగ్గర టీ గురించి ఆపాడు. నేను కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతాను. వీడు బాదేస్తాడులే అనుకుంటూ లోపలకు వెళ్లాను. ఎందుకంటే ఆ హోటల్ చూడగానే, నాకు యండమూరి డబ్బు 2 ది పవర్ ఆఫ్ డబ్బు లో వ్రాసింది గుర్తుకువచ్చింది. అర్థ రూపాయి అప్పడాన్ని అద్దాల బీరువాలో పెట్టి ఐదు రూపాయలకి అమ్మడం అంటాడు ఆయన. అనుకున్నట్టే వాడు శుభ్రం గా ఒక పేపర్ గ్లాస్ లో పట్టిచ్చి 23 రూపాయలన్నాడు. గ్లాస్ తీసుకొని త్రాగుతూ, మళ్ళీ కౌంటర్ దగ్గరకెళ్ళి టీ ఎంత అన్నాను. సరిగ్గా అప్పుడే ఒకాయన టీకని 10 రూపాయల కాగితం తీస్తున్నాడు. వీడు 21 అన్నాడు. వెంటనే ఆయన "ఆ" అనేసి డబ్బులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు.అంటే స్టార్ రేట్స్ అన్నమాట అని, (నేను గోదావరి జిల్లావాడిని, పెరిగింది తెలంగాణా లో నేమో నాకు రెండు ఏరియాల బూతులు చాలా అలవోకగా వచ్చేస్తాయి) వీళ్ళు మన ..............నికి ఇక్కడ ఆపుతారు అని గ్లాస్ తీసుకొని బయటకు వచ్చేసాను. ఎందుకంటే వాడు టీని, రాత్రుళ్ళు రోడ్ మీద స్టీల్ కేరియర్ లో పెట్టి అమ్ముతారు చూడండి, అలాంటి దాంట్లోంచి తీసి అందమైన పేపర్ గ్లాస్లో పోసి ఇస్తున్నాడు. సరే బాత్రూం కెల్దామని వెళితే అందులో సేన్సార్స్ పనిచెయ్యడం లేదు. కోక డాబు అంటారు చూడండి అలా ఉంది.

ఇక్కడ మనం ఒక విషయం గుర్తుకుతెచ్చుకోవాలి. మన రాష్ట్రాన్ని ఇంతకు ముందు పరిపాలించిన దేముడు డాక్టర్. కార్పోరేట్ హాస్పిటల్స్ ని బ్రతికించడానికి ఆరోగ్యశ్రీ అనే పదకాన్ని పెట్టాడు. కానీ బస్సు స్టాండ్స్ బాత్రూమ్స్ లో నీళ్ళ గురించి పట్టించుకోడు. హెపటైటిస్ బి అనేది పబ్లిక్ టాయిలెట్స్ ద్వారా విపరీతం గా స్ప్రెడ్ అవుతుందని ఆయనకు తెలియదు అనుకోము. ఆయనే కాదు హైదరాబాద్ ని విపరీతంగా డెవెలప్ చేసాను అని చెప్పుకొనే నారా వారు కూడా ఈ విషయం మరచిపోయారు. 4.39 బిలియన్ రూపాయలు ఖర్చుపెట్టి ఎయిర్ పోర్ట్ కి ఎలివేటేడ్ రోడ్ వేస్తాము కానీ సామాన్యుడు వాడుకొనే బస్సు స్టాండ్స్ లో ఉన్న టాయిలెట్స్ లో నీళ్ళు ఎరేంజ్ చేయలేము. అంటు రోగాలతో పోయేది సామాన్యుడే కదా. మన దేశంలో సామాన్యుడి ప్రాణానికి విలువ లేదు కదా.

అది పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాము. నేను వచ్చి బస్సు దగ్గర నిలబడ్డాను. ఈ లోపు అందమైన పేపర్ గ్లాస్ లో టీ తాగుతూ డ్రెవర్ వచ్చాడు. అతని దగ్గరకెళ్ళి బాబూ, ఇక్కడ ఆపమని మీ ఓనర్ చెప్పాడా, లేక మీరే ఆపుతున్నారా అని అడిగా. ఎందుకంటే మొత్తం ప్రైవేట్ బస్సు లన్నీ అక్కడే ఆగుతున్నాయి. అతను, లేదుసార్ ఇక్కడ శుభ్రం గా ఉంటుందని మేమే ఆపుతున్నాము అన్నాడు. ఏమయ్యా డబ్బులిచ్చి తాగేటట్టైతే నువ్వు ఇక్కడ తాగుతావా అని అడిగా. లేదండి అన్నాడు  బాబూ నీ రూపాయికే కాదు నా రూపాయికి కూడా వంద పైసలే, ఎవడెలాపోతే నాకెందుకు, నాకు ఫ్రీ గా వస్తే చాలు అనుకోకు, ఎందుకంటే మీకు ఎక్కడైనా ఫ్రీ గానే ఇస్తారు, ఇలాంటి చోట ఆపితే మాకు .... తీరిపోతుంది అన్నాను.

వీళ్ళకి ఫ్రీ కాదు, కానీ మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీకు ఏలూరు నుండి ఉదయం 7.30 కి భద్రాచలం బస్సు ఉండేది. అక్కడ బయలుదేరాకా 60 కి.మీ. దూరంలో చింతలపూడి దగ్గర టిఫిన్ కి ఆపుతాడు. ఎక్కువలో ఎక్కువ గంటన్నర ప్రయాణం. అక్కడ నుండి చంద్రుకుంట 75 కి.మీ. దూరం, అక్కడ భోజనానికి ఆపుతాడు. అక్కడ నుండి ఒక అరగంట లో మనం కొత్తగూడెం వెళ్లిపోవచ్చు. వీళ్ళు తిని వచ్చేదాకా మనం నిలబడే ఉండాలి. లేదా గంటన్నర తేడాలో మనం టిఫిన్, భోజనం చేసేయాలి. వాళ్ళ మీద జాలిపడాలి కాదనను, ఎందుకంటే రోజూ హోటల్ తిండి అంటే ఎవరికైనా కష్టమే. కాకపొతే వాళ్ళ వలన మనకి ఇబ్బంది కదా. అసలు ఏలూరు భద్రాచలం మద్య దూరమే 225 కి.మీ ఉంటుంది ఏమో.

