ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Friday, December 17, 2010

ఒక చిన్న వివరణా? లేక నన్ను నేను సపోర్ట్ చేసుకోవడమా?

 అరేయ్ నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే విపరీతమైన గౌరవం, ఇష్టం. కొద్దిగా గురజాడ వారి గిరీశం లా అన్నీ మా వేదాల్లోనే ఉన్నాయష అనే బాపతు అనుకో.  నాకు చిన్నప్పటి నుండి పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువ. 10th పరీక్షలు అయ్యేదాకా డిటెక్టివ్ నవలలు చదివేవాడిని. పరీక్షలు ముందే మేము  సొంత ఇల్లు కొనుక్కొని అక్కడకు మారిపోయాము. అక్కడ సెలవల్లో నాకు శివకుమార్ అని ఒక మెడికో పరిచయం అయ్యాడు. అంటే అతని క్లాస్ మేట్ పాపారావు అని నాకు ముందు నుండి పరిచయం. వీళ్ళ ఫాదర్ కమ్యూనిస్ట్. ఇతని ద్వారా నాకు శివకుమార్ పరిచయం అయ్యాడు. అతని రూం లో నేను శ్రీ శ్రీ మహా ప్రస్తానం చూసాను. అది తీసుకుని చదువుతుంటే అతను నాకు నండూరి వారు వ్రాసిన నరావతారం పుస్తకం గురించి చెప్పి దొరికితే అది చదవమన్నాడు. అదృష్టం కొద్దీ మా ఇంటి దగ్గరే ఒక లైబ్రరీ వుండేది. నేను అక్కడకి వెళ్లి మెంబర్ షిప్ తీసుకొని ఆ పుస్తకం అడిగాను. అప్పుడు ఆ లైబ్రేరియన్ నన్ను ఏమి చదువుతున్నావు అని అడిగారు. అప్పుడే పదవ తరగతి పరీక్షలు వ్రాసానని చెప్పాను. అప్పుడు ఆయన నువ్వు నేను ఇచ్చిన పుస్తకాలు చదువు అని చెప్పి, మొదటగా నాకు నండూరి వారి విశ్వరూపం ఇచ్చారు. తరువాత డార్విన్ ట్రాన్స్లేషన్, నండూరి వారి నరావతారం అలా సీరియల్ గా ఇస్తూ, కొద్ది కాలం పోయాకా ముద్దు కృష్ణ వ్రాసిన ఖయ్యాం కవితలు, గాలిబ్ గీతాలు ఇస్తూ ఆయన నన్ను 6 నెలల్లో విశ్వనాథ వారి పుస్తకాలు చదివే స్థాయికి తీసుకు వచ్చారు. ఇది అంతా ఎందుకు చెపుతున్నానంటే ఎవరి పరిచయం, ఆలోచన, ప్రవర్తన ఎవరిని ఎలా మారుస్తాయో మనం చెప్పలేము, అందుకనే నువ్వు పెట్టిన ఫోటో కి నిన్ను చూసి కొంతమందైనా మారితే బాగుంటుందని వ్రాసాను, అలాగే మన గురించి గొర్రెలుగా వ్రాస్తే నీకు చాలా కోపం వచ్చింది. నాకు మన రాజకీయ వ్యవస్థ అంటే విపరీతమైన కోపం. ఎందుకంటే బ్రిటిషర్స్ రాక ముందు ప్రపంచంలో మన వాణిజ్యం 5% పైనే వుండేది. అది కూడా అప్పట్లో మన దగ్గర నుండి ఎక్కువ గా సువాసన ద్రవ్యాలు, నూలు వస్త్రాలు, వజ్రాలు మాత్రమే ఉండేవి. వాటి మీదే మనం అంత వాణిజ్యం చేసేవాళ్ళము. అటువంటిది బానిసలుగా మారేకా మనం ఎలా నాశనం అయ్యామో తలుసుకుంటే కడుపు రగిలి పోతోంది. పోనీ మనం స్వేచ్చ పొందాకా అన్నా మన బానిస మనస్తత్వం పోయిందా అంటే అది ఇంకా ఎక్కువ పెరిగేటట్టు మన రాజకీయ నాయకులు చేస్తున్నారు. మనువు చెపుతాడు, రాజు అనేవాడు గొప్ప వ్యక్తిత్వం కలిగి, బంధు ప్రీతి లేకుండా, న్యాయం చెప్పేటప్పుడు జాలి చూపకుండా, ఒకరికి తల వంచకుండా, ధైర్య సాహసాలు కలిగి వుండాలి అని. అటువంటివి నీకు ఎవరిలోనైనా కొద్దిగా అన్నా కనిపిస్తున్నాయా? వాడు బానిస లా ఉంటూ మనల్ని కూడా బానిసలు గా మారుస్తున్నారు. మొన్న మన కొత్త ముఖ్య మంత్రి గారి స్టేట్మెంట్ చూడు, 2014 లో రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రిని చేద్దాము అంటాడు. అంతే కానీ 2014 కల్లా మన రాష్ట్రాన్ని గుజరాత్ స్థాయికి తీసుకు వెళతాను అని అనడు. ఇంక ఒక రాజకీయ నాయకుడు చస్తే మొగుడు పోయాడు అని పెళ్ళాం ఏడవదు, బాబు పోయాడని పిల్లలు ఏడవరు, ఆ ప్లేస్ లోకి మనం వెళ్లిపోవాలి అని ఏడుస్తున్నారు.

1 comment:

  1. I am sorry... చిన్నతనం కదా ఆవేశం లో...

    ReplyDelete