ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Sunday, April 7, 2013

మా సింగరేణి


ఈ రోజు మా అక్క హైదరాబాద్ వచ్చింది. మాటల్లో ఒరేయ్, డంపర్స్ తిరగబడి ఈ మధ్యన ఇద్దరు ఆపరేటర్స్ చనిపోయారురా, అయినా నాకు తెలియక అడుగుతాను, డంపర్స్‌లో హెల్పర్స్ ఉండరా అని అడిగింది. నిజమే, మా సింగరేణీలో డంపర్స్‌లో హెల్పర్స్ ఉండరు. పై మట్టి తీసి, దానిని చుట్టూ కొండలా వేస్తారు. ఎత్తు పెరిగేకొద్దీ, దాని మీదకు దారులు చేసి, అక్కడ  మట్టిని పోస్తారు. అవి వంద అడుగుల ఎత్తువరకూ ఉంటాయి. రివర్స్ గేర్‌లో వచ్చి, ఆ ఎత్తులో మట్టిని అన్‌లోడ్ చేస్తారు. ఒక్కోసారి, ఏదో పరధ్యానంలో ఉండో, లేక మితిమీరిన ఆత్మ విశ్వాసంతోనో మా వాళ్ళు చివరదాకా వచ్చేస్తారు. అది లూజ్ మట్టి అవడం వలన, మట్టి జారి దానితోపాటూ, డంపర్ కూడ క్రిందకు పడిపోతుంది. సహజంగా అలాంటి చోట ట్రాక్టర్ వాడు కూడా  మనిషిని పెట్టుకుంటాడు, కానీ మా యాజమాన్యం మాత్రం అలా వదిలేస్తుంది. అడగవలసిన యూనియన్ నాయకులు అడగరు. పూర్వం సింగరేణిలో ఎలక్షన్స్ ఉండేవు కావు, కాబట్టి పేరు కోసమో, డబ్బు కోసమో, అన్ని యూనియన్స్ అంతో ఇంతో కార్మికుల గురించి ఆలోచించేవి (అది కూడా బేరం కుదిరేదాకానే), ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నయి. ఇప్పుడు మేనేజ్‌మెంట్ పని చాలా సులువు అయ్యిపోయింది, ఇదివరకు అయితే ఐదారు యూనియన్స్‌ని మేనేజ్ చెయ్యవలసి వచ్చేది. ఇప్పుడు, ఒక్కడిని మేనేజ్ చేస్తే చాలు, పని అయ్యిపోతుంది.  ఎవడెలా పోతే మాకేమిటి, మా బ్యాంక్ బ్యాలన్స్ పెరిగిందా లేదా అనేదే చూస్తున్నారు, ఈ నాయకులు. తరువాత ఎలాగూ, ఎంఎల్‌సి సీటులు ఉన్నాయి, కాబట్టి వాళ్ళకు మేనేజ్‌మెంట్ ముఖ్యం కానీ, కార్మికులు కాదు.

నేను అక్కడ ఉద్యోగం చేస్తున్న సమయంలో 1992లో అనుకుంటాను, మా ప్రమోషన్ గురించి  అడగడానికి, .మా డైరెక్ట్టర్ పా దగ్గరకు వెళ్ళాము. ఆయన ఐఏఎస్ ఆఫీసర్. లోపలకు కబురు పంపాకా, ఆయన యూనియన్ ద్వారా వచ్చారా, డైరక్టుగా వచ్చారా అని అడిగాడంట. క్లర్క్ వచ్చి మమ్మల్ని అదే అడిగాడు. మేము డైరక్టుగా వచ్చాముఉ, అని చెప్పాము.  సరే లోపలకు రమ్మను అని చెప్పాకా, వెళ్ళాము. ఆయనకు మా విషయం చెప్పి, 1988లో జె.ఇ. ప్రమోషన్ ఇవ్వాలి, ఇప్పటిదాకా ఇవ్వలేదు అని చెప్పాము. ఆయన మేము కేడర్ స్కీం తీసేసాము కదా అని అన్నాడు. ఎప్పుడు సార్ అని నేను అడిగాను. అంటే ఆయన 1989లో అన్నాడు. అదేమిటి సార్, మాది 1988 డ్యూ కదా, మాకు ఇచ్చాకా కదా, మీరు కాన్సిల్ చెయ్యవలసింది,  పైగా నేను చేరినప్పుడు, క్యాడర్ స్కీం ఉందనే, నేను గవర్నమెంట్ సర్వీస్ వదిలేసి ఇక్కడ చేరాను. నేను చేరినప్పుడు ఏ ఏ బెనిఫిట్స్ ఉన్నాయో, అవి నేను రిటైర్ అయ్యేదాకా ఉండాలి కదా అని అడిగాను. ఆయన సరే చూస్తాను, వెళ్ళండి అన్నాడు.