మీరు అబ్జేర్వ్ చేసే ఉంటారు, కొంతమంది తేడా ఇంతే కదా అంటారు, అలాగని ఆ "ఇంతే" ని వాడు ఒదులుకోడు. ఏదో చిన్న వ్యాపారస్తులు ఐతే మనం మాట్లాడం. వచ్చిన భాదేంటంటే, మనం రైతు బజార్లో రూపాయి దగ్గరా, అర్థరూపాయీ దగ్గర బేరాలాడతాము, అదే మాల్ కి వెళితే బిల్ కడతానికి కూడా లైన్లో నిలబడి, వాడు చెప్పిన రేట్ కి కొంటాము. పైగా, ఒక్కొక్కడు బ్లాక్ మెయిల్ కూడా చేస్తాడు. నేను ఒకసారి టి.వి. కొందామని కొత్తగూడెంలో అడిగితే చాలా ఎక్కువ చెప్పాడు. అదేమిటి అంత లేదు కదా, నేను ఖమ్మం లో కొనుక్కుంటానులే అంటే, వాడు అక్కడ కొంటే మీ మణుగూరు లో సర్వీసింగ్ కి మేమే పంపాలి, ఆలోచించుకోండి అన్నాడు. నేను వెంటనే, ఏరా బాబూ నా చెవిలో చుట్టలు ఏమైనా కనిపిస్తున్నాయా, నేను కంప్లైంట్ ఇచ్చిన నాలుగు రోజుల్లో అవ్వలేదనుకో అప్పుడు తెలుస్తుంది, నా సంగతేంటో కంపనీ వాడికి అని చెప్పి వచ్చేసాను. మన ఇంటికి వచ్చి కూరలమ్మేవాడంటే మనకి లోకువ, అదే మనం వెళ్ళగానే మనకి కూల్ డ్రింక్ ఇచ్చి మనల్ని ఎలా బాదేసినా మనకి ఆనందమే.

ఒకో టైలరింగ్ షాప్ ముందు .............AC అని ఉంటుంది. అక్కడ మనం ఉండేది ఐదు నిముషాలు. కానీ వాడు వేసే రేట్ కి మనం ఏమీ మాట్లాడకుండా కొలతలు ఇచ్చి వచ్చేస్తాము. అంటే వాడు AC లో కూర్చుని కుడితే ఆ బిల్లు మనం కడతామన్నమాట. పోనీ సెలూన్ అంటే సరే, నాకులాంటి వాళ్ళు తలకి సున్నాలు వేయిన్చుతాము కాబట్టి ఎలా లేదన్నా గంటపైనే పడుతుంది. అప్పుడు ఇచ్చినా అందమే, కానీ టైలరింగ్ షాప్ లో AC కివ్వడమంటే నవ్వు వస్తుంది.  

Friday, January 21, 2011

నా సింగరేణి.

 ఒకప్పుడు 1,15,000 మందితో కళకళ లాడే నా సింగరేణి ఈ రోజు 65,000 మందితో నీరసించిపోతోంది. మన రాష్ట్రం లోనే నిరక్షరాస్యులకి ఎక్కువ ఉద్యోగాలిచ్చే ఏకైక సంస్థ ఈ రోజు, యూనియన్ల కారణంగా నాశనం అయిపోతోంది. సింగరేణి లో యూనియన్లకి ఎన్నికలు పెట్టి, యాజమాన్యం తన ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోంది. అది యాజమాన్యం తప్పు కాదు. ఎందుకంటే యజమాని ఎప్పుడూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలని చూస్తాడు. అది ప్రభుత్వ యాజమాన్య మైనా కావచ్చు, ప్రైవేటు అయినా కావచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకోవలసింది కార్మిక సంఘాల గురించి.

ఎన్నికలు లేక ముందు ప్రతి యూనియన్ పట్టు గురించి కార్మికుడి పక్షాన నిలిచేవి. ఎందుకంటే అప్పుడు వాటికి కావలసింది కార్మికుల్లో పట్టు. అది ఏ యూనియన్ కైతే ఎక్కువ ఉందొ వాళ్ళు అంత పైరవీ లు చేసుకోవచ్చు. అందుకోసం వాళ్ళు చేసే పోరాటాలు ఎంతో కొంత కార్మికుడికి ఉపయోగపడేవి. అప్పుడు యాజమాన్యానికి కూడా ఇన్ని యూనియన్లని మేనేజ్ చెయ్యడం కష్టమయ్యేది. ఇప్పుడు ఒక్కడ్ని మేనేజ్ చేస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఒక్కో యూనియన్ వస్తోంది. కాబట్టి వాళ్ళు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. 

1990 లలో ఒకసారి మణుగూరులో నక్సలైట్స్ ఒక పోస్టర్ వేసారు. అందులో ఒక ఇంగ్లీష్ దొర నాలుగు కుక్కలని  గొలుసులులతో పట్టుకొని ఉంటాడు. ఆ నాలుగు కుక్కలు మా నాలుగు యూనియన్లన్నట్టు చూపించారు. అది అప్పుడూ, ఇప్పుడూ కూడా కరెక్టే. కుక్క కూడా అందరూ వేసిన బిస్కెట్స్ తినదు. మా నాయకులు అంతకంటే ఘోరం. మీరు రాజకీయనాయకులు, అధికారుల సంపాదన మాత్రమే చూసివుంటారు, ఒక్క సారి ఈ యూనియన్ నాయకుల సంపాదన చూస్తే కళ్ళు తిరుగుతాయి.

మా సింగరేణి పరిస్థితి ఎంత ఘోరంగా తయారయ్యిదంటే డోజర్లు అద్దెకు తీసుకోవడానికి టెండర్ పిలిచింది. వై.ఎస్.ఆర్. పుణ్యమా అని, ఇప్పటికే సగం పైన పనులు కాంట్రాక్టర్స్ నడుపుతున్నారు. అసలు వాళ్ళు వేసే రేట్స్ ఎట్టిపరిస్థితుల్లోను వర్క్ అవుట్ అవ్వవు. అయినా వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకొనివచ్చి మా సింగరేణి కి సేవ చేస్తున్నారు. ఈ విషయాలు అన్నీ మా దగ్గర పనిచేసే బదిలీ ఫిల్లెర్ కి కూడా తెలుసు. టెక్నాలజీ వాడద్దు అని ఎవరూ అనరు. కానీ ఆ పనిని మా కంపెనీ వర్కర్ తో చేయించవచ్చు. ఇక్కడ మా వర్కర్స్ తప్పు కూడా ఉంది.

ఎలాగంటే, పూర్వం మా సింగరేణిలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్   అయిన N.S.Canals, అలాగే A.P. Minor Irrigation Corp వాళ్ళు, వాళ్ళ మెషినరీ తో వర్క్స్ చేసారు. వాళ్ళ రేట్స్ మా వాళ్ళు చేస్తే అయ్యే రేట్ కంటే కూడా తక్కువ అయ్యేది. అప్పుడు మా జీతాలు చాలా ఎక్కువ, అలా చూసుకున్నా వాళ్ళది తక్కువే అయ్యేది. మా వాళ్ళు ప్రతి చిన్న రిపేర్ కి బ్రేక్ డౌన్ పెట్టేవారు. వాళ్ళని భయపెట్టో, బ్రతిమిలాడో దారికి తేవచ్చు. ఎందుకంటే మా వర్కర్స్ లో చదువు లేని వాళ్ళు ఎక్కువ. వాళ్ళని యూనియన్ వాళ్ళు రెచ్చ గొట్టి చెడగోట్టేవాళ్ళు. కానీ చాప కిందకి నీళ్ళు వస్తున్నాయి అంటే ఎవరైనా సరిగ్గా పనిచేస్తారు. అది యూనియన్ వాళ్ళు చెయ్యాలి. కానీ అలా చేయరు. పూర్వం మా సింగరేణిలో రాజకీయ ప్రమేయం ఉండేది కాదు. కానీ ఈ మద్యన ప్రతి పనిలోను రాజకీయ జోక్యం పెరిగిపోయింది. 

