ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Friday, December 31, 2010

మన ఆశయ సాధన కోసం ఇలా చేస్తే ఎలా వుంటుందో ఆలోచించండి.



చెప్పులోన రాయి, చెవిలోని జోరీగ, కంటినలుసు, కాలిలోన ముళ్ళు, ఇంటి లోన పోరు ఇంతింత కాదయా విశ్వదాభి రామ వినురవేమ! ఎంత బాగా చెప్పాడు మన వేమన, దయచేసి ఆయన ఆంధ్రా వాడు అని అనవద్దు. ఇంత బాగా ఆయన చెప్పాకా కూడా మనం తెలంగాణా సాధించడానికి ప్రాణాలు త్యాగం చెయ్యాలా? ఒక్క సారి ఆలోచించండి.

చిన్న చిన్న విషయాలతో ఈ ప్రభుత్వాన్ని చికాకు పెట్టవచ్చు.నేను పైన పెట్టిన ఫోటో ఒక ఉదాహరణ. Face book లో మధుకర్ చింటు అనే వ్యక్తి తన ప్రొఫైల్ ఫోటో గా పెట్టాడు. ఇలాంటివి చిన్న విషయాలుగా కనిపిస్తాయి కానీ వాటి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా వుంటుంది. మనకి అనుకూలంగా గనుక జరగకపోతే మనమేమి రెచ్చిపోవద్దు. చాలా కూల్ గా మన పని మనం చేసుకుపోదాము. మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మంచి వేసంకాలం మనం కరంట్ పోయినప్పుడు మన ఇంట్లో పడుకుంటాము. విపరీతంగా చెమటలు పడుతుంటాయి, గాలి వెయ్యదు, ఒక ప్రక్క నిద్ర ఆగదు. ఆ టైంలో ఒక ఈగ మన మొహం మీద వాలి, మనం ఎన్నిసార్లు కొట్టినా ఎగిరినట్టే ఎగిరి మళ్ళీ మన ముక్కు మీద వాలి మనల్ని చికాకుపెడుతుంటుంది. అప్పుడు మనకు ఎలా వుంటుంది? దానిని చంపాలనుకుంటాము, కానీ అది మనకు దొరకదు. అలా మనం ఈ ప్రభుత్వాన్ని చికాకుపెట్టాలి.

ఈ ప్రభుత్వానికి కొన్ని రోజులు (వారాలు కాదు)సమయం ఇద్దాము. తరువాత, మన రాష్ట్రం వాళ్ళు ఇచ్చేదేమిటి, మనమే ఏర్పాటు చేసుకుందాము. మన పెద్ద వాళ్ళని అడిగి కొత్త రాష్ట్రం ఏర్పాటు అయితే ఏమేమి మార్పులు జరుగుతాయో తెలుసుకొని వాటిలో మనం చెయ్యగలిగేవి ఎటువంటి గొడవలు లేకుండా నిదానంగా చేసుకుపోదాము. అందులో మొదటిది  తెలంగాణా జిల్లాల్లో రిజిస్టర్ అయిన (1,9,10,11,12,13,15,20 మొదలైనవి) అన్ని వాహనాలకి TG అని రాసేద్దాము.ఆంధ్రా జిల్లాల రిజిస్ట్రేషన్ నెంబర్లు మార్చం. అన్ని స్తిక్కరింగ్ దుకాణాల వాళ్లకి TG అనే రాయమని చెప్పుదాము. అలా రాయకపోతే మన పద్దతిలో తప్పు వేద్దాము. ఇక్కడ వున్న వాళ్ళు, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అయినా సరే వాళ్ళ బళ్ళు మన తెలంగాణా జిల్లాల్లో లో రిజిస్టర్ అయ్యివుంటే, వాళ్లకు వాళ్ళే, వాళ్ళ నంబర్ ప్లేట్స్ మీద AP అని తీసేసి TG అని వ్రాయిన్చుకోవాలని చెప్పుదాము. ఈ ప్రభుత్వానికి ఎటువంటి బిల్లులు, టాక్స్ లు కట్టవద్దు. మన స్కూల్స్ లో పిల్లలకి జిల్లాలతో కూడిన మన తెలంగాణా మేప్ లు ఇద్దాము. ఎక్కడా గొడవ చెయ్యకుండానే ఇవన్నీ చెయ్యవచ్చు. మన యునివర్సిటీ రిజిస్ట్రార్లు గా సింహాలు వస్తాయో, నరసింహాలు వస్తాయో రానివ్వండి. విద్యార్థులు ఎవరూ పరీక్షలు రాయడం మానవద్దు. ఎందుకంటే మన రాష్ట్రం వచ్చేసరికి మీరందరూ ఉద్యోగార్థులై వుండాలి.

