ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Sunday, January 9, 2011

మీరు అమ్ముకునేవాళ్ళ గురించే మాట్లాడుతున్నారు

ఒక్కొక్కసారి మన ఆలోచనా విధానం ఎంత తప్పుగా ఉంటుందో, మనం చాలా సామాన్యులు (ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే లేబర్) అనుకునే వాళ్ళ దగ్గర నుండే తెలుస్తుంది.

1985 లో అనుకుంటా, ఒకసారి నేను లీవ్ మీద కాకినాడ వెళ్ళినప్పుడు, మా ఫ్రెండ్ పెళ్లి ఉంటే  ఫ్రెండ్స్ అందరం కలసి బైక్స్ మీద అమలాపురం వెళ్ళాము. అప్పుడు ఎదురులంక బ్రిడ్జి లేదు. రావులపాలెం మీదుగా వెళ్ళవలసిందే. నాలుగు బళ్ల మీద వెళ్ళాము. దారిలో పల్లెటూర్లల్లో రైతులు భుజం మీద తువ్వాళ్ళు వేసుకుని వెళ్తుంటారు కదా, అవి వాళ్ళ పక్కనుండి బండి నడుపుతూ లాగేసేవాల్లము. వాళ్ళు వెనకనుండి ఓ, అబ్బాయ్యో నా కండువా అని అరుస్తుండేవాళ్ళు, మేము నవ్వుకుంటూ వెళ్ళిపోయాము. పెళ్లి దగ్గరకు వెళ్లేసరికి అవి మొత్తం 20 పైనే అయ్యాయి. పెళ్లి తెల్లవారుజామున. భోజనాలు చేసి, పెళ్లి చూసి తిరుగు ప్రయాణం కోటిపల్లి మీదుగా వెళ్దామని, ముక్తేశ్వరం రేవు దగ్గరకి చేరాము. అప్పుడు తెల్లవారుజాము 4 అయ్యింది. పడవ వెలుగు వస్తే కానీ వెయ్యడు. మొత్తం 10 మంది ఫ్రెండ్స్ ఉన్నాము, ఆ వయసులో 10 మంది ఒకచోట చేరితే ఎలా వుంటుందో ఊహించండి. గోల గోల గా ఉన్నాము. వెలుతురు వచ్చింది, బళ్ళు పడవలో పెట్టి అందరం ఎక్కి కూర్చున్నాము. మాటల్లో నేను ఒరేయ్, ఇవ్వాల్టినుండి మన బాబాయ్ పిన్ని కాళ్ళు వత్తడమే పని కింద పెట్టుకుంటాడేమో అన్నాను. అప్పుడు, పడవలోనే కూర్చున్న ఒక పల్లె అతను అయ్యా రాజుగారు, చిన్నోడ్ని నేను చెపుతున్నానని ఏమీ అనుకోకపోతే ఒక మాట చెప్పనా అన్నాడు. నేను నాకంటే వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళని వాళ్ళు చిన్నవాళ్ళు అనుకొంటే  సిగ్గు అనిపిస్తుంది.  వాళ్ళ వయసు యొక్క అనుభవం, ఎదుటివాళ్ళ ఆర్ధిక పరిస్థితి ని చూసి చిన్న బుచ్చుకుంటుంటే బాధ అనిపిస్తుంది. మా ఆఫీస్ లో, బూరా సాయిలు అని ఒక మజ్దూర్ ఉండేవాడు. అతను మాట్లాడితే నీ బాంచన్ దొరా, కాల్మొక్తా చాయ్ కి డబ్బులియ్యవే అనేవాడు. అది వింటే నాకు చాలా సిగ్గేసేది. ఎందుకంటే అతను నా తండ్రి కంటే కూడా పెద్దవాడు. నేను చాలా సార్లు తిట్టాను, నువ్వు నాకంటే పెద్దవాడివి, డబ్బులు మాములుగా అడుగు, అలా అడగకు అని. అయినా వినేవాడు కాదు. నేను వెంటనే పల్లె అతనితో పెద్ద వాడివి, నువ్వు చెపితే మాకే మంచిది కదా చెప్పు అన్నాను. అప్పుడు అతను, అయ్యా, ఏ మొగోడైనా సరే, వాడి ఇంటి గుట్టు పెళ్ళాం దగ్గర విప్పితే ఇక ఆ రోజు నుండి వాడు పెళ్ళాం కాళ్ళు ఒత్తవలసిందే, నా పెళ్ళామే కదా అని అనుకున్నాడా వాడి పని అయ్యిపోయినట్టే, మనల్ని లోకువ పట్టేస్తుంది, అదే మనమైతే పెళ్ళాం తరపు వాళ్ళ గురించి ఏమి తెలిసినా మాట్లాడము, ఆడదానికి, మొగోడికి తేడా అదే అన్నాడు. నిజంగా జీవిత సత్యం ఎంత సిపులుగా చెప్పాడు.