మా కంపెనీకి MD మారినప్పుడల్లా లాభ నష్టాలు మారుతూ ఉంటాయి. ఒక MD టైములో లాభం వస్తే, ఇంకో MD టైములో నష్టం వస్తుంది. అక్కడ పని చేసేది అదే వర్కర్. మారిందల్లా యజమాని. అంటే అక్కడ తప్పు ఎవరిది? ప్రతి ఒక్కడు సింగరేణిలో సమ్మెలేక్కువ అంటారు. కొంతవరకు అది రైట్ కావచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మా వర్కర్ పని చేసే పరిస్థితి వేరు. ఇక్కడ పని భారం ఎక్కువ ఉంటుంది. అసలు గని లోకి దిగి రావడమే చాలా కష్టం. అంతా లోతులో కెళ్ళి పని చేసి వచ్చేసరికి ఎవరికైనా కొంత చికాకు ఉంటుంది. అటువంటి టైములో అతనిని ఏమైనా అంటే వెంటనే తిరగబడతాడు. అక్కడ మనమున్నా అలాగే ప్రవర్తిస్తాము. అక్కడ అధికారికి ఓపిక ఎక్కువ ఉండాలి. మనకవసరమేంటి అంటే కుదరదు. అందరం ఒక చోట చేసేటప్పుడు, అందులోను మన క్రింద పని చేసే వ్యక్తి మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మా సింగరేణి చేసిన ఇంకో తెలివైన పని ఏమిటంటే వెల్ఫేర్ ఆఫీసర్స్ మా కంపెనీ వాళ్ళే ఉంటారు. వాళ్ళు మేనేజ్మెంట్ వైపే ఉంటారు, కానీ వర్కర్ వైపు ఉండరు. గవర్నమెంట్ లేబర్ ఆఫీసర్స్ మా కంపెనీ జోలికి రారు.

నాకు హిందీ సరిగ్గా రాదు. ఒక సామెత తెలుగు అర్థం చెబుతాను. శత్రువు ఎలాగు శత్రువే, మిత్రుడు మాత్రం ఏమి తక్కువ చేసాడు అనే అర్థం వస్తుంది. అలాగ మేనేజ్మెంట్ ఎలాగు వర్కర్ తరుపున ఉండడు, కనీసం ఇప్పటికైనా యూనియన్లు వర్కర్ గురించి ఆలోచిస్తే మిగిలిన ఈ 65,000 మందైనా ఉంటారు. లేకపోతే రేపటినుండి అన్నీ అద్దేకే తీసుకుంటారు. అప్పుడు మీకే నష్టం. అసలు కార్మికుడనే వాడు ఉంటేనే కదా మిమ్మల్ని మేనేజ్మెంట్ మేపేది. లేకపోతే మీరుకూడా ఇంటి దారి చూసుకోవలసిందే. అయినా మీకు పెద్ద నష్టం ఉండదనుకోండి. కావలసినంత ఇప్పటికే సంపాదిన్చేసారు. అయినా ఇంకా వచ్చేది ఆగిపోతుంది కదా.

Wednesday, January 19, 2011

మన దేవాలయాలు.

భవద్గీత లో లేనిది ఎందులోనూ లేదనే దానిని నేను గాడంగా నమ్ముతాను. కాకపొతే దానిని మనం అర్థం చేసుకొనే దానిని బట్టి ఉంటుంది. మొదటిసారిగా నేను గీతను 1979 గోదావరి పుష్కరాలలో టి.టి.డి. షాపులో ఒక్కొక్కటి రూపాయి చొప్పున రెండు కొన్నాను. దాని వ్యాఖ్యాత శ్రీ. శిష్ట్లా సుబ్బారావు గారు. అవి రెండూ మా ఇద్దరక్కలకి ఇచ్చాను. తరువాత నేను సింగరేణి ఉద్యోగంలో చేరాకా మా పెద్దక్క దగ్గర ఉన్నదానిని తెచ్చుకున్నాను.

ఎందుకంటే నాకు మళ్ళీ శిష్ట్లా వారిది 2007 దాకా దొరకలేదు. నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా అడిగేవాడిని. ఎప్పుడూ ఆయన రాసిన గీత దొరకలేదు. 2007 లో పని మీద విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ టి.టి.డి. కళ్యాణమండపంలో బుక్ ఫెయిర్ జరుగుతుంటే అక్కడ దొరుకుతుందేమోనని లోపలకు వెళితే, అదృష్టం కొద్దీ వీరు వ్రాసిన గీత ఉంది. వెంటనే 10 పుస్తకాలు కొన్నాను. అక్కడ మొత్తం 15 ఉన్నాయి. అన్నీ నేను తీసుకుంటే తరవాత వాళ్లకు దొరకవని పదీ తీసుకునివచ్చేసాను. తరువాత వైజాగ్ లో చూస్తే అక్కడా ఉన్నాయి, మళ్ళీ ఇంకో పది తీసుకున్నాను. ఇవి అన్నీ నేను కుర్రవాళ్ళకి ఇచ్చి, దానిని ఒక నవల అనుకుని చదవమంటాను. అంతే తప్ప అది ఒక ఆద్యాత్మిక గ్రంధం అనుకోవద్దంటాను. అది చదివితే ఇంకే సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్సూ చదవక్కరలేదు. క్రితం వారమే నా దగ్గర ఉన్నవి అన్నీ అయిపోతే, లిబర్టీ దగ్గర ఉన్న టి.టి.డి. కళ్యాణమండపానికి వెళ్లి అడిగితే, అసలు ఇక్కడ పుస్తకాలే అమ్మడం లేదన్నాడు. వెంటనే దాని చరిత్ర పేపర్లో చదివినది గుర్తుకు వచ్చి మందూ, అమ్మాయిలూ దొరుకుతారా అందామనుకున్నాను. మన టి.టి.డి. వారి శ్రద్ద అలాగుంది.

అసలు ఎండోమెంట్స్ డిపార్ట్ మెంటే అలాఉంది. మీరు ఏ గుడికి వెళ్ళినా మీకు స్థల పురాణం దొరకదు. దొరికినా అది గ్రాంధికం లో ఉంటుంది కానీ వ్యవహారిక బాషలో ఉండదు. అది రాసిన వాడి పాండిత్యం మనకవసరమా? నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు కొంటే అది గ్రాంధికంలో ఉంది. అక్కడ ఒక లెటర్ పెట్టి వచ్చేసా. కదిరి నరసింహ స్వామి గుళ్ళో అయితే, నేను రెండు సార్లు వెళ్ళినప్పుడూ దొరకలేదు, అక్కడా లెటర్ పెట్టి వచ్చేసా. ఈ సారి వెళ్లినప్పుడన్నా దొరుకుతుందేమో చూడాలి. అసలు మనకు ఏ గుళ్లోను స్థలపురాణం దొరకదు.