ఈ ఒక్కసారికి మాత్రం ప్రాణ త్యాగాలు అవసరమైతే ఆ అవకాశం మన రాజకీయనాయకులకు గానీ వాళ్ళ పిల్లలకి గానీ ఇద్దాము. ఎందుకంటే మనం మన రాష్ట్రం ఏర్పాటు అయ్యాకా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని వాగ్దానాలు చేసాము. వాగ్ధాన భంగం అనేది గో హత్యతో సమానం అని మన పెద్దలు అంటారు. కాబట్టి మనం రాష్ట్ర ఏర్పాటు కు ముందే మన మాట తప్పకూడదు. పైగా వాళ్ళు కూడా మనం వాళ్లకి అవకాశం ఇవ్వడంలేదని, స్వాతంత్య్రం  వచ్చాకా నిరాహార దీక్షలతో ప్రాణత్యాగం చేసిన కీ.శే. పొట్టి శ్రీ రాములు, శ్యాం ప్రసాద్ ముఖర్జీ లకి వచ్చినట్టు వాళ్లకి పేరు రాకుండా మనమే అడ్డుకుంటున్నామని, వాళ్లకు లాగే ప్రాణత్యాగం చేసి విగ్రహాలు పెట్టించుకొనే అవకాశం ఇవ్వడం లేదని మూలుగుకుంటున్నారు. మన రాష్ట్రం ఏర్పాటు కాకముందే మనం ఇలా దెబ్బలాడుకోవడం మంచిది కాదు. పైగా ఒకళ్ళ ఉసురు మన రాష్ట్రానికి మంచిది కాదు. కాబట్టి ఈ సారికి మాత్రం అవకాశం వాళ్ళకే ఇద్దాము. గత 60 సంవత్సరాల నుండి అన్ని సార్లూ ప్రాణ త్యాగం చేసే అవకాశం విద్యార్ధులే వాడుకుంటున్నారు, అది పద్ధతి కాదు కాబట్టి ఈ సారి వాళ్లకి ఇవ్వవలసిందే. మీరు గనుక అలా చెయ్యకపోతే వాళ్ళు మానవ హక్కుల సంఘానికి  వెళ్ళడానికి కూడా సిద్దపడుతున్నారు. కనుక మనమే ఈ సారి మన రాజకీయనాయకులని నిరాహార దీక్షలో కూర్చోపెడదాము. ఏం, ఆంధ్రా వాల్లకేనా పొట్టి శ్రీ రాముల లాంటి నాయకులుండేది, మనమేమైనా వాళ్ళకంటే తీసిపోయామా, మనకూ అలాంటి ఒక వ్యక్తి కావాలి, మనమూ విగ్రహాలు పెట్టుకోవాలి, తప్పదు. వాళ్ళకంటే మనమే గొప్ప, మన రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చెయ్యడానికి మన వాళ్ళు ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ ముందుకు వస్తున్నారు. మనమే వాళ్ళల్లో ఒకరిని చిట్టీ తీసి సెలెక్ట్ చెయ్యాలి.

నేషనల్ న్యూస్ పేపర్స్ లో యాడ్ ఇద్దాము. ఫిబ్రవరి 1st నుండి మన జిల్లాలకు వచ్చే అన్ని లెటర్స్ మీద తెలంగాణా స్టేట్ అనే వుండాలి అని. అలా లేకపోతే అవి డెలివరి అవ్వవు అని ఇద్దాము. మన కొరియర్ కుర్రాళ్ళకి చెపుదాము, అలా లేకపోతే తప్పు అడ్రస్స్ అని చెప్పి వెనక్కుపంపెయమని. అన్ని షాప్ ల వాళ్లకి వాళ్ళ షాప్ నుండి ఇచ్చే కవర్స్ మీద వాళ్ళ అడ్రస్ వున్నచోట తెలంగాణా స్టేట్ అని ప్రింట్ చేయిన్చమందాము. మన లాయర్స్ లో కొంతమంది మన మీద వచ్చే కేసులు ఫ్రీ గా వాదించాలి అని అడుగుదాము. ఇవన్నీ కూడా ఖాళీగా వున్న నాకు లాంటి వాళ్ళే చెయ్యాలి. విద్యార్ధులు ఎవరూ కూడా వాళ్ళ చదువులు మానవద్దు. 18 ఏళ్ళ లోపు పిల్లలెవరూ ఈ విషయం లోకి రాకుండా చూసుకోవాలి. మన రాజకీయ నాయకులు నిరాహార దీక్షలకు, ప్రాణ త్యాగాలకు మాత్రమే పరిమితమవ్వాలి. వాళ్ళు చేసేదానిలో మనమెవరమూ కల్పించుకోమని వాళ్లకు మాట ఇవ్వాలి. వాళ్ళు కూర్చునే టెంట్ ల దగ్గర కుర్రవాళ్ళు ఎవరూ ఉండకూడదు. ఎవరి పని వాళ్ళు చేసుకుపోవాలి. ఒకరి విషయాల్లో ఒకరు కల్పించుకోకూడదు. ఇలా ముందే మాట తీసుకోవాలి. లేకపోతే, తరువాత వాళ్ళు రెచ్చగొట్టారు కనుక కుర్రవాళ్ళు రెచ్చిపోయారు అని వాళ్ళమీద కేసులు పెడతారు.

మన ఆశయ సాధన కోసం ఇలా చేస్తే ఎలా వుంటుందో ఆలోచించండి.

1 comment: