ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Friday, February 27, 2015

గత రెండు రోజులుగా, ఆంధ్రా ప్రాంత ఆర్థిక స్థితి మీద ఎగతాళిగా మాట్లాడుతున్న తెలంగాణా నాయకుల మాటలు ఏమన్నా ఆంధ్రా ప్రాంత నాయకులకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు వినిపిస్తున్నాయా? లేక వినిపించకుండా, చెవుల్లో గుడ్డలు కుక్కేసుకున్నారా? 1956లోనే మాది మిగులు బడ్జెట్ అని వాళ్ళు చెపుతున్న మాటలు తెలంగాణా సోదరుల్లాగే ఆంధ్రా నాయకులు కూడా నమ్ముతున్నారా? రాష్ట్ర సంపదనంతా తీసుకొని వచ్చి ఒకే ప్రాంతంలో గుమ్మరించి, ఈ రోజు ఆంధ్రా ప్రాంతానికి అన్యాయం చేసింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే. హైదరాబాద్ ఆదాయం లేకపోతే తెలంగాణా పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌ని మాత్రమే అభివృద్ధి చేసి, ఆంధ్రులు ఇన్ని అవమానాలు పడే పరిస్థితి తీసుకువచ్చింది ఆంధ్రా ప్రాంత నాయకులే. ఇప్పుడు కూడా వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. రాజధాని అంటూ, దాని కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు తప్ప, మిగిలిన జిల్లాల గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు కూడా అదే తప్పు చెయ్యడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు.
లోటు బడ్జెట్ అంటూ ఒక ప్రక్క బీద అరుపులు అరుస్తూ, ఎవడి సొమ్మని పిఆర్‌సి అనౌన్స్ చేసారో తెలియడం లేదు. ఇష్టం వచ్చినట్టు చంద్రన్న కానుకలు అంటూ కోట్లు విసురుతూ, ఖజానాను ఖాళీ చేస్తూ ఇప్పుడు కేంద్రం మీద పడుతున్నారు. అప్పు చేసి సోకులు చెయ్యడం ఏమీటో, తీర్చేది తనూ, తన పార్టీ కాదనా ఆయన ధైర్యం. కేంద్రం మీద తిరగబడడానికి ఎందుకు వెనుకాడుతున్నారో ఆయన చెప్పవలసిన అవసరం ఉంది. స్పెషల్ స్టాటస్ అనేది రాదని అందరికీ తెలుసు, వేరే విధంగా అయినా సొమ్ములు రాబట్టాలి కదా. ఎందుకు వెనుకాడుతున్నారు? లక్ష కోట్ల రాజధాని అని అందరూ విమర్శిస్తారని అనుమానమా? మనకంటే ముందు ఏర్పాటయిన మూడు కొత్త రాష్ట్రాలు నెమ్మదిగా రాజధానిని కట్టుకుంటున్నాయి కానీ, రాత్రికి రాత్రే రాజధాని కట్టాలి అని ఉరకలేదు. వాళ్ళు ముందు రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. మన నాయకులు మాత్రం రాజధాని పేరు చెప్పి, రియల్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. చివరికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా మిగిలిపోయేటట్టుంది.
ఐదారు సంవత్సరాల సమయం పట్టే ఎంఎన్‌సి ల గురించే ఆలోచిస్తున్నారు తప్ప, ఆరేడు నెలలలో తయారయ్యి, ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమల గురించి ఆలోచన కూడా చెయ్యడం లేదు. ఎంత సేపూ కేంద్రం స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదనే సాకు చూపిస్తున్నారు కానీ, రాష్ట్రం తరపున ఒక్క ప్యాకేజీ ప్రకటించడం లేదు. ప్రక్క రాష్ట్రంలో మూత పడిన పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం ఒక్కటీ చెయ్యడం లేదు. అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదా? ఎవడన్నా వ్యాపారం చెయ్యడానికి అప్పు గురించి వెళితే, అప్పిచ్చేవాడు, వీడు నిజంగా వ్యాపారానికే వాడతాడా, లేక షోకుల కోసం వాడతాడా అని చూస్తాడు. ఇప్పుడు మన రాష్ట్రం మీద కూడా అదే అభిప్రాయం కలుగుతుంది ఎవరికైనా.
ఇదే పోస్టుని నేను జగన్ ముఖ్యమంత్రి అయితే పెట్టేవాడిని కాదు, కారణం అతని మీద నాకు నమ్మకం లేకే, నేను చంద్రబాబుకు ఓటు వేసాను.

No comments:

Post a Comment