మీరు ఈ సారి ఎప్పుడైనా ఏదైనా ప్రసిద్ధి చెందిన గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, అక్కడ పూజారి జీతం కంటే కూడా అక్కడ ఎండోమెంట్స్ తరుపున పనిచేసే వాచ్ మన్ జీతం ఎక్కువ ఉంటుంది. గుడి కయ్యే ఖర్చు కంటే వీళ్ళ జీతాల ఖర్చే ఎక్కువుంటుంది. మనం హుండీలో వేసేది వీళ్ళని పోషించడానికే. అసలు పూజారి నిత్య దరిద్రం లోనే ఉంటాడు. మనువు చెప్తాడు. బ్రాహ్మనుడుకి ఆస్తి, వైశ్యుడుకి దరిద్రం ఉండకూడదు అని. ఎందుకంటే విద్య నేర్పే వాడికి ఆస్తి ఉంటే విద్యని వ్యాపారం చేస్తాడని. అతని అవసరాలన్నీ గ్రామస్తులే చూసుకోవాలి. అతనికి డబ్బు అవసరం కలగకుండా చూసుకొనే బాద్యత గ్రామానిదే. అప్పుడు అతను డబ్బు మీద ఏవ లేకుండా విద్యని ఉచితంగా నేర్పిస్తాడు. అలాగే వైశ్యుడుకి దరిద్రం ఉంటే గ్రామానికి కావలసిన వస్తువులు ప్రక్కవూరి నుండి తీసుకురాలేడు. దేవాలయంలో పూజారికి దరిద్రం ఉంటే ఆయన ఇంక దేముడికి ఏమి సేవ చేయగలడు? కానీ ఇప్పుడు మీరు చూడండి, ఏవో కొన్ని గుళ్ళల్లో తప్పితే చాలా చోట్ల వాళ్ళ జీతాలు మూడు అంకెలు దాటడం లేదు.

మణుగూరు లో మా కాలనీ లో ఉన్న రామాలయంలో అయితే ఒక టైంలో పూజారి ఇంటి ప్రక్కనే వాచ్ మన్ కి ఇల్లు ఇచ్చారు. అదేమిటి అని నేను అడిగితే ఏమైంది అన్నారు. అదే మా దగ్గర A,B క్వార్టర్స్ కి కొంచం దూరంలో C టైపు, వీటికి మూడు కిలోమీటర్ల దూరంలో D టైపు కట్టారు. అంటే నువ్వు కేడర్ మెయిన్ టెన్ చేస్తావు, కానీ గుళ్ళో పూజారికి మాత్రం వాచ్ మన్ పక్కనే ఇల్లు ఇస్తావు. అదీ మన పూజారుల పరిస్థితి. గుడి విషయాలలో పూజారి ప్రమేయం ఉండకూడదంట. ఇంక మన దేవాలయాలు ఏమి బాగుపడతాయి.

గుళ్ళోకి వెళ్ళాలంటే టిక్కెట్. ధర్మ దర్శనం అన్ని వేళలా ఉండదు. ఒకసారి, ఒక వెధవ అమెరికాలో గ్రీన్ కార్డ్ కి అప్ప్లై చెయ్యడానికి బర్త్ సర్టిఫికేట్ మీద తల్లి పేరు ఉండాలి అంటే అది తీసుకోవడానికి భద్రాచలం అవతలకి వెళ్లాను. వెళుతూ కూడా ప్రక్కనే ఉంటాడు అని మా వల మనిషిని తీసుకువెల్లాను. దారిలో పర్ణశాల చూద్దామంటే అక్కడకు తీసుకువెల్లాను. సరిగ్గా అప్పుడే శ్రీకాకుళం నుండి బస్సు వచ్చి ఆగింది. అందులోనుండి పాపం లేబర్ దిగారు. వాళ్ళు, ఏదో ఒక్కో రూపాయీ దాసుకొని దేముడు దగ్గర కొస్తే వాళ్ళని టిక్కెట్ తీసుకోమన్నాడు. నేను, నా దగ్గర కొస్తే డబ్బులు ఇస్తాను అని ఆ దేముడంటుంటే, నా దగ్గరకొస్తే డబ్బులివ్వాలి అని ఈ దేముదంటున్నాడు అని గొడవపెట్టుకొంటే, అతను సార్ మీరు డబ్బులివ్వక్కరలేదు వెళ్లి దర్శనం చేసుకోండి అన్నాడు, నేను కోపంతో ఉచిత దర్శనం ఎప్పుడో చెప్పు అప్పుడే వెళతాను, లేకపోతే అసలు వెళ్ళనే వెళ్ళను అని, నేను వెళ్ళకుండా మా మనిషి ని పంపాను. తరువాత ఏలూరు వచ్చి విశ్వ హిందూ పరిషద్ ఆఫీస్ కి వెళ్లి ఈ విషయం చెప్పి మనం ఏమీ చెయ్యలేమా అని అడిగాను. వాళ్ళు మీరు రేపు రండి, ఎదురుగుండానే ఎండోమెంట్స్ ఆఫీస్, రేపు మినిస్టర్ వస్తున్నారు, మాట్లాడుదాము అన్నారు. నేను వరసగా రెండు రోజులు వెళ్లాను. అసలు మినిస్టర్ రానేలేదు.

స్పెషల్ దర్శనం వద్దని ఎవరూ అనరు. కానీ ఉచిత దర్శనం అన్ని వేళల్లోనూ ఉండాలి. అవసరం ఉన్నవాడు స్పెషల్ దర్శనానికి వెళతాడు, లేని వాడు ఉచిత దర్శనానికి వెళతాడు.

Friday, January 14, 2011

తప్పు చేసేది మనమైతే, దానిని కృష్ణుడు మీదకి నేట్టడమేమిటి?

భవద్గీత లో లేనిది ఎందులోనూ లేదనే దానిని నేను గాడంగా నమ్ముతాను. కాకపొతే, దానిని మనం అర్థం చేసుకొనే దానిని బట్టి ఉంటుంది. చాలామంది కృష్ణుడు చెప్పిన చాతుర్వర్ణ వ్యవస్థ గురించి రక రకాలుగా విమర్శిస్తుంటారు. బ్రాహ్మనుడ్ని తలలో నుండి, క్షత్రియుడ్ని హృదయంలోనుండి, వైశ్యుడ్ని ఉదరము నుండి, శూద్రుడ్ని అరికాలిలోనుండి సృష్టించాడంట, మేము అంత నీచమా అంటుంటారు. అసలు కృష్ణుడు చెప్పిన వ్యవస్థ మానవ శరీరానికి అన్వయించి చెప్పాడు. మన శరీరంలో ఏ భాగం విలువలేనిది?  అలాగే ఒక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే సలహాలు ఇచ్చేవాడు, కాపుకాసేవాడు, కావలసిన వస్తువులు సమకూర్చేవాడు, ఆహారాన్ని పండించేవాడు కావాలి. ఇందులో ఎవరు లేకపోయినా ఆ వ్యవస్థ నాశనమే కదా. ఎవరి పని వాళ్ళు చెయ్యవలసినదే.

