ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, June 16, 2012

సామాజికన్యాయం అంటే ఏమిటో నాకు అర్ధం కావడం లేదు.

సరిగా చదువుకోకపోతే ఎంత నష్టమో నాకు ఇప్పుడు అర్ధం అవుతోంది. మా ఫాదర్ చెప్పినట్టు నేను చిన్నప్పుడు మంచిగా చదువుకుని  వుంటే నాకు ఈ అనుమానం వచ్చేది కాదేమో? లేకపోతే లోకమంతా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే నాకు దాని గురించి తెలియక నేను బిక్క మొగం వేయడమేమిటి? లేదూ నేను పెరిగిన వాతావరణం, నన్ను అటువంటి వాటి గురించి, ఆలోచించే అవకాశం ఇవ్వలేదు అనడానికి లేకుండా నా తండ్రి ఎంతో మంది బీద విద్యార్ధులకి ఫీజ్ కట్టి చదివించిన మనిషి, మేము ఎప్పుడైనా, మా అసమర్ధతని కప్పిపుచ్చుకోవడానికి, ఆ వాడు రిజర్వేషన్ మీద సీట్ కొట్టేసాడు అంటే, ఒరేయ్ వెధవల్లారా, మిమ్మల్ని పందుల్ని మేమినట్టు మేపి, మీరు ఏది కావాలంటే అది కొనిచ్చి, ట్యూషన్‌ల ట్యూషన్‌లు పెట్టించి, ఎంత కావాలంటే అంత డబ్బిచ్చి చదువుకోండిరా అంటే 35 మార్కులు తెచ్చుకోవడానికి చచ్చిపోతూ, వాళ్ళ మీద పడి ఏడుస్తారెందుకురా అని తిట్టే మనిషి కాబట్టి నేను అటువంటి వాతావరణంలో   పెరిగినవాడిని కాదు. మరి అందరికీ అర్ధమైన ఈ సామాజిక న్యాయమనేది నాకు ఎందుకు అర్ధం కావడం లేదు?

పోనీ ఉద్యోగమా అంటే నేను చదివింది సివిల్ డిప్లొమా. ప్రొద్దుట లేచింది మొదలు లేబర్‌తోనే పని. వాడు ఒక్కరోజు పని మానేసాడంటే ఆరోజు మా పని అయ్యిపోయినట్టే, కాబట్టి వాడి విలువ నాకు తెలుసు. చేసింది తెలంగాణాలో వున్న సింగరేణిలో, దరిదాపులదాకా అప్పట్లో 1,00,000 పైనే నిరక్షరాశ్యులు ఉన్న కంపెనీ, కాబట్టి నాకు ఊహవఛ్ఛాకా ఈ 30 (నేను నా 17 వయేట ప్రభుత్వోద్యోగంలో చేరాను, ఇప్పుడు నాకు 47) సంవత్సరాలలో, ఎవడూ నాకంటే ఎక్కవా కాదు, నాకంటే తక్కువా కాదు అనే పరిస్థితుల్లోనే పెరిగాను. మరి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ విననిది ఇప్పుడు ఎందుకు వింటున్నాను?   

1 comment:

  1. మీరు బెండు అప్పారావు సినిమా చూసారా?
    అందులో కొండవలస ఒక అద్భుతమైన డైలాగు చెప్తాడు.
    "దానికి తెలిసిన సామాజిక న్యాయం అది చేస్తోంది" అని.

    ReplyDelete