ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, January 22, 2011

నా రూపాయికి కూడా వంద పైసలే.

నేను మొన్న మణుగూరు వెళుతుంటే, బస్సు సూర్యాపేట దగ్గర టీ గురించి ఆపాడు. నేను కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతాను. వీడు బాదేస్తాడులే అనుకుంటూ లోపలకు వెళ్లాను. ఎందుకంటే ఆ హోటల్ చూడగానే, నాకు యండమూరి డబ్బు 2 ది పవర్ ఆఫ్ డబ్బు లో వ్రాసింది గుర్తుకువచ్చింది. అర్థ రూపాయి అప్పడాన్ని అద్దాల బీరువాలో పెట్టి ఐదు రూపాయలకి అమ్మడం అంటాడు ఆయన. అనుకున్నట్టే వాడు శుభ్రం గా ఒక పేపర్ గ్లాస్ లో పట్టిచ్చి 23 రూపాయలన్నాడు. గ్లాస్ తీసుకొని త్రాగుతూ, మళ్ళీ కౌంటర్ దగ్గరకెళ్ళి టీ ఎంత అన్నాను. సరిగ్గా అప్పుడే ఒకాయన టీకని 10 రూపాయల కాగితం తీస్తున్నాడు. వీడు 21 అన్నాడు. వెంటనే ఆయన "ఆ" అనేసి డబ్బులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు.అంటే స్టార్ రేట్స్ అన్నమాట అని, (నేను గోదావరి జిల్లావాడిని, పెరిగింది తెలంగాణా లో నేమో నాకు రెండు ఏరియాల బూతులు చాలా అలవోకగా వచ్చేస్తాయి) వీళ్ళు మన ..............నికి ఇక్కడ ఆపుతారు అని గ్లాస్ తీసుకొని బయటకు వచ్చేసాను. ఎందుకంటే వాడు టీని, రాత్రుళ్ళు రోడ్ మీద స్టీల్ కేరియర్ లో పెట్టి అమ్ముతారు చూడండి, అలాంటి దాంట్లోంచి తీసి అందమైన పేపర్ గ్లాస్లో పోసి ఇస్తున్నాడు. సరే బాత్రూం కెల్దామని వెళితే అందులో సేన్సార్స్ పనిచెయ్యడం లేదు. కోక డాబు అంటారు చూడండి అలా ఉంది.

ఇక్కడ మనం ఒక విషయం గుర్తుకుతెచ్చుకోవాలి. మన రాష్ట్రాన్ని ఇంతకు ముందు పరిపాలించిన దేముడు డాక్టర్. కార్పోరేట్ హాస్పిటల్స్ ని బ్రతికించడానికి ఆరోగ్యశ్రీ అనే పదకాన్ని పెట్టాడు. కానీ బస్సు స్టాండ్స్ బాత్రూమ్స్ లో నీళ్ళ గురించి పట్టించుకోడు. హెపటైటిస్ బి అనేది పబ్లిక్ టాయిలెట్స్ ద్వారా విపరీతం గా స్ప్రెడ్ అవుతుందని ఆయనకు తెలియదు అనుకోము. ఆయనే కాదు హైదరాబాద్ ని విపరీతంగా డెవెలప్ చేసాను అని చెప్పుకొనే నారా వారు కూడా ఈ విషయం మరచిపోయారు. 4.39 బిలియన్ రూపాయలు ఖర్చుపెట్టి ఎయిర్ పోర్ట్ కి ఎలివేటేడ్ రోడ్ వేస్తాము కానీ సామాన్యుడు వాడుకొనే బస్సు స్టాండ్స్ లో ఉన్న టాయిలెట్స్ లో నీళ్ళు ఎరేంజ్ చేయలేము. అంటు రోగాలతో పోయేది సామాన్యుడే కదా. మన దేశంలో సామాన్యుడి ప్రాణానికి విలువ లేదు కదా.

అది పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాము. నేను వచ్చి బస్సు దగ్గర నిలబడ్డాను. ఈ లోపు అందమైన పేపర్ గ్లాస్ లో టీ తాగుతూ డ్రెవర్ వచ్చాడు. అతని దగ్గరకెళ్ళి బాబూ, ఇక్కడ ఆపమని మీ ఓనర్ చెప్పాడా, లేక మీరే ఆపుతున్నారా అని అడిగా. ఎందుకంటే మొత్తం ప్రైవేట్ బస్సు లన్నీ అక్కడే ఆగుతున్నాయి. అతను, లేదుసార్ ఇక్కడ శుభ్రం గా ఉంటుందని మేమే ఆపుతున్నాము అన్నాడు. ఏమయ్యా డబ్బులిచ్చి తాగేటట్టైతే నువ్వు ఇక్కడ తాగుతావా అని అడిగా. లేదండి అన్నాడు  బాబూ నీ రూపాయికే కాదు నా రూపాయికి కూడా వంద పైసలే, ఎవడెలాపోతే నాకెందుకు, నాకు ఫ్రీ గా వస్తే చాలు అనుకోకు, ఎందుకంటే మీకు ఎక్కడైనా ఫ్రీ గానే ఇస్తారు, ఇలాంటి చోట ఆపితే మాకు .... తీరిపోతుంది అన్నాను.