ఇదివరకు రిసెప్షనిస్ట్ అంటే, ఇప్పుడు ఫ్రంట్ ఆఫీసు ఎక్జిక్యూటివ్ అంటున్నాము, పని అదే, పేరు మాత్రమే తేడా. పేరు మారినంత మాత్రాన్న పని మారడం లేదు కదా, తల పని తలదే, చేతి పని చేతిదే. ప్రతి మనషి ప్రక్కవాడి మీద పెత్తనం చెయ్యాలి అనుకోవడం తోనే ఈ వైషమ్యాలు అన్నీ వచ్చాయి. ఈ రోజు చెప్పుల కొట్టులు అన్ని కులాల వారు పెడుతున్నారు, మనం వెళ్లి వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నాము, అదే ఒక చెట్టు కింద చెప్పులుకుట్టుకొనే వాడిని వీడితో సమానంగా చూస్తున్నామా? ఇద్దరూ చేసేది ఒకటే, తేడా ఎక్కడుంది మన ఆలోచనలో. మనం నీచంగా ఆలోచిస్తూ దాన్ని కృష్ణుడి మీదకేందుకు తొయ్యడం. ఇక్కడ మనిషి లోనే తేడా ఉంది. ఈ మద్యన చాలా మంది మమ్మల్ని నీచంగా చూస్తున్నారు అని స్టేజ్ లెక్కి ఉపన్యాసాలిస్తున్నారు. అసలు ఒకడు మిమ్మల్ని ఎలా చూసున్నాడు అనేది పక్కన పెట్టి, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో మొదటిగా ఆలోచించండి.

ఒక చిన్న ఉదాహరణ. నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు, నేను వాదించుకుంటుంటే  మా పక్కన ఉన్నవాళ్ళు భయపడేవాళ్ళు. వాడు ఎప్పుడూ, మీరు మమ్మల్ని అనగదోక్కేసారు అనే వాడు. మాట్లాడితే మీ కృష్ణుడు ఇలా అన్నాడు, మనువు అలా అన్నాడు అనేవాడు. వాడి పెళ్లికెల్లేంత దాకా మాకెవరికి వాడు క్రీస్టియన్ అని తెలియదు. అప్పటిదాకా నాస్తికుడు అనులోన్నాము. అంటే మేము ఎలా ఉండేవాల్లమో ఆలోచించండి. నా పిల్లలు వాడిని చిన్నాన్న అనేవారు. ఒకసారి మా వాదనలో, నాకు కోపం వచ్చి నువ్వే కులం రా అని అడిగాను. వాడు క్రీస్టియన్ అని చెప్పాడు, అబే మతం పుచ్చుకోక ముందురా అంటే, షెడ్యూల్ కాస్ట్ అన్నాడు, అందులో ఎవడివిరా అంటే మాల అన్నాడు. వెంటనే నేను, నీ యబ్బా నీ కులం తెలుసుకోవడానికి నిన్ను మూడు ప్రశ్నలు వేస్తె కానీ సమాధానం రాలేదు, అదే నన్ను అడుగు, నేను రాజు ని అని వెంటనే చెబుతాను, నేను నిన్ను కించపరిచేనంటావేమిటిరా, నీ కులాన్ని నువ్వే కించపరుచుకుంటున్నావు, కానీ నా కులం మీద నాకు గౌరవం ఉంది, ముందు నిన్ను నువ్వు గౌరవించుకోవడం నేర్చుకో, అపుడు నేను ఆటోమేటిక్ గా నిన్ను గౌరవిస్తాను అని బూతులు తిట్టాను. నిజమే పూర్వం అలాగే ఉండేది. ఇప్పుడు ఎక్కడోకానీ ఆ పరిస్థతి లేదు కదా.

నేను ఒక సారి పొలం రిజిస్ట్రేషన్ కి అని రిజిస్త్రార్ ఆఫీస్ కి వెళ్లాను. నా ముందు ఒక పెద్దతను లోపలికి వెళుతూ, చెప్పులు బయట విప్పి వెళుతున్నాడు. నేను అతన్ని ఆపి చెప్పులు విప్పి వెళ్ళడానికి ఇదేమి గుడి, హాస్పిటల్ కాదు, చెప్పులు వేసుకొని వెళ్ళు అన్నాను, అతను అయ్యా లోపల పెద్దాయన కదండీ అన్నాడు, బయటకోచ్చాకా మాట్లాడదాము ముందు చెప్పులు వేసుకొని వెళ్ళు అని చెప్పులు వేయిచి పంపాను. అతను వెళ్ళాకా పక్కనే ఉన్న కుర్రవాడిని నువ్వు ఎవరివి, అని అడిగితే ఆ పెద్దాయన కొడుకుని అన్నాడు. ఏమి చేస్తుంటావు అని అడిగితే, సి.ఆర్.రెడ్డి కాలేజ్ లో అటెండర్ ని అన్నాడు. అదేమిటయ్యా, కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్నావు, మీ నాన్న కి చెప్పలేవా అంటే అతను వెంటనే మేము షెడ్యూల్ కాస్ట్ అండీ అన్నాడు. అయితే ఏమిటి, ఇంకెప్పుడు ఆఫీస్ లోకి వెళ్ళేటప్పుడు చెప్పులు విప్పి వెళ్ళవద్దని చెప్పు మీ నాన్నకి అని తిట్టాను.

ఇంకోసారి ఒక ట్రాక్టర్ డీలర్ దగ్గరకి మా పినమావ గారు వెళదామంటే ఆయన తో కలసి వెళ్లాను. ఆయన లోపలకు వెళుతూ చెప్పులు విప్పారు. నేను బయట చూసాను. ఈయనవి ఒక్కటే ఉన్నాయి. లోపల ఉన్న వాళ్ళు చెప్పులుతోనే వున్నట్టు అర్థం అయ్యింది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఆఫీస్ లోకి వాళ్ళు కూడా చెప్పులు వేసుకొని వెళ్ళరు. అటువంటప్పుడు మనం కూడా బయట వదలి వెళ్ళడం మర్యాద. కానీ ఇక్కడ అలా లేదు. నేను మాములుగానే వెళ్లాను. లోపల కూర్చున్నాకా, ఇద్దరూ రేట్ గురించీ, డెలివరీ గురించీ మాట్లాడుకున్నారు. ఈ లోపు ఆ ఓనర్ ఏదో పని మీద బయటకు వెళ్ళారు. నేను టేబుల్ మీద ఏవో కాగితాలు కనిపిస్తే అవి తీసి చూసా. ఆయన లోక్ సత్తా లో ఏదో మంచి పదవిలోనే ఉన్నారు. ఆ కాగితాలన్నీ వీళ్ళు పార్టీ తరపున లేబర్ ని ఎలా ఎడ్యుకేట్ చేసిందీ వివరిస్తూ, హైదరాబాద్ పంపేవి. అవి అన్నీ చదువుతుంటే ఆయన లోపలకోచ్చారు. నేను ఆయనతో మీరు ఇవన్నీ చెయ్యక్కరలేదు, ముందు వాళ్ళల్లో ఉన్న ఇన్ఫీరియారిటీ ని తగ్గించండి అన్నాను. నేను ఈ చెప్పుల విషయమే చెప్పాను. మీరు ప్రతీ ఆఫీస్ ముందు రోజు ఒక గంట నిలబడి లేబర్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పులు విప్పకుండా లోపాలకి వెళ్లేటట్టు ఎడ్యుకేట్ చెయ్యండి చాలు. మనిషిలో బానిస మనస్తత్వం పొతే వాడికి వాడే ఎదుగుతాడు, మనం చెప్పక్కర్లేదు అన్నాను.

