ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Wednesday, January 19, 2011

మన దేవాలయాలు.

భవద్గీత లో లేనిది ఎందులోనూ లేదనే దానిని నేను గాడంగా నమ్ముతాను. కాకపొతే దానిని మనం అర్థం చేసుకొనే దానిని బట్టి ఉంటుంది. మొదటిసారిగా నేను గీతను 1979 గోదావరి పుష్కరాలలో టి.టి.డి. షాపులో ఒక్కొక్కటి రూపాయి చొప్పున రెండు కొన్నాను. దాని వ్యాఖ్యాత శ్రీ. శిష్ట్లా సుబ్బారావు గారు. అవి రెండూ మా ఇద్దరక్కలకి ఇచ్చాను. తరువాత నేను సింగరేణి ఉద్యోగంలో చేరాకా మా పెద్దక్క దగ్గర ఉన్నదానిని తెచ్చుకున్నాను.

ఎందుకంటే నాకు మళ్ళీ శిష్ట్లా వారిది 2007 దాకా దొరకలేదు. నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా అడిగేవాడిని. ఎప్పుడూ ఆయన రాసిన గీత దొరకలేదు. 2007 లో పని మీద విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ టి.టి.డి. కళ్యాణమండపంలో బుక్ ఫెయిర్ జరుగుతుంటే అక్కడ దొరుకుతుందేమోనని లోపలకు వెళితే, అదృష్టం కొద్దీ వీరు వ్రాసిన గీత ఉంది. వెంటనే 10 పుస్తకాలు కొన్నాను. అక్కడ మొత్తం 15 ఉన్నాయి. అన్నీ నేను తీసుకుంటే తరవాత వాళ్లకు దొరకవని పదీ తీసుకునివచ్చేసాను. తరువాత వైజాగ్ లో చూస్తే అక్కడా ఉన్నాయి, మళ్ళీ ఇంకో పది తీసుకున్నాను. ఇవి అన్నీ నేను కుర్రవాళ్ళకి ఇచ్చి, దానిని ఒక నవల అనుకుని చదవమంటాను. అంతే తప్ప అది ఒక ఆద్యాత్మిక గ్రంధం అనుకోవద్దంటాను. అది చదివితే ఇంకే సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్సూ చదవక్కరలేదు. క్రితం వారమే నా దగ్గర ఉన్నవి అన్నీ అయిపోతే, లిబర్టీ దగ్గర ఉన్న టి.టి.డి. కళ్యాణమండపానికి వెళ్లి అడిగితే, అసలు ఇక్కడ పుస్తకాలే అమ్మడం లేదన్నాడు. వెంటనే దాని చరిత్ర పేపర్లో చదివినది గుర్తుకు వచ్చి మందూ, అమ్మాయిలూ దొరుకుతారా అందామనుకున్నాను. మన టి.టి.డి. వారి శ్రద్ద అలాగుంది.

అసలు ఎండోమెంట్స్ డిపార్ట్ మెంటే అలాఉంది. మీరు ఏ గుడికి వెళ్ళినా మీకు స్థల పురాణం దొరకదు. దొరికినా అది గ్రాంధికం లో ఉంటుంది కానీ వ్యవహారిక బాషలో ఉండదు. అది రాసిన వాడి పాండిత్యం మనకవసరమా? నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు కొంటే అది గ్రాంధికంలో ఉంది. అక్కడ ఒక లెటర్ పెట్టి వచ్చేసా. కదిరి నరసింహ స్వామి గుళ్ళో అయితే, నేను రెండు సార్లు వెళ్ళినప్పుడూ దొరకలేదు, అక్కడా లెటర్ పెట్టి వచ్చేసా. ఈ సారి వెళ్లినప్పుడన్నా దొరుకుతుందేమో చూడాలి. అసలు మనకు ఏ గుళ్లోను స్థలపురాణం దొరకదు.

