ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Tuesday, December 13, 2011

లోకం


మనుషులు ఎన్ని రకాలు అని ఎవరైనా అడిగితే, మనం, చెప్పే సమాధానం రెండు రకాలు అని. అది ఆడ, మగ అని ఒకరు, డబ్బున్నవాడు, డబ్బులేని వాడు అని ఒకరు, దోచుకునేవాడు, దోచుకోబడేవాడు అని ఒకరు అలా ఎవరికి తోచిన సమాధానం వాళ్ళు చెపుతారు. కానీ, నిజంగా మనుషులు ఎన్ని రకాలంటే, ఈ భూమి మీద, నరజాతి ఎంత ఉందో, అన్ని రకాలు అని చెప్పడం సరి అయినది అని అనిపిస్తోంది.
ఏ ఇద్దరి మనుషులు ఒకలాగ ఆలోచించరు, అలాగే, ఏ ఇద్దరి కష్టం ఒకలాగా ఉండదు. ఎవరి కష్టాలు వారికి పెద్దవి, అవతలి వారికి పెదవి విరిచేటంత చిన్నవి. ఈ రోజు నేను విన్న రెండు సంగతులు నన్ను చాలా భాధించాయి. అందులో, ఒకటి మా ఆఫీసులో పని చేసే ఒక వృద్దురాలిది, రెండోది నా కజిన్ ది.
ఈ రోజు మధ్యాహ్నం, నేను ఆఫీసులో టిఫిన్ చేస్తూ, ఆవిడను మీది ఏ ఊరు అని అడిగాను. మిర్యాలగూడ దగ్గర పల్లె సారూ, మా నాన్న, మేము పుట్టకముందే హైదరాబాదు వచ్చేసాడు, మాకు అక్కడ చాలా పొలం ఉండేదంట, అప్పుడు అక్కడ నీళ్ళు లేక మా అయ్య ఇక్కడకు వచ్చేసాడు. తరువాత అక్కడ సాగర్ కాలువ వచ్చింది. మా తాతా వాళ్ళు అక్కడకు వెళ్ళేసరికి, అక్కడ పాలెగాడు దానిని సాగుచేసుకుంటున్నాడంట, మా అయ్యా వాళ్ళని బెదిరించాడంట, వీళ్ళు భయపడి వచ్చేసారు. అప్పటినుండీ ఇక్కడే బట్టలు నేసుకుంటూ బ్రతికాడంది. ఈ లోపు, మా అకౌంటంట్, మీ ఆయనది ఏ ఊరు అని అడిగాడు. నల్గొండ అని, నా పెళ్ళి ఎప్పుడు అయ్యిందో నాకు యాదికే లేదు, కానీ గుర్రం మీద ఊరేగించారు, అది ఒక్కటి గుర్తుంది. పెళ్ళి అయ్యాకా ఎప్పటికో, మా ఆడబిడ్డతో విజయవాడ కేసి వెళ్ళినప్పుడు అక్కడే, రజస్వలని అయ్యాను అని చెప్పింది. ఇప్పుడు మీ ఆయన ఎక్కడుంటున్నాడు అని అడిగితే, రెండో పెళ్ళి చేసుకొని దానితో నల్గొండలోనే ఉన్నాడు అని చెప్పింది. నిన్ను ఎందుకు వదిలేసాడు, ఆవిడ బాగుంటుందా అని అడిగాడు. దానికి ఆమె, నేను దానినెక్కడ చూసాను, నాకు ఆరోగ్యం బాగాలేదని నన్నొగ్గేసి దానిని చేసుకున్నాడు అంది. ఎప్పుడైనా నిన్ను కలిసాడా అని అడిగితే, మొన్న మా మరిది పోయినప్పుడు అక్కడకు వెళితే ఫుల్ గా కల్లు తాగేసి వచ్చి నన్ను ఒకటే తన్నులు, అప్పుడు అక్కడే ఉన్న మా ఆడబిడ్డలు నవ్వుతుంటే, మా మరిది కూతురు వచ్చి వాడిని తిట్టి, నన్ను పక్కకు లాకెళ్ళిపోయింది అని ఎటువంటి భాధ లేకుండా నవ్వుతూ చెప్పింది. ఇక్కడకు వస్తాడా అని అడిగితే అప్పుడప్పుడూ వచ్చి కొడుకుని నెలకు మూడువేలు ఇవ్వు అని గొడవచేసి పోతాడండీ అంది. నా కొడుకు ఎలా ఇస్తాడండీ, వాడు పదో తరగతి పూర్తయిపోయాకా, నేను హాస్పిటల్ లో ఉంటే, ఇంటికి వచ్చి ఇల్లు అమ్మేసాను, వచ్చి సంతకం పెట్టు అని నా కొడుకుది స్కూలు టీ.సి. తీసుకుపోయి వాడూ, అక్కడ ఉన్న పెద్దమనిషి కలిసి బెదిరించారంట. వీడు పెట్టనంటే, నీ టీ.సి చింపేస్తాను అంటుంటే మా ఆడబిడ్డ కొడుకు వచ్చి ఒరేయ్, వెధవ ఇల్లు పోతేపోయింది, నువ్వు చదువుకుంటే పెద్ద ఉద్యోగం చేసుకోవచ్చు, సంతకం పెట్టేసి ఆ టీ.సి తీసుకో అని సంతకం పెట్టించాడంట. వీడు సంతకం పెట్టగానే ఆ టీ.సి ఇచ్చేసి, ఏరా డబ్బులేమన్నా కావాలా అని నవ్వుతూ అడిగాడంట. నువ్వూ వద్దు, నీ డబ్బూ వద్దు అని నా కొడుకు వచ్చేసాడు అని నవ్వుతూ చెప్పింది. ఆవిడ అది చెపుతున్నంత సేపూ ఆవిడలో ఎక్కడా భాధ అనేది కనిపించలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. భర్త వదిలేసాడు అని భాధ లేకపోవచ్చు, కానీ, పడిన కష్టాల గురించి కూడా ఆవిడలో ఎక్కడా భాధ కనిపించలేదు. జీవితాన్ని ఎలా వస్తే అలా నడుపుకుంది ఆవిడ. ఆవిడను నేను గత నాలుగు సంవత్సరాల నుండీ చూస్తున్నాను. ఎప్పుడూ, నవ్వుతూనే తింగరి, తింగరిగా ఉంటుంది. ఆవిడ అదృష్టం, కొడుకు ఈ మధ్యనే కారు కొనుక్కున్నాడంట, కూతురి పరిస్థితి కూడా బాగానే ఉంది. ఆవిడ కొడుకు, కారు కొనుక్కున్న రోజు మాకు చెపితే, మా అకౌంటంట్, శుభ్రంగా ఇంటిలో కూర్చుని తినక ఈ పని నీకెందుకు అని అడిగితే, నాకు ఓపిక ఉండగా నేను వాళ్ళ సొమ్ము ఎందుకు తినాలి ఓపిక ఉన్నంతవరకు చేస్తూనే ఉంటాను అంది. రోజూ సిటీబస్ లో విద్యానగర్ దగ్గరనుండి అమీర్ పేట దగ్గర ఉన్న మా ఆఫీస్ కు వస్తుంది. ఇంతకూ ఆవిడకు ఇచ్చేది 1200 రూపాయలు.