నా పాలేరు మొదట్లో చెరువులో మేతలు కట్టి అలా మురికిగానే కూర్చునేవాడు. నేను రెండు రోజులు చూసి, ఒరేయ్, పని అయ్యిపోయింది కదా, శుభ్రంగా స్నానం చేసి కూర్చోవచ్చుకదా అంటే మీ ఎదురుగా శుభ్రంగా ఎలా కూర్చుంటామండీ అన్నాడు. అంటే మనం వాళ్ళని ఏ స్టేజ్ కి తీసుకొనివెళ్ళామో ఆలోచించండి. అప్పుడు వాడిని మేతలు కట్టగానే పని ఏమీ లేకపోతే శుభ్రం గా ఉండేటట్టు తిట్టి మార్చవలసి వచ్చింది.

కృష్ణుడు పెట్టింది నాలుగు వర్ణాలే, మనమే దానిని మూడు వేల వర్ణాలుగా పెంచేసాము. తప్పు చేసేది మనమైతే, దానిని కృష్ణుడు మీదకి నేట్టడమేమిటి?

Wednesday, January 12, 2011

ఎంతైనా రాజు రాజే.......

108 సర్వీస్ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. రామలింగ రాజు, ఎవరి గురించి ఎవరిని మోసం చేసారో తెలియదు, కానీ ఆయన జైలు కెల్లడం వలన ఆయన మొదలుపెట్టిన చాలా సేవా కార్యక్రమాలు నెమ్మదించాయి. బైర్రాజు ఫౌండేషన్ కార్యక్రమాలు మాత్రం నడుస్తున్నాయి. అందరికీ దాన గుణం ఉండదు. అది కొందరికే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 108 సర్వీస్ లు నడుపుతున్నవాళ్ళు రామలింగరాజు కంటే ధనవంతులు. అది వాళ్ళ చేతుల్లోకి వెల్లినదగ్గర నుండి దాని మీద ఎన్ని గొడవలు నడుస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాము.

ఒక చిన్న ఉదాహరణ చెపుతాను. నేను ఒక సారి నా చెరువులు మీద లోన్ తీసుకుందామని బేంక్ కి వెళ్లాను. మేనేజర్ ఏమేమి కావాలో అన్నీ చెప్పి, ష్యూరిటి సంతకం ఒకళ్ళు పెట్టాలి అన్నారు. అదేమిటి నా భూమి గవర్నమెంట్ లెక్కల ప్రకారమే లక్ష, మార్కెట్ రేటు మూడు లక్షలు, మీరు నాకు ఇచ్చేది 38,000/- అసలు నేను, నా డాక్యుమెంట్స్ మీ దగ్గర పెడతానికి నేను మిమ్మల్ని ష్యూరిటి అడగాలి, అటువంటిది నన్ను మీరు అడుగుతున్నారేమిటి అన్నాను. అప్పుడు ఆయన, రాజు గారు మీరు అన్నది నిజమే కానీ డబ్బులు పుచ్చుకున్నవాల్లల్లో కొందరికి తిరిగి ఇచ్చే అలవాటు ఉండదు. వాళ్ళు కట్టకపోతే మేము కోర్ట్ నోటీస్ ఇచ్చి, కోర్ట్ చుట్టూ తిరగడం కంటే, ఇలా చేసేమనుకోండి, మేము ఒక ఫోన్ చేస్తే ష్యూరిటి ఉన్నవాళ్ళే మీ వెనక పడతారు అని, మీరు కావాలంటే చూడండి, మాకు డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళల్లో ఎక్కువమంది కోటీశ్వరులే ఉంటారు అన్నారు.   

అది నిజమే. రామలింగ రాజు చేతిలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడిచిన 108, తరువాత గవర్నమెంట్ ఫండింగ్ ఇంకా ఎక్కువ చేసినా, ఇప్పుడు సరిగ్గా నడవడం లేదు. అందరూ అనవచ్చు అవినీతి సొమ్ముతో నడిపేడు అని, అవినీతి సొమ్ముని ఎంతమంది ప్రజలకు ఖర్చుపెడుతున్నారు? నిజంగా అలా చేస్తే మనం చాలా సంతోషించవచ్చు. 108 చేతులు మారగానే, మొదటగా వాళ్ళు చేసిన పని దాని మీద ఉన్న సత్యం సింబల్ తీసేసి వీళ్ళది వేసుకోవడం. చాలా బాధ అనిపించింది. అది రామలింగ రాజు మానస పుత్రిక, సరిగ్గా చెప్పాలంటే ఆయన ......, వద్దు లెండి. అసలు అది తీసేసి వీళ్ళది వేసుకోవడానికి సిగ్గు అనిపించలేదా? ఇప్పుడు వీళ్ళు నడుపుతున్నారు కనుక వీళ్ళది వేసుకోవచ్చు, కానీ పాత దానిని తీసివెయ్యడం గురించి నేను మాట్లాడేది. సరే వేసుకున్నారు, తరువాత అంతే బాగా నడపవచ్చు కదా, డబ్బుకి లోటు లేదు, పైగా ప్రభుత్వం దగ్గర నుండి మునపటి కంటే ఎక్కువే వస్తోంది. అందుకే అంటారు పెద్దలు నువ్వు ఎంత డబ్బున్నవాడివి అయినా అవ్వు నీలో దాన గుణం లేకపోతే నువ్వు భిక్షగాడితో సమానం అని. అందరికీ ఇచ్చే గుణం ఉండదు, అది పుట్టుకతోనే వస్తుంది.

Sunday, January 9, 2011

మీరు అమ్ముకునేవాళ్ళ గురించే మాట్లాడుతున్నారు

ఒక్కొక్కసారి మన ఆలోచనా విధానం ఎంత తప్పుగా ఉంటుందో, మనం చాలా సామాన్యులు (ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే లేబర్) అనుకునే వాళ్ళ దగ్గర నుండే తెలుస్తుంది.

