ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, February 21, 2015

నేటి భారతీయుడు



నా తరం వాళ్ళు, నా ముందటి వాళ్ళు గారడీ వాళ్ళను చూసే ఉంటారు (నేను వినడమే తప్ప చూడలేదు). ఆ గారడీ చేసే వ్యక్తి ప్రక్కన అతని కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు డప్పులు కొడుతూ అతనిని ఉత్సాహపరుస్తుంటారు. ఉన్నట్టుండి తేళ్ళు, పాములు వచ్చేస్తాయంట. అలాగే డబ్బులు వచ్చెసేవంట. దానినే కనికట్టు విద్య అంటారు, వాళ్ళను మోళీగాళ్ళంటారనుకుంటా.


అలాగే ప్రపంచ మెజీషియన్స్‌కి ఇప్పటికీ తెలియని, అర్థం కాని విద్య "ఇండీయన్ రోప్ ట్రిక్". మెజీషియన్ ఒక త్రాడుని ఆకాశంలోకి విసిరి, దానిని పట్టుకొని పైకెక్కి, కనిపించకుండా పోయేవాడంట. అందరూ అలా చూస్తుండగానే, వాళ్ళ మధ్యలో నుండి ఆ పైకి వెళ్ళిన వచ్చి పలకరించేవాడంట.


ఇప్పుడు మన దగ్గర ఆ మోళీ గాళ్ళు మన రాజకీయ నాయకులు. అప్పుడు ప్రక్కన డప్పు కొట్టే వాళ్ళు (అప్పుడంటే ఒక చిన్న సమూహానే మాయలో పడేసేవారు) ఇప్పుడు టీవీలలో మేధావులుగా, టాక్ షోలలో కనిపిస్తున్నారు. వీళ్ళందరూ చాలా చదువుకున్న వాళ్ళు. వాళ్ళకు వాళ్ళ పార్టీలు, నాయకులు ఏది చెపితే అదే వాస్తవం అనిపిస్తుంది (?). వాళ్ళ నాయకుడు తీసుకున్న ఏ నిర్ణయానైనా, టీవీలలో అందంగా ఎకానమీని ఉటంకిస్తూ ప్రజలను కనికట్టుతో కట్టేస్తారు. మన కళ్ళ ముందు సింగపూర్ సిటీలను సృష్టిస్తారు. అది నిజమని అనుకొని, మనం ఇప్పుడు కావలసిన గంజిని మరచిపోతాము.


ఒకరి మీద ఒకరిని రెచ్చగొడతారు. అడవులు నరికి పరిశ్రమలు స్థాపించాలి అంటారు. పారిశ్రామికవేత్తలకు తప్ప, రైతుకు తన పొలం మీద తనుకు హక్కు లేకుండా చేస్తారు. ఒక ప్రక్క గంగ ప్రక్షాళన అంటారు, ఇంకో ప్రక్క కొన్ని పరిశ్రమలకు పర్యావరణ అనుమతులు అక్కరలేదు అంటారు. విజనరీని అంటారు, మనకు విజన్ లేకుండా చేస్తారు. చాయ్ వాలాను అంటారు, మనకు చాయ్ లేకుండా చేస్తారు. దాహం అంటే హిమాలయాలలో పుట్టిన గంగ నీళ్ళు అమ్ముతున్నాం అంటారు. వైజ్ఞానికంగా ఎదగాలి అంటారు, విజ్ఞానాన్ని మాత్రం విదేశాల నుండీ కొంటాం అంటారు. సరస్వతి పుట్టిన దేశం అంటారు, సరస్వతిని అంగడి సరుకుని చేస్తారు. ఉద్యోగులకు లొంగుతారు, రైతులను అమ్ముతారు.


అమ్మా, నాన్నలకు దణ్ణం పెట్టని వాళ్ళు వీళ్ళ కాళ్ళకు మొక్కుతారు. అమ్మా, నాన్నల ఫొటోలు కనపడవు కానీ, నాయకుల ఫొటోలు గుండెల మీద వ్రేలాడుతుంటాయి.. వీళ్ళ బానిసత్వాన్ని మనకు అలవాటు చేసేస్తారు. మనం లొంగకపోతే పిచ్చి కుక్కల్లా అరుస్తారు.



ఇది నేటి భారతం.

No comments:

Post a Comment