మీరు ఈ సారి ఎప్పుడైనా ఏదైనా ప్రసిద్ధి చెందిన గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, అక్కడ పూజారి జీతం కంటే కూడా అక్కడ ఎండోమెంట్స్ తరుపున పనిచేసే వాచ్ మన్ జీతం ఎక్కువ ఉంటుంది. గుడి కయ్యే ఖర్చు కంటే వీళ్ళ జీతాల ఖర్చే ఎక్కువుంటుంది. మనం హుండీలో వేసేది వీళ్ళని పోషించడానికే. అసలు పూజారి నిత్య దరిద్రం లోనే ఉంటాడు. మనువు చెప్తాడు. బ్రాహ్మనుడుకి ఆస్తి, వైశ్యుడుకి దరిద్రం ఉండకూడదు అని. ఎందుకంటే విద్య నేర్పే వాడికి ఆస్తి ఉంటే విద్యని వ్యాపారం చేస్తాడని. అతని అవసరాలన్నీ గ్రామస్తులే చూసుకోవాలి. అతనికి డబ్బు అవసరం కలగకుండా చూసుకొనే బాద్యత గ్రామానిదే. అప్పుడు అతను డబ్బు మీద ఏవ లేకుండా విద్యని ఉచితంగా నేర్పిస్తాడు. అలాగే వైశ్యుడుకి దరిద్రం ఉంటే గ్రామానికి కావలసిన వస్తువులు ప్రక్కవూరి నుండి తీసుకురాలేడు. దేవాలయంలో పూజారికి దరిద్రం ఉంటే ఆయన ఇంక దేముడికి ఏమి సేవ చేయగలడు? కానీ ఇప్పుడు మీరు చూడండి, ఏవో కొన్ని గుళ్ళల్లో తప్పితే చాలా చోట్ల వాళ్ళ జీతాలు మూడు అంకెలు దాటడం లేదు.

మణుగూరు లో మా కాలనీ లో ఉన్న రామాలయంలో అయితే ఒక టైంలో పూజారి ఇంటి ప్రక్కనే వాచ్ మన్ కి ఇల్లు ఇచ్చారు. అదేమిటి అని నేను అడిగితే ఏమైంది అన్నారు. అదే మా దగ్గర A,B క్వార్టర్స్ కి కొంచం దూరంలో C టైపు, వీటికి మూడు కిలోమీటర్ల దూరంలో D టైపు కట్టారు. అంటే నువ్వు కేడర్ మెయిన్ టెన్ చేస్తావు, కానీ గుళ్ళో పూజారికి మాత్రం వాచ్ మన్ పక్కనే ఇల్లు ఇస్తావు. అదీ మన పూజారుల పరిస్థితి. గుడి విషయాలలో పూజారి ప్రమేయం ఉండకూడదంట. ఇంక మన దేవాలయాలు ఏమి బాగుపడతాయి.

గుళ్ళోకి వెళ్ళాలంటే టిక్కెట్. ధర్మ దర్శనం అన్ని వేళలా ఉండదు. ఒకసారి, ఒక వెధవ అమెరికాలో గ్రీన్ కార్డ్ కి అప్ప్లై చెయ్యడానికి బర్త్ సర్టిఫికేట్ మీద తల్లి పేరు ఉండాలి అంటే అది తీసుకోవడానికి భద్రాచలం అవతలకి వెళ్లాను. వెళుతూ కూడా ప్రక్కనే ఉంటాడు అని మా వల మనిషిని తీసుకువెల్లాను. దారిలో పర్ణశాల చూద్దామంటే అక్కడకు తీసుకువెల్లాను. సరిగ్గా అప్పుడే శ్రీకాకుళం నుండి బస్సు వచ్చి ఆగింది. అందులోనుండి పాపం లేబర్ దిగారు. వాళ్ళు, ఏదో ఒక్కో రూపాయీ దాసుకొని దేముడు దగ్గర కొస్తే వాళ్ళని టిక్కెట్ తీసుకోమన్నాడు. నేను, నా దగ్గర కొస్తే డబ్బులు ఇస్తాను అని ఆ దేముడంటుంటే, నా దగ్గరకొస్తే డబ్బులివ్వాలి అని ఈ దేముదంటున్నాడు అని గొడవపెట్టుకొంటే, అతను సార్ మీరు డబ్బులివ్వక్కరలేదు వెళ్లి దర్శనం చేసుకోండి అన్నాడు, నేను కోపంతో ఉచిత దర్శనం ఎప్పుడో చెప్పు అప్పుడే వెళతాను, లేకపోతే అసలు వెళ్ళనే వెళ్ళను అని, నేను వెళ్ళకుండా మా మనిషి ని పంపాను. తరువాత ఏలూరు వచ్చి విశ్వ హిందూ పరిషద్ ఆఫీస్ కి వెళ్లి ఈ విషయం చెప్పి మనం ఏమీ చెయ్యలేమా అని అడిగాను. వాళ్ళు మీరు రేపు రండి, ఎదురుగుండానే ఎండోమెంట్స్ ఆఫీస్, రేపు మినిస్టర్ వస్తున్నారు, మాట్లాడుదాము అన్నారు. నేను వరసగా రెండు రోజులు వెళ్లాను. అసలు మినిస్టర్ రానేలేదు.

స్పెషల్ దర్శనం వద్దని ఎవరూ అనరు. కానీ ఉచిత దర్శనం అన్ని వేళల్లోనూ ఉండాలి. అవసరం ఉన్నవాడు స్పెషల్ దర్శనానికి వెళతాడు, లేని వాడు ఉచిత దర్శనానికి వెళతాడు.

5 comments:

  1. నువ్వు వ్రాసినవన్నీ బంగారు మాటలు. చాలా బాగా వ్రాస్తునావు. నువ్వు ఎంతో ఎదిగావు. నీ మీద నాకు అభిమానం మరియు గౌరవం పెరిగాయి. వీలైతే ఫోన్ చెయ్యి 9949006367. అదిత్యం

    ReplyDelete
  2. బాగా చెప్పారు... గుళ్ళ పరిస్థితి ఏనాడో చేజారిపోయింది. నేనయితే గుడికి వెళ్ళటానికే భయపడతాను...ఎప్పుడో కానీ వెళ్ళను. పోయిన ఏదాడి ' వైకుంఠ ఏకాదశి రోజున జరిగిన అనుభవం తో ఈ సారి వెళ్ళనే లేదు... ఇంట్లోనే మహానారాయణోపనిషత్ , ఆరణ్యకము పారాయణ చేసుకున్నాను. నన్నడిగితే ప్రతి ఒకరూ ఏదో ఒకటి నేర్చుకుని ఇంట్లోనే పూజలు చేస్తూ , గుడికి వెళ్ళడం తగ్గించాలి. అదొక్కటే పరిష్కార మార్గం ..

    ReplyDelete
  3. మా బ్రతుకుల్ని మీరైనా అర్థం చేసుకున్నారు క్రుతఙ్ఞతలు. నేనుఖర్మ కొద్దీ శర్మ నే.

    ReplyDelete
  4. మీరు చెప్పింది అక్షరాలా సత్యం. ధర్మానికి నిలయాలు దేవాలయాలు అని అందరూ అంటారు కానీ ధర్మం ఎక్కడుందీ అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. దేవుని దృష్టిలో అందరూ సమానమేనని అంటారు. కాని కొందరే సమానం అనేలా వుంది నేటి దేవాలయాల పరిస్థితి. మానవులంతా సమానమేనంటారు కానీ కొంచెం ఎక్కువ సమానంగా వున్నవారు మాత్రం సెలబ్రిటీలు, రాజకీయ నాయకులూనూ.

    ReplyDelete