 ఆ తరువాత మా వాళ్ళు యూనియన్‌వాళ్ళను కలుద్దాము అంటే, నాకు ఇష్టం లేకపోయినా, ఇప్పుడు ఎంఎల్‌సి గా ఉన్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాము. అతనిని మా ప్రమోషన్స్ గురించి అడిగితే, మీరు ఎప్పుడూ కలవలేదు కదా అన్నాడు. నేను, ఎందుకు కలవాలి అని అడిగాను. వాడు నన్ను ఎగా,దిగా చూసాడు. మేమెందుకు నిన్ను కలవాలి, నువ్వు యూనియన్ లీడర్‌వి, మేనేజ్‌మెంట్ అన్ని పాలసీలు సరిగ్గా అమలుపరుస్తోందో, లేదో చూడవలసిన భాధ్యత నీమీద లేదా అని అడిగాను. సరే, మా ప్రమోషన్స్ రాలేదు అనుకోండి అది వేరే విషయం. మా యూనియన్ నాయకులు ఎలా ఉంటారో చెప్పడానికి మాత్రమే నేను ఈ విషయం ప్రస్థావించవలసి వచ్చింది.

Sunday, March 10, 2013

నన్ను మనిషిగా ఉంచుతున్నది



ఈ రోజు మా నాన్నగారి పుట్టినరోజు. సహజంగా కొడుకుని చూసి ఎవరైనా గర్వపడతారు, కానీ నేను మాత్రం మా నాన్నగారిని చూసి గర్వపడతాను. ఈ సృష్టిలో  కన్నతండ్రిని ప్రేమించని వాళ్ళు ఉండరు. (ఎక్కడో నాలాంటి దరిద్రులను తప్ప). కానీ ఇక్కడ నేను నా తండ్రిని, నా తండ్రిగా కంటే కూడా ఒక మనిషిగా ఎక్కువగా ఇష్టపడతాను. చాలా మంది కొడుకులలాగే నేను కూడా, ఆయనతో గొడవపడిన సందర్భాలు ఉన్నాయి, మాట్లాడడం మానివేసిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్ని ఎలా ఉన్నా ఆయనలో ఉన్న మనిషిని నేను ఎక్కువ గౌరవిస్తాను. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్టు పుట్టుకతో ప్రతీవాడూ శూద్రుడే, ఆ తరువాత మనం పాటించే ఖర్మలను బట్టి మన వర్ణం ఆధారపడి ఉంటుందనేది నేను మా నాన్న గారిని చూసి తెలుసుకున్నాను. ఆయన క్షత్రియ కుటుంబంలో జన్మించినా, ఒక్క వైశ్య లక్షణాలు తప్ప మిగిలిన లక్షణాలు అన్నీ నేను ఆయనలో చూసాను. ఒక గురువుకు ఉండవలసిన లక్షణాలు నేను ఆయనలో చూసాను. విద్యనేర్పే గురువు విధ్యార్థుల భాధ్యత ఎలా తీసుకోవాలో ఆయన అలా తీసుకునేవారు. ఒక గురువుగా ఎంతమందికి ఆయన సాయం చేసారో నాకు వేరే వాళ్ళు చెప్పినప్పుడు తెలిసింది. సహజంగా నా స్నేహితులు నాతో మా ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్పవచ్చు, కానీ నేను ఎవరినో తెలియకుండా మా నాన్నగారి గురించి కొంతమంది నాకు చెపుతున్నప్పుడు, నాకు నా మీదే అసహ్యం వేసేది. (ఎందుకనో తెలియదు కానీ, నేనెప్పుడూ మా నాన్నగారి గురించి ఎవరికీ చెప్పేను). ఆ తరువాత వాళ్ళకు నేనెవరో తెలిసినప్పుడు వాళ్ళు నాకు దణ్ణం పెట్టేవారు, మీ నాన్నగారి దయవలన నేను ఇంతవాడిని అయ్యాను అని. విద్య చెప్పినప్పుడు ఆయనలో నేను బ్రాహ్మణ లక్షణాలను చూసాను, అలాగే దానం చేసినప్పుడు ఆయనలో క్షత్రియ లక్షణాలను చూసాను, తను చేస్తున్న ఉద్యోగంలో ఆయన పడే కష్టం చూసినప్పుడు నాకు ఆయనలో ఒక శూద్రుడిని చూసాను. నా ఈ 50 సంవత్సరాల జీవితంలో నేను ఆయనలో ఎక్కడా వైశ్య లక్షణాలు చూడలేదు. ఆయనలో ఎక్కడా వ్యాపారం మీద మక్కువ నేను గమనించలేదు. ఆయన ఎన్నో ఫాక్టరీలకు చార్టర్డ్ ఇంజనీర్, కానీ ఆయన ఎన్నడూ దానిని వ్యాపారంగా చెయ్యలేదు. అలా చేసి ఉంటే ఈ రోజు నాకు కోట్లు ఇచ్చివుండేవారేమో, దానిని నేను ఆనందంగా ఖర్చుపెట్టుకుంటూ తిరిగేవాడినేమో, కానీ ఇంత గర్వంగా ఈయన మా నాన్నగారు చెప్పుకొనేవాడిని కాదు. నేను అప్పులపాలయినప్పుడు, ఆయన ఆస్తి మొత్తం అమ్మివేసి అప్పులు తీర్చివేసారు. అందులో మా అమ్మకు, అక్కలకు ఇవ్వవలసినది ప్రక్కన పెట్టి, ఆయనది మొత్తం అమ్మివేసి, నన్ను మళ్ళీ ఉద్యోగం చేసుకొని బ్రతకమని సలహా ఇచ్చారు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆయనది కాని ఆస్తి మీద ఆయన హక్కుని తీసుకోలేదు. నేను అందరినీ కోల్పోయి, ఏ ఉద్యోగమూ చెయ్యకుండా పిచ్చిలో పడి, ఖాళీగా తిరుగుతున్నప్పుడు, నాలుగు సంవత్సరాల పాటు నెలకు పాతికవేలు చొప్పున పంపిచారు తప్పితే ఎప్పుడూ నన్ను తిట్టలేదు. ఈ రోజు దాకా నువ్వు నీ జీవితం చూసుకో అని చెప్పలేదు, తప్పు చేసావు కాబట్టి వేచి ఉండు అన్నారు తప్పితే, ఎప్పుడూ నాకు వేరే జీవితం గురించి సలహా ఇవ్వలేదు. నాలుగు నెలల క్రితం నాకు నడుం నొప్పి మళ్ళీ వస్తోంది అని చెప్పినప్పుడు, కొత్త కారు కొనుక్కో డబ్బులు పంపిస్తాను అని రోజూ తిట్టేవారు, ఒద్దని నేను సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటానని చెప్పినప్పుడు రెండు లక్షలు పంపించారు. ఇప్పటికీ మా అమ్మ రోజూ ఫోన్ చేసి సెకండ్ హ్యాండ్ కారు వద్దు, అమ్మేయి, భాజీ పంపిస్తారు, కొత్తది కొనుక్కో అని తిడుతోంది. వాళ్ళకు నామీద ఉన్న ప్రేమ అటువంటిది. ఆయన రిటైర్ అయ్యాకా పుట్టపర్తి వెళ్ళిపోయి అక్కడ స్కూలులో టీచర్‌గా సర్వీస్ చేసుకుంటున్నారు. మా నాన్నగారు ఒక్కరే కాదు, అక్కడ ఉన్న టీచర్స్‌లో ముప్పాతిక వంతు మంది ఫ్రీగా