1985 లో అనుకుంటా, ఒకసారి నేను లీవ్ మీద కాకినాడ వెళ్ళినప్పుడు, మా ఫ్రెండ్ పెళ్లి ఉంటే  ఫ్రెండ్స్ అందరం కలసి బైక్స్ మీద అమలాపురం వెళ్ళాము. అప్పుడు ఎదురులంక బ్రిడ్జి లేదు. రావులపాలెం మీదుగా వెళ్ళవలసిందే. నాలుగు బళ్ల మీద వెళ్ళాము. దారిలో పల్లెటూర్లల్లో రైతులు భుజం మీద తువ్వాళ్ళు వేసుకుని వెళ్తుంటారు కదా, అవి వాళ్ళ పక్కనుండి బండి నడుపుతూ లాగేసేవాల్లము. వాళ్ళు వెనకనుండి ఓ, అబ్బాయ్యో నా కండువా అని అరుస్తుండేవాళ్ళు, మేము నవ్వుకుంటూ వెళ్ళిపోయాము. పెళ్లి దగ్గరకు వెళ్లేసరికి అవి మొత్తం 20 పైనే అయ్యాయి. పెళ్లి తెల్లవారుజామున. భోజనాలు చేసి, పెళ్లి చూసి తిరుగు ప్రయాణం కోటిపల్లి మీదుగా వెళ్దామని, ముక్తేశ్వరం రేవు దగ్గరకి చేరాము. అప్పుడు తెల్లవారుజాము 4 అయ్యింది. పడవ వెలుగు వస్తే కానీ వెయ్యడు. మొత్తం 10 మంది ఫ్రెండ్స్ ఉన్నాము, ఆ వయసులో 10 మంది ఒకచోట చేరితే ఎలా వుంటుందో ఊహించండి. గోల గోల గా ఉన్నాము. వెలుతురు వచ్చింది, బళ్ళు పడవలో పెట్టి అందరం ఎక్కి కూర్చున్నాము. మాటల్లో నేను ఒరేయ్, ఇవ్వాల్టినుండి మన బాబాయ్ పిన్ని కాళ్ళు వత్తడమే పని కింద పెట్టుకుంటాడేమో అన్నాను. అప్పుడు, పడవలోనే కూర్చున్న ఒక పల్లె అతను అయ్యా రాజుగారు, చిన్నోడ్ని నేను చెపుతున్నానని ఏమీ అనుకోకపోతే ఒక మాట చెప్పనా అన్నాడు. నేను నాకంటే వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళని వాళ్ళు చిన్నవాళ్ళు అనుకొంటే  సిగ్గు అనిపిస్తుంది.  వాళ్ళ వయసు యొక్క అనుభవం, ఎదుటివాళ్ళ ఆర్ధిక పరిస్థితి ని చూసి చిన్న బుచ్చుకుంటుంటే బాధ అనిపిస్తుంది. మా ఆఫీస్ లో, బూరా సాయిలు అని ఒక మజ్దూర్ ఉండేవాడు. అతను మాట్లాడితే నీ బాంచన్ దొరా, కాల్మొక్తా చాయ్ కి డబ్బులియ్యవే అనేవాడు. అది వింటే నాకు చాలా సిగ్గేసేది. ఎందుకంటే అతను నా తండ్రి కంటే కూడా పెద్దవాడు. నేను చాలా సార్లు తిట్టాను, నువ్వు నాకంటే పెద్దవాడివి, డబ్బులు మాములుగా అడుగు, అలా అడగకు అని. అయినా వినేవాడు కాదు. నేను వెంటనే పల్లె అతనితో పెద్ద వాడివి, నువ్వు చెపితే మాకే మంచిది కదా చెప్పు అన్నాను. అప్పుడు అతను, అయ్యా, ఏ మొగోడైనా సరే, వాడి ఇంటి గుట్టు పెళ్ళాం దగ్గర విప్పితే ఇక ఆ రోజు నుండి వాడు పెళ్ళాం కాళ్ళు ఒత్తవలసిందే, నా పెళ్ళామే కదా అని అనుకున్నాడా వాడి పని అయ్యిపోయినట్టే, మనల్ని లోకువ పట్టేస్తుంది, అదే మనమైతే పెళ్ళాం తరపు వాళ్ళ గురించి ఏమి తెలిసినా మాట్లాడము, ఆడదానికి, మొగోడికి తేడా అదే అన్నాడు. నిజంగా జీవిత సత్యం ఎంత సిపులుగా చెప్పాడు.

2004 లో నేను షాద్ నగర్ లో పెస్టిసైడ్ డిస్ట్రిబ్యూషన్ షాప్ పెట్టినప్పుడు ఒక రోజు ఒక చిన్న రైతు నా షాప్ కి వచ్చాడు. అతనికి కావలసిన పురుగు మందులు ఇచ్చేసాకా మాటల్లో అతను మీ ఆంధ్రా వాళ్ళు అన్నాడు. నేను అదేమిటయ్యా ఆంధ్రా వాళ్ళు వచ్చాకే కదా మీ పొలాల రేట్లు పెరిగాయి, ఇంతకు ముందు మీరు 5, 10 వేలకి అమ్ముకునే పొలాలు ఇప్పుడు లక్ష కి అమ్ముతున్నారు కదా అన్నాను. వెంటనే అతను మీరు కూడా అలా అంటారేమిటండీ మీరు అమ్ముకునేవాళ్ళ గురించే మాట్లాడుతున్నారు, నాకులా రూపాయి, రూపాయి పోగేసుకొని కొద్ది కొద్దిగా కొనుక్కునే వాళ్ళ గురించి ఆలోచించరా అన్నాడు. ఎందుకంటే నేను వాళ్లకి చాలా తక్కువ, ఒకోసారి వాళ్ళ పరిస్థితి బాగాలేకపోతే అసలు లాభం వేసుకోకుండా అమ్మేవాడిని. అప్పటికే నన్ను చాలా మంది ముంచేశారు. కాబట్టి వీళ్ళకి లాభం లేకుండా ఇవ్వడం నాకు పెద్ద బాధ అనిపించేది కాదు. నన్ను డబ్బున్నవాల్లె ముంచేశారు. వీళ్ళకి ఇవ్వడం వలన ఒక డబ్బులేనివాడికి సాయం చేసునట్టు వుంటుంది, ఇంతకాలం డబ్బున్నవాల్లకి పెట్టి కదా ఈ స్థితి కి వచ్చాను, వీళ్ళ దగ్గర నాకు పోయేదేమిటిలే అనుకునేవాడిని. దాని వలన షాద్ నగర్ లో సర్వస్వం కోల్పయాను అది వేరే విషయం అనుకోండి. అందుకనే ఇంత తీరిగ్గా బ్లాగ్స్ రాస్తున్నాను.

అందుకనే  అతను "మీరు కూడా" అన్నాడు. నిజంగా అతను చెప్పింది నూటికినూరు పాళ్ళూ కరెక్ట్. ఎందుకంటే మనమందరమూ నాణేనికి ఒక వైపే చూస్తున్నాము. రెండో వైపు నిజం చాలా భయంకరం గా వుంటుంది. మన వలన భూమి రేటు పెరిగింది అనుకుంటున్నాము కానీ, అది నిజంగా వ్యవసాయం చేసేవాడికి దక్కకుండా పోతోంది అనేది ఆలోచించడం లేదు. మనం రేటు రాగానే దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేస్తున్నాము. ఈ రోజు చూడండి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా మనకి పొలాలు కనిపిస్తున్నాయా. ఇప్పుడు ఆ బక్క రైతు ఎలా ఉన్నాడో, అతని పొలం ఉంచుకున్నాడో, ఈ రేట్స్ కి ఆశపడి అతను కూడా అమ్మేసుకున్నాడో? ఎందుకంటే అతను డబ్బులు జాగ్రత్త చేసుకొని కొద్ది కొద్ది గా పొలం కొనుక్కుంటూ, అప్పటికి దానిని 4 ఎకరాలు చేసుకున్నాడు.

