ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Sunday, April 7, 2013

మా సింగరేణి


ఈ రోజు మా అక్క హైదరాబాద్ వచ్చింది. మాటల్లో ఒరేయ్, డంపర్స్ తిరగబడి ఈ మధ్యన ఇద్దరు ఆపరేటర్స్ చనిపోయారురా, అయినా నాకు తెలియక అడుగుతాను, డంపర్స్‌లో హెల్పర్స్ ఉండరా అని అడిగింది. నిజమే, మా సింగరేణీలో డంపర్స్‌లో హెల్పర్స్ ఉండరు. పై మట్టి తీసి, దానిని చుట్టూ కొండలా వేస్తారు. ఎత్తు పెరిగేకొద్దీ, దాని మీదకు దారులు చేసి, అక్కడ  మట్టిని పోస్తారు. అవి వంద అడుగుల ఎత్తువరకూ ఉంటాయి. రివర్స్ గేర్‌లో వచ్చి, ఆ ఎత్తులో మట్టిని అన్‌లోడ్ చేస్తారు. ఒక్కోసారి, ఏదో పరధ్యానంలో ఉండో, లేక మితిమీరిన ఆత్మ విశ్వాసంతోనో మా వాళ్ళు చివరదాకా వచ్చేస్తారు. అది లూజ్ మట్టి అవడం వలన, మట్టి జారి దానితోపాటూ, డంపర్ కూడ క్రిందకు పడిపోతుంది. సహజంగా అలాంటి చోట ట్రాక్టర్ వాడు కూడా  మనిషిని పెట్టుకుంటాడు, కానీ మా యాజమాన్యం మాత్రం అలా వదిలేస్తుంది. అడగవలసిన యూనియన్ నాయకులు అడగరు. పూర్వం సింగరేణిలో ఎలక్షన్స్ ఉండేవు కావు, కాబట్టి పేరు కోసమో, డబ్బు కోసమో, అన్ని యూనియన్స్ అంతో ఇంతో కార్మికుల గురించి ఆలోచించేవి (అది కూడా బేరం కుదిరేదాకానే), ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నయి. ఇప్పుడు మేనేజ్‌మెంట్ పని చాలా సులువు అయ్యిపోయింది, ఇదివరకు అయితే ఐదారు యూనియన్స్‌ని మేనేజ్ చెయ్యవలసి వచ్చేది. ఇప్పుడు, ఒక్కడిని మేనేజ్ చేస్తే చాలు, పని అయ్యిపోతుంది.  ఎవడెలా పోతే మాకేమిటి, మా బ్యాంక్ బ్యాలన్స్ పెరిగిందా లేదా అనేదే చూస్తున్నారు, ఈ నాయకులు. తరువాత ఎలాగూ, ఎంఎల్‌సి సీటులు ఉన్నాయి, కాబట్టి వాళ్ళకు మేనేజ్‌మెంట్ ముఖ్యం కానీ, కార్మికులు కాదు.

నేను అక్కడ ఉద్యోగం చేస్తున్న సమయంలో 1992లో అనుకుంటాను, మా ప్రమోషన్ గురించి  అడగడానికి, .మా డైరెక్ట్టర్ పా దగ్గరకు వెళ్ళాము. ఆయన ఐఏఎస్ ఆఫీసర్. లోపలకు కబురు పంపాకా, ఆయన యూనియన్ ద్వారా వచ్చారా, డైరక్టుగా వచ్చారా అని అడిగాడంట. క్లర్క్ వచ్చి మమ్మల్ని అదే అడిగాడు. మేము డైరక్టుగా వచ్చాముఉ, అని చెప్పాము.  సరే లోపలకు రమ్మను అని చెప్పాకా, వెళ్ళాము. ఆయనకు మా విషయం చెప్పి, 1988లో జె.ఇ. ప్రమోషన్ ఇవ్వాలి, ఇప్పటిదాకా ఇవ్వలేదు అని చెప్పాము. ఆయన మేము కేడర్ స్కీం తీసేసాము కదా అని అన్నాడు. ఎప్పుడు సార్ అని నేను అడిగాను. అంటే ఆయన 1989లో అన్నాడు. అదేమిటి సార్, మాది 1988 డ్యూ కదా, మాకు ఇచ్చాకా కదా, మీరు కాన్సిల్ చెయ్యవలసింది,  పైగా నేను చేరినప్పుడు, క్యాడర్ స్కీం ఉందనే, నేను గవర్నమెంట్ సర్వీస్ వదిలేసి ఇక్కడ చేరాను. నేను చేరినప్పుడు ఏ ఏ బెనిఫిట్స్ ఉన్నాయో, అవి నేను రిటైర్ అయ్యేదాకా ఉండాలి కదా అని అడిగాను. ఆయన సరే చూస్తాను, వెళ్ళండి అన్నాడు.

 ఆ తరువాత మా వాళ్ళు యూనియన్‌వాళ్ళను కలుద్దాము అంటే, నాకు ఇష్టం లేకపోయినా, ఇప్పుడు ఎంఎల్‌సి గా ఉన్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాము. అతనిని మా ప్రమోషన్స్ గురించి అడిగితే, మీరు ఎప్పుడూ కలవలేదు కదా అన్నాడు. నేను, ఎందుకు కలవాలి అని అడిగాను. వాడు నన్ను ఎగా,దిగా చూసాడు. మేమెందుకు నిన్ను కలవాలి, నువ్వు యూనియన్ లీడర్‌వి, మేనేజ్‌మెంట్ అన్ని పాలసీలు సరిగ్గా అమలుపరుస్తోందో, లేదో చూడవలసిన భాధ్యత నీమీద లేదా అని అడిగాను. సరే, మా ప్రమోషన్స్ రాలేదు అనుకోండి అది వేరే విషయం. మా యూనియన్ నాయకులు ఎలా ఉంటారో చెప్పడానికి మాత్రమే నేను ఈ విషయం ప్రస్థావించవలసి వచ్చింది.