టీచ్ చేస్తున్నారు. వాళ్ళల్లో ఎవరికీ కూడా బయట ఉద్యోగం చేస్తే, ఏ కార్పొరేట్ కాలేజీ వాళ్ళైనా, నెలకు రెండు లక్షలకు తక్కువ కాకుండా జీతం ఇస్తారు. అటువంటి చోట మా నాన్న గారు హాయిగా సేవ చేసుకుంటున్నారు. నా ఈ అహంకారానికి కారణం మా నాన్నగారు. కానీ నేను వేసిన ఒక తప్పటడుగు ఈ రోజు వాళ్ళను రోడ్డు మీద నిలబెట్టింది. అందుకు నేను చాలా భాధపడుతున్నాను. కానీ ఈ రోజుకూ ఆయన నేను వేసింది తప్పడడుగు అని అనరు. నేను నాకు సంబంధించిన ఏ విషయమూ ఆయనకూ చెప్పను. నా ప్రోబ్లం ఏదో నేనే చూసుకుంటున్నాను. నన్ను చాలా మంది అడిగారు, కాదు తిట్టారు, ఉన్నవాడివి ఒక్కడివి, వాళ్ళను నీ దగ్గరకు తీసుకువచ్చేసుకోవచ్చు కదా అని. వాళ్ళు అక్కడ చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, ఇక్కడకు వచ్చినదగ్గరనుండీ, నా స్థితి చూసి వాళ్ళు భాధపడాలి అనేది నాకు తెలుసు. అందుకని నేను వాళ్ళను ఇక్కడకు రమ్మని అడగను. ఒకవేళ వాళ్ళు ఇక్కడకు వచ్చినా నా రూముకు తీసుకురాను, మా మేనకోడలి ఇంటి దగ్గర ఉండమంటాను. నన్ను ఒక్కడిని చూస్తే వాళ్ళకు భాధకలుగుతుందని నా భాధ. మా నాన్న గారికి స్టూడెంట్స్ కాళ్ళకు దణ్ణం పెట్టడం చూసాను, అందులో కొంతమంది, దరిదాపులదాకా ఆయన వయసువాళ్ళు కూడా ఉన్నారు. ప్రైవేటుగా డిప్లొమా చేసేవాళ్ళు కొంతమంది ఆయన వయసువాళ్ళు ఆయన దగ్గరకొచ్చి నేర్చుకొనేవారు. వాళ్ళ డిప్లొమా చేతికొచ్చాకా వాళ్ళు వచ్చి ఈయన కాళ్ళకు దణ్ణం పెట్టబోయేవారు. కానీ, ఆయనతో పాటు పనిచేసిన లెక్చరర్స్ కూడా ఆయన కాళ్ళకు దణ్ణం పెట్టడం నేను కొన్ని సంవత్సరాల క్రితం తిరుపతిలో చూసాను. మా నాన్నగారు అప్పటికి రిటైర్ అయ్యిపోయారు. మా మేనల్లుడికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ అంటే తిరుపతి వెళ్ళాము. అప్పుడు మా నాన్నగారు తన దగ్గర లెక్చరర్‌గా చేసిన ఒకాయనకు ఫోన్ చేసి వీలుంటే రమ్మని చెప్పారు. ఆయన సాయంత్రం భార్యతో కలిసి వచ్చి, వెళ్ళిపోతూ కాళ్ళకు నమస్కారం చేసివెళ్ళారు. నాకు చాలా ఆశ్చ్రర్యం వేసింది. నా తండ్రి ఇంత ఉన్నతుడా అని అనిపించింది. ఇప్పటికీ హిందూపూర్ పాలిటెక్నిక్‌లో మా నాన్నగారు ప్రిన్సిపాల్‌గా చేసినప్పటి బ్యాచెస్ అమ్మాయిలు పుట్టపర్తి వచ్చి మా నాన్నగారిని కలిసివెళుతుంటారంట. వాళ్ళు కూడా మా నాన్నగారిని మేము పిలిచినట్టే భాజీ అంటారంట.