వీళ్ళకి ఫ్రీ కాదు, కానీ మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీకు ఏలూరు నుండి ఉదయం 7.30 కి భద్రాచలం బస్సు ఉండేది. అక్కడ బయలుదేరాకా 60 కి.మీ. దూరంలో చింతలపూడి దగ్గర టిఫిన్ కి ఆపుతాడు. ఎక్కువలో ఎక్కువ గంటన్నర ప్రయాణం. అక్కడ నుండి చంద్రుకుంట 75 కి.మీ. దూరం, అక్కడ భోజనానికి ఆపుతాడు. అక్కడ నుండి ఒక అరగంట లో మనం కొత్తగూడెం వెళ్లిపోవచ్చు. వీళ్ళు తిని వచ్చేదాకా మనం నిలబడే ఉండాలి. లేదా గంటన్నర తేడాలో మనం టిఫిన్, భోజనం చేసేయాలి. వాళ్ళ మీద జాలిపడాలి కాదనను, ఎందుకంటే రోజూ హోటల్ తిండి అంటే ఎవరికైనా కష్టమే. కాకపొతే వాళ్ళ వలన మనకి ఇబ్బంది కదా. అసలు ఏలూరు భద్రాచలం మద్య దూరమే 225 కి.మీ ఉంటుంది ఏమో.

మీరు అబ్జేర్వ్ చేసే ఉంటారు, కొంతమంది తేడా ఇంతే కదా అంటారు, అలాగని ఆ "ఇంతే" ని వాడు ఒదులుకోడు. ఏదో చిన్న వ్యాపారస్తులు ఐతే మనం మాట్లాడం. వచ్చిన భాదేంటంటే, మనం రైతు బజార్లో రూపాయి దగ్గరా, అర్థరూపాయీ దగ్గర బేరాలాడతాము, అదే మాల్ కి వెళితే బిల్ కడతానికి కూడా లైన్లో నిలబడి, వాడు చెప్పిన రేట్ కి కొంటాము. పైగా, ఒక్కొక్కడు బ్లాక్ మెయిల్ కూడా చేస్తాడు. నేను ఒకసారి టి.వి. కొందామని కొత్తగూడెంలో అడిగితే చాలా ఎక్కువ చెప్పాడు. అదేమిటి అంత లేదు కదా, నేను ఖమ్మం లో కొనుక్కుంటానులే అంటే, వాడు అక్కడ కొంటే మీ మణుగూరు లో సర్వీసింగ్ కి మేమే పంపాలి, ఆలోచించుకోండి అన్నాడు. నేను వెంటనే, ఏరా బాబూ నా చెవిలో చుట్టలు ఏమైనా కనిపిస్తున్నాయా, నేను కంప్లైంట్ ఇచ్చిన నాలుగు రోజుల్లో అవ్వలేదనుకో అప్పుడు తెలుస్తుంది, నా సంగతేంటో కంపనీ వాడికి అని చెప్పి వచ్చేసాను. మన ఇంటికి వచ్చి కూరలమ్మేవాడంటే మనకి లోకువ, అదే మనం వెళ్ళగానే మనకి కూల్ డ్రింక్ ఇచ్చి మనల్ని ఎలా బాదేసినా మనకి ఆనందమే.

ఒకో టైలరింగ్ షాప్ ముందు .............AC అని ఉంటుంది. అక్కడ మనం ఉండేది ఐదు నిముషాలు. కానీ వాడు వేసే రేట్ కి మనం ఏమీ మాట్లాడకుండా కొలతలు ఇచ్చి వచ్చేస్తాము. అంటే వాడు AC లో కూర్చుని కుడితే ఆ బిల్లు మనం కడతామన్నమాట. పోనీ సెలూన్ అంటే సరే, నాకులాంటి వాళ్ళు తలకి సున్నాలు వేయిన్చుతాము కాబట్టి ఎలా లేదన్నా గంటపైనే పడుతుంది. అప్పుడు ఇచ్చినా అందమే, కానీ టైలరింగ్ షాప్ లో AC కివ్వడమంటే నవ్వు వస్తుంది.  

2 comments:

  1. మీ ఈ పోస్టు...నా జేబుని కాపాడుతుంది....

    ReplyDelete