పండించే రైతు కి అందుబాటు ధరల్లో పొలం దొరకడం లేదు. మనం భూమి ని విలువని బట్టి చూస్తున్నాము, కానీ రైతు పంటని బట్టి చూస్తాడు. అదే రైతు కి మనకి తేడా. మహారాష్ట్ర, యూ.పి. లలో లాగ మనదగ్గర కూడా పొలం అనేది రైతు కి మాత్రమే రిజిస్టర్ చేసే విధానం వస్తే మన లాంటి రాబందులు పొలాల జోలికి వెళ్ళకుండా వుంటాయి.

పూర్వం మన పెద్దవాళ్ళు భూమిని ఎవరికైనా చూపించేటప్పుడు "మనది" అనేవారు, నాది అని ఎప్పుడూ అనేవారు కాదు. భూమిని ఎప్పుడూ, నాది అనకూడదంట, మనదీ అనాలంట.

మొన్న జై రాం రమేష్ గారు, నేడు సౌగత రాయ్ గారు

మొన్న జై రాం రమేష్ గారు, నేడు సౌగత రాయ్ గారు మార్కెట్ శక్తులు భారత దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో వెల్లడించారు. ఇవేమైనా మనం అర్థం చేసుకుంటున్నామా? వీటివలన మధ్యతరగతి, దిగువమద్యతరగతి ప్రజలు ఎలా నాశనం అవుతున్నారో అర్ధం చేసుకోండి.

ఈ రోజు ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్ కనిపిస్తోంది. ఒక పల్లెటూరిలో కూలిపని చేసుకొని, రోజుకు వంద రూపాయలు (అది కూడా పని దొరికిన రోజు మాత్రమే) సంపాదించుకొనే వ్యక్తి ఈ ఫోన్ వలన ఎలా నష్టపోతున్నాడో చూడండి. వాడు కూలి పని చేసి ఇంటికి వచ్చేసరికి వాడి దగ్గర వున్న ఫోన్ మోగుతుంది. పక్క నున్న చిన్న పట్టణం నుండి కాయిన్ బాక్స్ నుండి, వాడి స్నేహితుడు ఒరేయ్ కొత్త సినిమా వచ్చింది వెంటనే రమ్మంటాడు. వీడు తయారయ్యి షేర్ ఆటో ఎక్కి అక్కడకి వెళతాడు. ఇద్దరు కలసి చెరో క్వార్టర్ వేసి, సినిమా చూసి బిర్యాని తిని ఇళ్ళకు వెళ్ళిపోతారు. అంటే ఆ రోజు వాళ్ళ సంపాదన లో ఆటో కి 10, మందుకు 40, సినిమాకి 25, బిర్యానీకి 40 మొత్తం 115 రూపాయలు, మళ్ళీ వాళ్ళు ఇంటికెళ్ళి తాగిన మత్తులో పెళ్ళాం ని తన్నిన తాపులు. ఈ సెల్ ఫోన్ నిజంగా అవసరానికి ఉపయోగపడే దానికంటే కూడా వాడి జీవన విధానాన్ని నాశనం చెయ్యడానికే ఎక్కువ ఉపయోగపడుతోంది. అదే వీడికి ఈ ఫోన్ లేకపోతే ఉన్న ఊరిలో దొరికే పది రూపాయల కల్లు తాగి పడుకుంటాడు.

ఈ విషయం చదివిన మేధావులు ఒక ప్రశ్న అడగవచ్చు, వాడు ఫోన్ కొనుక్కోవడం తప్పా అని. కొనడం తప్పు అని ఎవరూ అనరు. కాకపొతే దానివలన జరిగే నష్టం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో ఇండియా టుడే వాళ్ళు ఒక కధనం వ్రాసారు. అందులో ఒక చేపల రైతు నాకు సెల్ ఫోన్ వచ్చాకా మార్కెట్ రేటు ని బట్టి నేను చేపలు పడుతున్నాను అని చెప్పినట్టు వ్రాసారు. ఎంత మూర్ఖత్వమంటే, చేపలు పట్టాలంటే పట్టుబడికి ముందు 4 రోజులు వాటికి మేత వేయరు, ఇక్కడ చేపలు పట్టాకా ఇక్కడ నుండి కలకత్తా వెల్లడానికి 3 రోజులు పడుతుంది. అంటే తక్కువలో తక్కువ గా 7 రోజులు. అప్పటికి ఆ రేట్ ఉంటుందా? వీడు రాసింది ఎలా వుందంటే, నాకు ఒరేయ్ ఈ రోజు రేట్ బాగుంది అని ఫోన్ రాగానే, నేను వెంటనే చిటికెలో చేపలు పట్టేసి, అర చిటికెలో మార్కెట్కి పంపేసి, లారీ తో డబ్బులు తెచ్చేసుకున్నట్టు గా ఉంది.

అంటే డెవలెప్మెంట్ వద్దని ఎవరూ అనరు. కానీ అది ఎంతవరకు అవసరం అనేది కూడా చూడాలి కదా. అంటే ఎవరు చూడాలి? ఇదొక ప్రశ్న. ఇదేమి నిత్యావసర వస్తువు కాదు, ఇంత చవగ్గా దొరకవలసిన పని లేదు. దీని రేటు ఎక్కువైతే నిజంగా ఎవరికి అవసరమో వాళ్ళే కొనుక్కుంటారు. అందరిని చూడవలసిన భాద్యత ప్రభుత్వానిది కాదు అని మీరంటారు నాకు తెలుసు. నిజమే, మరి మనం కల్లుమూసుకుపోయి, షేర్ మార్కెట్ లో పెళ్ళాల తాళ్ళు కూడా తాకట్టుపెట్టి కనీస ఆలోచన లేకుండా 10 ని 500 పెట్టి కొని హర్షద్ మెహతా ల దెబ్బకి, ఖుదేలుమన్నప్పుడు మనం ప్రభుత్వాన్నే తిట్టాము. అంతో ఇంతో చదువుకున్న మనమే మనకి నష్టం వచ్చేసరికి ప్రభుత్వాన్ని తిడతాము కదా, మరి అదే భాద్యత ఒక సామాన్యుడి మీద కూడా ప్రభుత్వానికి వుండాలి కదా? ఈ సెజ్ ల పేరు చెప్పి ఎంతమంది రైతులు రైతు కూలీలుగా మారేరో మనం చదువుతూనే ఉన్నాము.  చాలా మంది నా మిత్రులు నాతో వాదించుతారు. వాళ్లకి మార్కెట్ రేటు కంటే ఎక్కువే వచ్చింది అని, నిజమే కావచ్చు కానీ వాళ్ళు దానిని అమ్ముకోకుండా వుంటే పది మందీ తిడతారన్న భయంతోనన్నా పండిన పంటలో ఇంట్లో తినడానికి 20 బస్తాల బియ్యం వుంచి మిగిలింది తాగేస్తాడు. ఇంట్లో వాళ్లకి కనీసం తినడానికి బియ్యం అన్నా ఉండేవి. కానీ ఇప్పుడు, వచ్చిన డబ్బులు ఏదో వ్యాపారం లో పెట్టి మునిగిపోయి, లేకపోతే తాగేసి నాశనం అయ్యిపోయి రోడ్డు మీద పడుతున్నారు.

అందుకనే మన పెద్దలు ఎవరికి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే అందాలి అని అంటారు.