2004 లో నేను షాద్ నగర్ లో పెస్టిసైడ్ డిస్ట్రిబ్యూషన్ షాప్ పెట్టినప్పుడు ఒక రోజు ఒక చిన్న రైతు నా షాప్ కి వచ్చాడు. అతనికి కావలసిన పురుగు మందులు ఇచ్చేసాకా మాటల్లో అతను మీ ఆంధ్రా వాళ్ళు అన్నాడు. నేను అదేమిటయ్యా ఆంధ్రా వాళ్ళు వచ్చాకే కదా మీ పొలాల రేట్లు పెరిగాయి, ఇంతకు ముందు మీరు 5, 10 వేలకి అమ్ముకునే పొలాలు ఇప్పుడు లక్ష కి అమ్ముతున్నారు కదా అన్నాను. వెంటనే అతను మీరు కూడా అలా అంటారేమిటండీ మీరు అమ్ముకునేవాళ్ళ గురించే మాట్లాడుతున్నారు, నాకులా రూపాయి, రూపాయి పోగేసుకొని కొద్ది కొద్దిగా కొనుక్కునే వాళ్ళ గురించి ఆలోచించరా అన్నాడు. ఎందుకంటే నేను వాళ్లకి చాలా తక్కువ, ఒకోసారి వాళ్ళ పరిస్థితి బాగాలేకపోతే అసలు లాభం వేసుకోకుండా అమ్మేవాడిని. అప్పటికే నన్ను చాలా మంది ముంచేశారు. కాబట్టి వీళ్ళకి లాభం లేకుండా ఇవ్వడం నాకు పెద్ద బాధ అనిపించేది కాదు. నన్ను డబ్బున్నవాల్లె ముంచేశారు. వీళ్ళకి ఇవ్వడం వలన ఒక డబ్బులేనివాడికి సాయం చేసునట్టు వుంటుంది, ఇంతకాలం డబ్బున్నవాల్లకి పెట్టి కదా ఈ స్థితి కి వచ్చాను, వీళ్ళ దగ్గర నాకు పోయేదేమిటిలే అనుకునేవాడిని. దాని వలన షాద్ నగర్ లో సర్వస్వం కోల్పయాను అది వేరే విషయం అనుకోండి. అందుకనే ఇంత తీరిగ్గా బ్లాగ్స్ రాస్తున్నాను.

అందుకనే  అతను "మీరు కూడా" అన్నాడు. నిజంగా అతను చెప్పింది నూటికినూరు పాళ్ళూ కరెక్ట్. ఎందుకంటే మనమందరమూ నాణేనికి ఒక వైపే చూస్తున్నాము. రెండో వైపు నిజం చాలా భయంకరం గా వుంటుంది. మన వలన భూమి రేటు పెరిగింది అనుకుంటున్నాము కానీ, అది నిజంగా వ్యవసాయం చేసేవాడికి దక్కకుండా పోతోంది అనేది ఆలోచించడం లేదు. మనం రేటు రాగానే దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేస్తున్నాము. ఈ రోజు చూడండి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా మనకి పొలాలు కనిపిస్తున్నాయా. ఇప్పుడు ఆ బక్క రైతు ఎలా ఉన్నాడో, అతని పొలం ఉంచుకున్నాడో, ఈ రేట్స్ కి ఆశపడి అతను కూడా అమ్మేసుకున్నాడో? ఎందుకంటే అతను డబ్బులు జాగ్రత్త చేసుకొని కొద్ది కొద్ది గా పొలం కొనుక్కుంటూ, అప్పటికి దానిని 4 ఎకరాలు చేసుకున్నాడు.

పండించే రైతు కి అందుబాటు ధరల్లో పొలం దొరకడం లేదు. మనం భూమి ని విలువని బట్టి చూస్తున్నాము, కానీ రైతు పంటని బట్టి చూస్తాడు. అదే రైతు కి మనకి తేడా. మహారాష్ట్ర, యూ.పి. లలో లాగ మనదగ్గర కూడా పొలం అనేది రైతు కి మాత్రమే రిజిస్టర్ చేసే విధానం వస్తే మన లాంటి రాబందులు పొలాల జోలికి వెళ్ళకుండా వుంటాయి.

పూర్వం మన పెద్దవాళ్ళు భూమిని ఎవరికైనా చూపించేటప్పుడు "మనది" అనేవారు, నాది అని ఎప్పుడూ అనేవారు కాదు. భూమిని ఎప్పుడూ, నాది అనకూడదంట, మనదీ అనాలంట.

2 comments:

  1. మనమందరమూ నాణేనికి ఒక వైపే చూస్తున్నాము. రెండో వైపు నిజం చాలా భయంకరం గా వుంటుంది....

    ReplyDelete